మరో నకిలీ బాబా వ్యవహారం గుట్టురట్టు..

17 Oct, 2017 22:34 IST|Sakshi

సాక్షి, సనత్‌నగర్‌(హైదరాబాద్‌): ఇటివల కాలంలో దేశంలో దొంగ బాబాల అరెస్టులు సంచలనం సృష్టించాయి. తనకు ఆధ్యాత్మిక శక్తులు ఉన్నాయని చెప్పుకొంటున్న దొంగబాబాను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన నగరంలోని సనత్‌నగర్‌లో చోటుచేసుకుంది. వివరాలివి.. నగరంలో ఓ దొంగ బాబా ఏ సమస్యనైనా పరిష్కరిస్తానని చెబుతూ అమాయకుల వద్ద నుంచి లక్షల రూపాయలు వసూలు చేస్తున్న దొంగ బాబాను బేగంపేట పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

బేగంపేట ఎస్‌ఐ రవీందర్‌ తెలిపిన వివరాల మేరకు.. ఢిల్లీ రాష్ట్రం ముస్తఫాబాద్‌కు చెందిన శంషద్‌ మాలిక్‌(40) మరో ముగ్గురు స్నేహితులు షాజద్‌ మాలిక్‌, అసిఫ్‌, ఫిరోజ్‌ మాలిక్‌లతో కలిసి నకిలీ బాబా అవతారమెత్తాడు. అమాయకులను కలిసి తమకు దైవ శక్తులు ఉన్నాయని, వారం రోజుల్లో ఎలాంటి సమస్యనైనా పరిష్కరిస్తామని నమ్మబలికారు. 

వారు నమ్మే విధంగా కళ్ల ముందు ఏదో మ్యాజిక్‌ చేస్తుంటారు. దీనిని నమ్మిన అమాయక ప్రజల నుంచి లక్షల్లో డబ్బులు వసూలు చేసి పరారవుతుంటారు. గతంలో ఆరు కేసుల్లో నిందితుడిగా ఉన్న శంషద్‌  మాలిక్‌ను మంగళవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పరారీలో ఉన్న మరో ముగ్గురి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

మరిన్ని వార్తలు