రవిశంకర్‌ను పట్టిస్తే రూ.లక్ష 

29 Jul, 2019 04:20 IST|Sakshi
కిడ్నాపర్‌ రవిశేఖర్‌ (ఫైల్‌)

హైదరాబాద్‌ కిడ్నాప్‌ కేసు నిందితుడిపై రివార్డు ప్రకటించిన పోలీసులు

నిందితుడిపై నాలుగు రాష్ట్రాల్లో కేసులు నమోదు 

కడప అర్బన్‌: నాలుగు రాష్ట్రాల్లో మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్‌గా ఉన్న ఐతం రవిశంకర్‌ అలియాస్‌ రవి ఆచూకీ కోసం తెలంగాణా రాష్ట్ర పోలీసులు వైఎస్సార్‌ జిల్లాలో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. అతన్ని పోలీసులకు పట్టిస్తే రూ.లక్ష బహుమతి ఇస్తామని ప్రకటించారు. తెలంగాణ పోలీసుల బృందం ఆదివారం కడపలో విలేకరులతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా కంకిపాడు మండలం దావులూరు గ్రామానికి చెందిన ఐతం రవిశేఖర్‌ అలియాస్‌ రవి (45) ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, కర్ణాటక, తమిళనాడు పోలీసులకు మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్‌.

ఈ నాలుగు రాష్ట్రాల్లో అతనిపై 30 కేసులకు పైగా నమోదయ్యాయి. ఇతను  వైజాగ్‌ కేంద్రకారాగారంలో శిక్షను అనుభవిస్తూ, ఈ ఏడాది మే 21న కోర్టుకు ఎస్కార్ట్‌తో వాయిదాకు వెళుతున్న సమయంలో కన్నుగప్పి పరారయ్యాడు. కర్ణాటకలో ఐ20 కారును దొంగిలించి, దానికి నకిలీ నంబర్‌ (ఏపీ 39 ఏక్యూ 1686) వేసుకుని ఫార్మసీ చదువుతున్న రంగారెడ్డి జిల్లా రంగన్నగూడకు చెందిన యువతి సోని(21)ని కిడ్నాప్‌ చేశాడు.

అంతకు ముందు  ఈనెల 23న ఉదయం సోని తల్లిదండ్రులు నడుపుతున్న హోటల్‌కు టీ తాగేందుకు వెళ్లి వారితో మాటలు కలిపాడు. సోనికి ఉద్యోగం ఇప్పిస్తానని మాయమాటలు చెప్పాడు. ఆమె తండ్రితో కలిసి తన కారులో ఎక్కించుకుని మధ్యాహ్నం వరకు తిరిగారు. తరువాత ఆమె తండ్రిని కుమార్తెకు సంబంధించిన సర్టిఫికెట్లను జిరాక్స్‌ చేయించుకు రమ్మని పంపాడు. ఆయన తిరిగి వచ్చేసరికి కారు వెళ్లిపోయింది. అందులో తన కుమార్తెను తీసుకుని వెళ్లాడని, ఆమె కిడ్నాప్‌నకు గురైందని రాచకొండ కమిషనరేట్‌లో ఫిర్యాదు చేశారు.

వెంటనే సీపీ మహేష్‌ భగవత్‌ నిందితుడిని పట్టుకునేందుకు 8 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఓ బృందం టాస్క్‌ఫోర్స్‌ సీఐ రాజు ఆధ్వర్యంలో అదే రోజున కారు ఆచూకీని వెతుక్కుంటూ వైఎస్సార్‌ జిల్లాలోకి వచ్చారు. 24వ తేదీన కడపలో ప్రవేశించిన కారు ఉదయం ఒంటిమిట్ట హరిత హోటల్‌ వరకు వెళ్లిన పుటేజీలు కనిపించాయి. కడపలో ఓ సీసీ కెమెరా ఫుటేజీలో కారులో వెనుకసీటులో సోని ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఆదివారం కడపలో విలేకరులతో మాట్లాడిన టాస్క్‌ఫోర్స్‌ సీఐ రాజు నిందితుడి ఆచూకీ తెలిపిన వారికి రూ.లక్ష బహుమతిగా ప్రకటించామన్నారు.

మరిన్ని వార్తలు