క్రికెట్‌ పందేలు.. దొంగతనాలు

27 Sep, 2017 07:37 IST|Sakshi

వైఎస్‌ఆర్‌ జిల్లా , ప్రొద్దుటూరు క్రైం :
అతను డిగ్రీ వరకు చదువుకున్నాడు.. మధ్యలో చదువు మానేసి చిల్లరగా తిరగడం మొదలెట్టాడు.. స్నేహితులతో కలిసి క్రికెట్‌ పందేలు నిర్వహించేవాడు.. తర్వాత క్రికెట్‌ పందేలే వ్యసనంగా మార్చుకున్న అతను బైక్‌ దొంగతనాలకు అలవాటు పడ్డాడు.. చివరకు పోలీసులకు దొరికి కటకటాల పాలయ్యాడు. అరెస్ట్‌ వివరాలను మంగళవా రం టూ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ ఆర్ల శ్రీనివాసులు వివరించారు. రాజుపాళెం మండలం టంగుటూరు గ్రామానికి చెందిన వెంకటేశ్వరరాజు డిగ్రీ వరకు చదువుకున్నాడు. తర్వాత చదువు మానేసి చిల్లరగా తిరిగేవాడు. ఈ క్రమంలో స్నేహితులతో కలిసి క్రికెట్‌ బెట్టింగ్‌ ఆడేవాడు. అందులో ఒకటి, రెండు సార్లు డబ్బు రావడంతో పందేలకే బానిస అయ్యాడు. తాగుడుకు అలవాటు పడిన యువకుడు జల్సా జీవితం అనుభవించడం మొదలు పెట్టాడు. క్రికెట్‌ పందేలు, జల్సా జీవితం గడపడానికి చేతిలో డబ్బు లేకపోవడంతో ప్రొద్దుటూరు ఆర్టీసీ బస్టాండులోని బైక్‌ను కొన్ని రోజుల క్రితం దొంగిలించాడు. ఇలా ప్రొద్దుటూరు, మైదుకూరు ప్రాం తాల్లో సుమారు 18 బైక్‌లను చోరీ చేశా డు. దొంగిలించిన ద్విచక్ర వాహనాల్లో కొన్నింటిని బద్వేలులో ఉన్న తన స్నేహితుడు వెంకటసుబ్బయ్యకు తక్కువ ధరకు విక్రయించాడు. వెంకటసుబ్బయ్య బద్వేలులోని ఓ వస్త్ర దుకాణంలో గుమాస్తాగా పని చేస్తున్నాడు.

ఇలా పోలీసులకు దొరికిపోయాడు..
సీఐ సదాశివయ్య, టూ టౌన్‌ ఎస్‌ఐ మధుమల్లేశ్వరరెడ్డిలు తమ సిబ్బందితో కలిసి మడూరు రోడ్డులో వాహన తని ఖీలు చేపట్టారు. అదే సమయంలో వెంకటేశ్వరరాజు బైక్‌లో అదే దారిలో రాగా పోలీసులు ఆపి వాహన రికార్డులు చూపించమన్నారు. అయితే అతను రికా ర్డు చూపించకపోగా, పోలీసులను చూసి భయంతో వణికిపోయాడు. అనుమానించిన పోలీసులు అతన్ని స్టేషన్‌కు తీసుకొని వెళ్లి విచారించగా బైక్‌ దొంగతనాలు చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. ప్రొద్దుటూరు ఆర్టీసి బస్టాండులో ఆరు, జిల్లా ఆస్పత్రి ఆవరణంలో రెండు, కోట వీధిలో ఒకటి, ఎర్రగుంట్ల బైపాస్‌రోడ్డులో ఒకటి, మైదుకూరు ఆర్టీసీ బస్టాండులో 7 బైక్‌లను చోరీ చేసినట్లు అతను అంగీకరించాడు. వాటిలో ఆరు బైక్‌లను బద్వేలుకు చెందిన తన స్నేహితుడు వెంకటసుబ్బయ్యకు విక్రయించినట్లు పోలీసులకు వివరించాడు. వెంకటసుబ్బయ్యను కూడా అరెస్టు చేశారు. పలు ప్రాంతాల్లో దాచిన బైక్‌లను స్వాధీనం చేసుకొని, ఇద్దరిని రిమాండుకు పంపిస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు.

పోలీసులకు రివార్డులు
ఈ కేసులో మంచి ప్రతిభ కనబరచిన ఎస్‌ఐ మధుమల్లేశ్వరరెడ్డి, హెడ్‌కానిస్టేబుల్‌ దీప్లానాయక్, కానిస్టేబుళ్లు దస్తగిరి, శివశంకర్, భద్రారెడ్డి, రామచంద్రరాజులకు డీఎస్పీ నగదు రివార్డులను అందజేశారు. భారీగా మోటార్‌ బైక్‌లను రికవరీ చేసినందుకు ఎస్పీ అట్టాడ బాబూజీ ప్రొద్దుటూరు టూ టౌన్‌ పోలీసులను అభినందించారు.

మరిన్ని వార్తలు