కరోనా: తప్పుడు ప్రచారానికి ‘సంకెళ్లు’ 

16 Apr, 2020 08:24 IST|Sakshi
చిత్తూరులో విష్ణువర్ధన్‌రెడ్డిని అరెస్టు చేసి, జైలుకు తరలిస్తున్న డీఎస్పీ తదితరులు  

సోషల్‌ మీడియాలో కరోనాపై అసత్య ప్రచారం

పీలేరు, పలమనేరులో ఇప్పటికే కేసులు, అరెస్టు 

తాజాగా తెలంగాణ వ్యక్తి కటకటాల్లోకి.. 

కరోనాను కట్టడి చేయడానికి ప్రభుత్వం, అధికార యంత్రాంగం నానాపాట్లు పడుతుంటే కొందరు అరచేతిలో ఉన్న సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. తప్పుడు వార్తలను ప్రచారంలోకి తీసుకొచ్చి శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారు. దీనిపై పోలీసు యంత్రాంగం కన్నెర్ర చేస్తోంది. ఇలాంటి నేరానికి పాల్పడ్డ ఓ వ్యక్తిని చిత్తూరు పోలీసులు బుధవారం అరెస్టు చేసి, జైలుకు తరలించారు. 

చిత్తూరు అర్బన్‌: అరచేతిలో సెల్‌ఫోన్‌ ఉంది కదా అని వాస్తవాలను ధ్రువీకరించుకోకుండా ఎవరో పంపిన మెనేజ్‌లను ఫార్వర్డ్‌ చేయడం వల్ల సమస్యలు తప్పవు. ఓ వ్యక్తికి కరోనా వైరస్‌ సోకిందంటూ సామాజిక మాధ్యమాల్లో అతని ఫొటో పెట్టడం, మరికొందరు ఓ కాలనీలో ఐదు పాజిటివ్‌ కేసులు వచ్చాయని తప్పుడు ప్రచారం చేయడం కచ్చితంగా నేరం కిందకే వస్తుందని పోలీసులు చెబుతున్నారు. అలాంటి వాళ్లపై ఐపీసీ సెక్షన్‌ 153, 188, 505, 269లతో పాటు ఐపీసీ సెక్షన్‌ 10 (2),(1) ఆఫ్‌ ద డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ యాక్ట్‌–2005, సెక్షన్‌ 66 ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ యాక్ట్‌ ప్రకారం కేసు నమోదు చేసి జైలుకు తరలిస్తున్నారు.

ఈ కేసుల్లో నేరం రుజువైతే 2 ఏళ్లకు పైగా జైలుశిక్ష పడుతుంది. కాణిపాకం ఆలయాన్ని క్వారంటైన్‌ సెంటర్‌గా ఏర్పాటు చేశారంటూ తెలంగాణ రాష్ట్రం సిద్దిపేట జిల్లాకు చెందిన ఎం.విష్ణువర్ధన్‌రెడ్డి (56) తన ఫేస్‌బుక్, ట్విటర్‌ ఖాతాల్లో తప్పుడు పోస్టులు చేశాడు. వాట్సాప్‌ ద్వారా పలువురికి పంపాడు. కాణిపాకం ఈఓ ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి, కోర్టుకు తరలించారు. కోర్టు ఆదేశాలతో చిత్తూరులోని జిల్లా జైలుకు తరలించారు. గత నెల పలమనేరులో ఓ చార్టెడ్‌ అకౌంటెంట్‌కు కరోనా సోకిందంటూ ఫేస్‌బుక్, వాట్సప్‌లలో మెసేజ్‌ పెట్టినందుకు గంగవరానికి చెందిన వారిపై కేసులు నమోదయ్యాయి. 

నమ్మొద్దు.. 
వాట్సాప్, ఇతర సోషల్‌ మీడియాలో వచ్చే వార్తలన్నింటినీ నమ్మొద్దు. ఒకటికి రెండుసార్లు నిర్ధారించుకున్న తర్వాత నిజాన్ని నమ్మండి. అంతేతప్ప వచ్చిన మెసేజ్‌లను ఫార్వర్డ్‌ చేస్తూ వెళితే ఓ దశలో భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. 
– ఎస్‌.సెంథిల్‌కుమార్, ఎస్పీ, చిత్తూరు

మరిన్ని వార్తలు