పథకం ప్రకారమే నజ్మా హత్య 

26 Jan, 2020 12:45 IST|Sakshi

హైదరాబాద్‌ : సంచలనం సృష్టించిన బాలిక నజ్మా హత్య పథకం ప్రకారమే చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ కేసులో సీసీ కెమెరాల ఫూటేజీ కీలకంగా మారింది. చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులు సుమారు వందలాది సీసీ కెమెరాల ఫూటేజీలను పరిశీలించారు. అనుమానస్పద మృతి అని ముందుగా భావించినా హత్య అని నిర్ధారణకు వచ్చిన వెంటనే మూడు బృందాలను రంగంలోకి దింపి నిందితుడిని గంటల వ్యవధిలో అదుపులోకి తీసుకున్నారు. చిలకలగూడ ఠాణా పరిధిలోని వారాసిగూడలో బాలిక నజ్మా శుక్రవారం వేకువజామున దారుణ హత్యకు గురైన సంగతి విధితమే. శుక్రవారం ఉదయం 7.10 గంటలకు డయల్‌ 100కు సమాచారం అందిన 5 నిమిషాల్లో పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. భవనం పైనుంచి పడి మృతి చెందినట్లు భావించినా మృతదేహం ఒంటిపై గాయాలు ఉండటంతో అప్రమత్తమయ్యారు. రెండు భవనాల మధ్య సందులో మృతదేహం పడిఉండటంతో ఏ భవనం నుంచి పడిందో తెలుసుకునేందుకు పైకి వెళ్లారు. అక్కడ రక్తపు మరకలు చూసి నిర్ధారించుకున్నారు. పోలీసులు చెప్పేంతవరకు మృతురాలి కుటుంబసభ్యులకు తెలియదు. 

నజ్మా బాత్‌రూంలోనో లేక మేడపైనో చదువుకుంటుందని ఆమె కుటుంబసభ్యులు భావించారు. నజ్మాను దారుణంగా చంపేశారని తెలుసుకున్న కుటుంబసభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు. రంగంలోకి దిగిన చిలకలగూడ సీఐ బాలగంగిరెడ్డి మృతురాలి కుటుంబసభ్యులతో మాట్లాడటంతో నిందితుడు సోహెబ్‌ పేరు వెలుగులోకి వచ్చింది. ఐదేళ్ల నుంచి పెళ్లి చేసుకుంటానని తమ కుమార్తె వెంటపడుతున్నాడని చెప్పడంతో సోహెబ్‌ కోసం ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి ఇంట్లో మంచం కింద దాక్కున్న సోహెబ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అదే సమయంలో వందలాది సీసీ కెమెరాల ఫూటేజీలను పరిశీలించారు. సోహెబ్‌ తన ఇంటి నుంచి బయటకు వస్తున్న, మృతురాలి ఇంటి మేడపైకి వెళ్తున్న దృశ్యాలు నమోదయ్యాయి. సోహెబ్‌ ఫేస్‌బుక్‌ పేజీని ఓపెన్‌ చేసి సీసీ కెమెరాల్లో నమోదైన ఫొటోలతో సరిపోల్చుకుని అతడే నిందితుడని నిర్ధారించుకున్నారు.  

మృతి చెందినట్లు నిర్ధారణ చేసుకునేందుకు మరోమారు..  
గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత 12.45 గంటలకు సోహెబ్‌ మృతురాలి ఇంటికి వచ్చి టెర్రాస్‌ పైకి వెళ్లాడు. అప్పటికే అక్కడ ఉన్న నజ్మాతో ప్రేమ, పెళ్లి వ్యవహరాలపై గొడవ పడ్డాడు. ఇతరులతో చాటింగ్‌ చేయడాన్ని సహించలేని సోహెబ్‌ అందుబాటులో ఉన్న గ్రానైట్‌ రాయితో దాడి చేసి నజ్మాను దారుణంగా హత్య చేశాడు. మృతదేహాన్ని ఈడ్చుకుంటూ వెళ్లి రెండు భవనాల మధ్య కిందికి తోసేసి ఇంటికి వెల్లిపోయాడు. నజ్మా మృతి చెందిదా లేదా అనే అనుమానంతో వేకువజాము 3.15 నిమిషాలకు మరోమారు అక్కడకు చేరుకుని మృతి చెందినట్లు నిర్ధారించుకున్నాడు. రెండవ మారు వచ్చివెళ్లిన దృశ్యాలు కూడా సీసీ కెమెరాల్లో నమోదైనట్లు పోలీసులు గుర్తించారు. చాకచక్యంగా వ్యవహరించి బాలిక నజ్మా హత్య కేసును గంటల వ్యవధిలో చేధించిన పోలీసులను ఉన్నతాధికారులు, ప్రజలు అభినందించారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు