మూగజీవాలపై విషప్రయోగం

3 May, 2018 12:58 IST|Sakshi
మృతి చెందిన ఎద్దును పరిశీలిస్తున్న పశువైద్యాధికారి రామారావు, తదితరులు

సీతానగరం: మూగజీవాలపై విషప్రయోగం చేసిన సంఘటన మండలంలోని బూర్జ గ్రామంలో చోటుచేసుకుంది. ఈ సంఘటనలో ఆవు, ఎద్దు మృతి చెందడంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన కోట శివున్నాయుడు కుమారులు పోలినాయుడు, శ్రీనివాసరావు వేర్వేరుగా ఉంటున్నా వ్యవసాయం కలిసే చేస్తున్నారు.

ఇందులో భాగంగానే ఆవులు, ఎద్దులు పెంచుతున్నారు. పోలినాయుడు, శ్రీనివాసరావు ప్రతి రోజూ సాయంత్రం పశువులకు కుడితి పెట్టి ఇంటికి వస్తుంటారు. ఇందులో భాగంగానే మంగళవారం సాయంత్రం కూడా శాలలో ఉన్న పశువులకు కుడితి పెట్టి వీరిద్దరూ ఇంటికి చేరుకున్నారు. బుధవారం ఉదయం వెళ్లి చూడగా ఆవు, ఎద్దు స్పృహ తప్పి పడిపోయి ఉన్నాయి.

వెంటనే పశువైద్యాధికారి ఎస్‌. రామారావుకు సమాచారం అందించడంతో ఆయన వచ్చి విషప్రయోగం వల్లే పశువులు చనిపోయినట్లు నిర్ధారించారు. ఎవరో గిట్టని వారే ఈ పని చేసుంటారని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంఘటనలో సుమారు 60 వేల రూపాయల విలువ చేసే ఆవు, ఎద్దు మృతి చెందాయని బాధితులు లబోదిబోమంటున్నారు.  

నెలలో రెండో నష్టం

ఏప్రిల్‌ ఒకటో తేదీ రాత్రి సంభవించిన అగ్ని ప్రమాదంలో మూడు పూరిళ్లు, దుకాణం, ఆవు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో మృతి చెందిన ఆవు కూడా పోలినాయుడికి చెందినదే. ఎవరో కావాలనే తమపై కక్ష కట్టి ఈ దారుణాలకు పాల్పడుతున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు.   

మరిన్ని వార్తలు