ఘరానా దొంగ అరెస్ట్‌

11 Jan, 2018 11:36 IST|Sakshi

రూ.2.50 లక్షల సొత్తు స్వాధీనం  

సాక్షి, నెల్లూరు: తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా చోరీలకు పాల్పడుతూ పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని తిరుగుతున్న ఘరానా దొంగను ఎట్టకేలకు సీసీఎస్, నెల్లూరు రూరల్‌ పోలీసులు బుధవారం ఇరుకాళమ్మ గుడి సమీపంలో అరెస్ట్‌ చేశారు. స్థానిక సీసీఎస్‌ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీసీఎస్‌ ఇన్‌స్పెక్టర్‌ షేక్‌ బాజీజాన్‌సైదా నిందితుడి వివరాలను వెల్లడించారు. విడవలూరు తూర్పువీధికి చెందిన తంబి సతీష్‌ ఐదో తరగతి వరకు చదువుకున్నాడు. తండ్రి మరణాంతరం ముత్తుకూరు గేటు (సర్వేపల్లి కాలువకట్ట)వద్ద నివాసముంటున్న అమ్మమ్మ ఇంటికి వచ్చాడు. అక్కడ ఉంటూ జాతీయరహదారి నిర్మాణ సమయంలో ఇనుప వస్తువులు దొంగతనం చేసి వాటిని అమ్మి జల్సా చేశాడు.

ఆ తర్వాత చిల్లర దొంగగా మారి పోలీసులకు చిక్కి జైలు పాలయ్యాడు. జైలులో ఘరానా దొంగ మాల్యాద్రితో పరిచయం అయింది. జైలు నుంచి బయటకు వచ్చిన అనంతరం మాల్యాద్రితో కలిసి ఇంటి దొంగతనాలు చేయడం ప్రారంభించాడుు. ఈ క్రమంలోనే ఓ యువతి (ఉపాధ్యాయురాలి)ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కాపురాన్ని బుచ్చిరెడ్డిపాళెం మండలం రామచంద్రాపురానికి మార్చారు. అక్కడ ఉంటూ ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పనిచేస్తూ అప్పుడప్పుడు దొంగతనాలకు పాల్పడ సాగాడు. ఈ నేపథ్యంలో నిందితుడు గతేడాది 27వ తేదీ అర్ధరాత్రి నెల్లూరురూరల్‌ మండలం నరుకూరులో యానాదిశెట్టి ఇంట్లో దొంగతనానికి పాల్పడ్డాడు. రూ 2.50 లక్షలు విలువ చేసే 9 సవర్ల బంగారు, 30 గ్రాముల వెండి ఆభరణాలను అపహరించుకుని వెళ్లాడు.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనా స్థలంలో లభ్యమైన వేలి ముద్రల ఆధారంగా నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. బుధవారం నిందితుడు ఇరుగాళమ్మ సంఘం వద్ద ఉన్నాడని సీసీఎస్, నెల్లూరురూరల్‌ పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి చోరీ సొత్తును స్వాధీనం చేసుకుని అరెస్ట్‌చేశారు. నిందితుడిని అరెస్ట్‌చేసి చోరీ సొత్తు రాబట్టుటకు కృషి చేసిన సీసీఎస్‌ ఇన్‌స్పెక్టర్‌ షేక్‌ బాజీజాన్‌సైదా, నెల్లూరురూరల్, సీసీఎస్‌ ఎస్సైలు శేఖర్‌బాబు, కె.రామకృష్ణ, సీసీఎస్‌ హెడ్‌కానిస్టేబుల్స్‌ కె.గిరిధర్‌రావు, జె. సురేష్‌బాబు, కానిస్టేబుల్స్‌ వై.సుధాకర్, జీవీ రమేష్, ఎస్‌కే గౌస్‌బాషా, సీహెచ్‌ శ్రీనివాసులను సీసీఎస్‌ డీఎస్పీ ఎం.బాలసుందరరావు అభినందించి రివార్డులు ప్రకటించారు. ఈ సమావేశంలో నెల్లూరు రూరల్, సీసీఎస్‌ ఎస్సైలు శేఖర్‌బాబు, కె. రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.    
 

మరిన్ని వార్తలు