సోదరిని వేధిస్తున్నాడని అంతం

1 Jul, 2019 11:38 IST|Sakshi
జావిద్, అక్రమ్, అహ్మద్‌ను అరెస్టు చేసి చూపిస్తున్న డీఎస్పీ

సాక్షి, వేములవాడ(కరీంనగర్‌) : పదేళ్లుగా వెంటపడుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నాడని, ఎప్పటికైనా నాగుల రవి అనే వ్యక్తితో తనకు ఇబ్బందులేనని తరచూ తమ సోదరి రోదిస్తూ చెప్పడంతో ఆవేశానికి లోనైన ముగ్గురు సోదరులు పట్టపగలే కత్తులతో దాడిచేసి హత్య చేసినట్లు వేములవాడ డీఎస్పీ వెంకటరమణ తెలిపారు. ఈనెల 21న వేములవాడలోని సుబ్రమణ్యంనగర్‌లో పట్టపగలే నాగుల రవి(32)ను కత్తులతో నరికి చంపిన ఘటనలో వేములవాడకు చెందిన అక్రమ్, అహ్మద్, జావిద్‌లను అరెస్టు చేసినట్లు తెలిపారు. రూరల్‌ సీఐ కార్యాలయంలో ఆదివారం హత్యకు దారితీసిన వివరాలు ఆయన వెల్లడించారు. పదేళ్ల క్రితం నుంచే రవి, శాకెరల మధ్య ప్రేమ వ్యవహారం ఉండేదని, పెద్దల జోక్యంతో ఈ వివాదం సద్దుమణిగిందని, అనంతరం శాకెరకు పెళ్లి చేయడంతో ఇద్దరు పిల్లలు పుట్టారన్నారు.

భర్త జీవనోపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లగా అత్తగారింటిలో ఉంటున్న శాకెర వేములవాడకు వచ్చేసింది. ఈ క్రమంలో రవి శాకెరను నిత్యం వేధింపులకు గురి చేయడంతో తమ సోదరులకు బాధ చెప్పుకుంది. రవిని చంపేస్తే తప్ప నాకు విముక్తి లభించదని సోదరి చెప్పడంతో ముగ్గురు సోదరులు అక్రమ్, అహ్మద్, జావిద్‌కు రవిని చంపేందుకు సిద్ధపడ్డారన్నారు. ఈ క్రమంలో వీరి మేనబావలైన ఇంతియాజ్, రియాజ్‌లతోపాటు స్నేహితులైన సోమినేని వేణు, మండలోజు సందీప్, గుండా బాలులను సైతం సంప్రదించారు. ఈక్రమంలో వీరంతా రవిని చంపేయాలని, ఇందుకు తాము కూడా సహకరిస్తామని ఒప్పుకున్నారని డీఎస్పీ చెప్పారు. ఇందుకు బాలు, వేణు, సందీప్‌లకు రవి మూమెంట్స్‌ తమకు తెలియజేయాలని ముగ్గురు సోదరులు కోరగా అప్పట్నుంచి ఈ ముగ్గురు స్నేహితులు రవి మూమెంట్స్‌ను గమనిస్తూ హత్య ప్లాన్‌లో నిమగ్నమయ్యారు.  

కొద్ది కాలంగా వీరిప్లాన్‌ కొనసాగగా ఈనెల 21న కోరుట్ల బస్టాండు నుంచి రవి మూమెంట్స్‌లను గమనించిన వేణు, సందీప్, బాలులు అక్రమ్, అహ్మద్, జావిద్‌లకు సమాచారం ఇచ్చారని చెప్పారు. దీంతో ఇంట్లో ఉన్న కత్తులను తీసుకుని ద్విచక్రవాహనాలపై సుబ్రమణ్యంనగర్‌లోని నాగుల రవి ఇంటి వద్దకు చేరుకుని జావిద్‌ కాపలా ఉండగా, అహ్మద్, అక్రమ్‌లు తమ వెంట తీసుకొచ్చిన కత్తులతో బైక్‌పై ఇంటికి వచ్చిన రవిని నరికి చంపేశారని తెలిపారు. హత్య అనంతరం వీరంతా కలసి శాబాష్‌పల్లికి చేరుకుకుని.. వేసుకున్న ప్లాన్‌ ప్రకారం ఇంతియాజ్, రియాజ్‌లు బుల్లెట్‌ తీసుకుని వస్తారని, ఆయుధాలను బైపాస్‌రోడ్డులోని ఖబ్రస్తాన్‌లో పడేసి బుల్లెట్‌పై వెళ్లిపోయినట్లు చెప్పారు. ఆదివారం ఉదయం వేములవాడ శివారులోని అయ్యప్ప ఆలయం వద్ద జావిద్, అక్రమ్, అహ్మద్‌లు ఉన్నారన్న సమాచారం అందుకున్న టౌన్‌ సీఐ వెంకటస్వామి, హెడ్‌కానిస్టేబుల్‌ దేవేందర్‌రెడ్డి, కానిస్టేబుల్‌ మనోహర్‌లు పట్టుకున్నట్లు చెప్పారు. ఇప్పటికే సోదరి శాకెరను ఈనెల 22న పట్టుకుని అరెస్టు చేసినట్లు చెప్పారు. మరో ఐదుగురు రియాజ్, ఇంతియాజ్, సోమినేని వేణు, మండలోజు సందీప్, గుండా బాలులు పరారీలో ఉన్నట్లు తెలిపారు. 

>
మరిన్ని వార్తలు