ఖాకీ కర్కశం

31 Aug, 2018 08:50 IST|Sakshi
అక్రమ అరెస్ట్‌ను నిరసిస్తూ పోలీసులతో మాట్లాడుతున్న కేతిరెడ్డి పెద్దారెడ్డి

వైఎస్సార్‌సీపీ తాడిపత్రి సమన్వయకర్త కేతిరెడ్డి పెద్దారెడ్డిపై అక్రమ కేసు  

అరెస్ట్‌ చేసేందుకు భారీగా పోలీస్‌ బలగాలు

నాయకుడి అరెస్ట్‌ను నిరసిస్తూ తిమ్మంపల్లి వాసుల ఆందోళన

వర్షంలోనూ పోలీసులను నిలవరించినగ్రామస్తులు

అధికార పార్టీ చెప్పుచేతల్లో పోలీసు శాఖ పరువు దిగజారుతోంది. పచ్చని గ్రామాల్లో పోలీసుల చర్యలు వర్గపోరుకు ఆజ్యం పోçస్తున్నాయి. వైఎస్సార్‌సీపీ నాయకులే లక్ష్యంగా అక్రమ కేసులు బనాయించడం.. టీడీపీ నేతల మెప్పు పొందేందుకు అరెస్టులకు తెగబడటం విమర్శలకు తావిస్తోంది. యల్లనూరు మండలం తిమ్మంపల్లిలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తపై జేసీ వర్గీయులు దాడి చేశారు. ఈ కేసులో చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు.. జేసీ ఒత్తిడితో ఆయన వర్గీయులు నమోదు చేసిన అక్రమ కేసులో ఏకంగా పార్టీ తాడిపత్రి నియోజకవర్గ సమన్వయకర్తను అరెస్టు చేయడం దిగజారిన రాజకీయాలకు నిదర్శనం.

అనంతపురం, యల్లనూరు : అధికారంలో ఉన్నాం..మాకెవరు అడ్డు అన్న రీతిలో అధికార పార్టీ నేతలు వ్యవహరిస్తున్నారు. టీడీపీ నేతల అరాచకాలకు అడ్డూ అదుపులేకుండా పోతోంది. ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లోనూ చిచ్చు పెడుతున్నారు. వైఎస్సార్‌సీపీ నాయకులే లక్ష్యంగా రెచ్చిపోతున్నారు. ప్రశ్నిస్తే అక్రమంగా కేసులు బనాయిస్తున్నారు. పోలీసులు కూడా అధికార పార్టీనేతలకు వత్తాసు పలుకుతూ కర్కశత్వం ప్రదర్శిస్తున్నారు.బుధ, గురువారాల్లో యల్లనూరు మండలం తిమ్మంపల్లి గ్రామంలో చోటుచేసుకున్న అధికార దురహంకారం, పోలీసుల దౌర్జన్యమే ఇందుకు నిదర్శనం.

వివరాలు..యల్లనూరు మండలం తిమ్మంపల్లిలో వైఎస్సార్‌సీపీ కార్యకర్త బాషాపై ఇదే గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్తలు, జేసీ అనుచరులు మోహన్‌రెడ్డి, మహేశ్వరరెడ్డి, వెంకటరెడ్డి, పెద్దారెడ్డి, రమణారెడ్డి మూకుమ్మడిగా బుధవారం దాడి చేశారు. విషయం తెలుసుకున్న పెద్దారెడ్డి తిమ్మంపల్లి గ్రామానికి గురువారం చేరుకొని బాధితుడిని పరామర్శించారు. అనంతరం బస్టాండు వద్ద కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎలాంటి గొడవలూ ఘర్షణలకు పోకండి అని కార్యకర్తలకు సూచించారు.అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉద్దేశపూర్వకంగానే గొడవలు సృష్టించి, కార్యకర్తలపై కేసులు బనాయిస్తున్నారని సర్దుకుపోవా లని తెలిపారు.  ఇదే సందర్భంలోనే వైఎస్సార్‌సీపీ కార్యకర్త బాషాపై దాడిచేసిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు అక్కడికి చేరుకుని వైఎస్సార్‌సీపీ నాయకులను రెచ్చగొట్టారు. దీంతో టీడీపీ కార్యకర్తలను వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు నిలదీశారు.  దీంతో టీడీపీ నాయకులు జేసీ ప్రభాకర్‌రెడ్డి ద్వారా  కేసులు నమోదు చేయించారు.

పోలీసులను అడ్డుకున్న ప్రజలు
కేతిరెడ్డి పెద్దారెడ్డిపై కేసు నమోదు చేయడాన్ని యల్లనూరు మండల వ్యాప్తంగా ప్రజలు తప్పుపట్టారు. గురువారం సాయంత్రం పెద్దారెడ్డిని అరెస్ట్‌ చేయడానికి వచ్చిన పోలీసు బలగాలను అడ్డుకున్నారు. ఏతప్పూ చేయకున్నా కేసులు ఎలా బనాయిస్తారు? ఎందుకు అరెస్ట్‌ చేస్తారని తిమ్మంపల్లి గ్రామస్తులు పోలీసులను నిలదీశారు. పోలీసులు డౌన్‌ డౌన్‌ అంటూ నినాదాలు చేస్తూ పెద్దారెడ్డిని అరెస్ట్‌ చేయకుండా అడ్డుకున్నారు. పోలీసులు ఓ వైపు మహిళలను, గ్రామస్తులను చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నా.. మరోవైపు వర్షం పడుతున్నా వెనక్కి తగ్గకుండా పోలీసులను నిలవరించి, పెద్దారెడ్డిని అరెస్ట్‌ చేయకుండా దాదాపు 3 గంటలపాటు అడ్డుకున్నారు.

వైఎస్సార్‌సీపీ నేతపై అక్రమ కేసులు నమోదు – అరెస్ట్‌  
వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలు టీడీపీ వారు రెచ్చగొట్టిన విధానాన్ని తప్పుబడుతూ నిలదీసే ప్రయత్నం చేశారు. దీంతో టీడీపీ కార్యకర్తలు నేరుగా వారి నాయకుడు జేసీ ప్రభాకర్‌ రెడ్డితో సంప్రదించి, కేతిరెడ్డి పెద్దారెడ్డితోపాటు మరికొందరు వైఎస్సార్‌ సీపీ నాయకులపై 147, 148, 307, ఆర్‌/డబ్ల్యూ 149 ఐపీసీ, 354, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేయించారు. గురువారం రాత్రి 10 గంటల సమయంలో పోలీస్‌ బలగాలు గ్రామస్తులు, మహిళలను చెదరగొట్టి కేతిరెడ్డి పెద్దారెడ్డిని అరెస్ట్‌ చేసి, పామిడి స్టేషన్‌కు తరలించారు.

మరిన్ని వార్తలు