యువతి హత్య కేసును ఛేదించిన పోలీసులు

3 Jun, 2020 13:10 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

లక్నో : మిస్టరీగా మిగిలిపోయిన 2019 నాటి ఓ యువతి హత్య కేసును పోలీసులు ఛేదించారు. యువతి ప్రియుడే ఆమెను హత్య చేసినట్లు తేల్చారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. 2019 జూన్‌ 14న ఉత్తరప్రదేశ్‌ మీరట్‌లోని లోహియా గ్రామ పొలంలో తల లేని యువతి శవం పోలీసులకు దొరికింది. చేతులు కూడా తొలిగించి ఉండటంతో హత్య కేసును ఛేదించటం పోలీసులకు ఇబ్బందిగా మారింది. యువతి శరీరంపై ఆమె, ప్రియుడి పేర్లు పచ్చబొట్టు పొడిచి ఉండటంతో వాటి ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. (నటుడి తమ్ముడిపై లైంగిక వేధింపుల కేసు)

లుధియానాలో నమోదైన ఓ సెల్‌ నెంబర్‌ ఆధారంగా పోలీసులు కేసులో పురోగతి సాధించారు. మృతిరాలిది లుధియానాగా గుర్తించారు. మృతిరాలి తల్లిదండ్రులు ఇచ్చిన మిస్సింగ్‌ కేసు ఆధారంగా ఆమె ప్రియుడికోసం అన్వేషణ ప్రారంభించారు. అనంతరం ఉత్తరప్రదేశ్ లోహియా గ్రామానికి చెందిన షాకిబ్‌ అనే యువకుడ్ని అదుపులోకి తీసుకున్నారు. 

మారు పేరుతో ప్రేమ.. ఆపై హత్య
ఉత్తరప్రదేశ్ లోహియా గ్రామానికి చెందిన షాకిబ్‌ లుధియానాలోని ఓ షాపులో పని చేస్తుండేవాడు. ఈ నేపథ్యంలో అదే ప్రాంతానికి చెందిన ఓ 19 ఏళ్ల యువతితో అమన్‌ అనే మారు పేరుతో స్నేహం చేశాడు. ఇద్దరి స్నేహం కొద్దికాలానికి ప్రేమగా మారింది. ఓ రోజు యువతి ఇంట్లో నగలు తీసుకుని అతడితో పారిపోయింది. ఇద్దరూ డౌరాలాలోని ఓ అద్దె ఇంట్లో కలిసి ఉండేవారు. ఓ నెల తర్వాత అతడు తమ మతం కాదని ఆమె గ్రహించింది. ఈ విషయమై ఇద్దరి మధ్యా తరచూ గొడవలు జరిగేవి. దీంతో ఆగ్రహించిన షాకిబ్‌ ఎలాగైనా ఆమె అడ్డు తొలిగించుకోవాలని పథకం వేశాడు. ఈద్‌ రోజున యువతి తాగే కూల్‌ డ్రింక్‌లో మత్తు మందు కలిపి ఇచ్చాడు. ఆమె మత్తులోకి వెళ్లగానే అక్కడికి దగ్గరలోని పొలాల్లోకి తీసుకెళ్లి గొంతునులిమి చంపేశాడు. అనంతరం తల, చేతులు శరీరం నుంచి వేరుచేసి వెళ్లిపోయాడు. ( ప్రేమజంటకు మధ్యవర్తిత్వం.. చివరికి ప్రాణాలు )

కాగా, యువతి హత్యలో షాకిబ్‌ కుటుంబసభ్యుల హస్తం ఉన్నట్లు పోలీసులు తేల్చారు. కేసుతో సంబంధం ఉన్న ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం నిందితుడిని వైద్య పరీక్షల కోసం తరలిస్తుండగా తప్పించుకునే ప్రయత్నం చేశాడు. ఓ పోలీసు వద్ద నుంచి తుపాకి లాక్కుని కాల్పులు జరిపాడు. దీంతో ఎదురు కాల్పులు జరిపిన పోలీసులు, అతడి కాలు భాగంలో కాల్చి పట్టుకున్నారు.

మరిన్ని వార్తలు