పాత కక్షలతోనే అన్నదమ్ముల హత్య

23 Jul, 2018 11:39 IST|Sakshi
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ఏసీపీ సుదర్శన్‌ 

నిజామాబాద్‌ ఏసీపీ సుదర్శన్‌ వెల్లడి

ముగ్గురు నిందితుల అరెస్టు

నిజామాబాద్‌ క్రైం (నిజామాబాద్‌ అర్బన్‌) : జిల్లా కేంద్రంలో శనివారం ఇద్దరు అన్నదమ్ముల దారుణహత్య ఘటన పాత కక్షల కారణంగానే జరిగిందని నిజామాబాద్‌ ఏసీపీ మంత్రి సుదర్శన్‌ తెలిపారు. ఆదివారం రాత్రి ఏసీపీ తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అన్నదమ్ముల హత్య కేసు వివరాలను వెల్లడించారు. ఏసీపీ తెలిపిన వివరాల ప్రకారం.. హమల్‌వాడీకి చెందిన మొగుల్ల సాయిప్రసాద్‌ అలియాస్‌ తల్వార్‌ సాయి, అతని తమ్ముడు మొగుల్ల మహేందర్, ధాత్రిక సంజయ్‌ అలియాస్‌ నానిలు ఆదర్శనగర్‌కు చెందిన బద్రి పవన్‌ కళ్యాణ్‌ అలియాస్‌ బబ్లూ, అతని తమ్ముడు బద్రి నర్సింగ్‌ యాదవ్‌లను పాత కక్షలతోనే తల్వార్‌తో పొడిచి చంపారు. పవన్‌ కళ్యాణ్, సాయి ప్రసాద్‌లు కొంతమంది యువకులతో కలిసి గ్రూపులు కట్టారు. ఈ రెండు గ్రూప్‌ల మధ్య ఏడు నెలలుగా గొడవలు జరుగుతున్నాయి. శనివారం ఉదయం మరోమారు రెండు గ్రూప్‌ల మధ్య గొడవలు జరిగాయి. దీనిని మనస్సులో పెట్టుకున్న తల్వార్‌ సాయి పవన్‌ కళ్యాణ్‌ మరోసారి తమ జోలికి రాకుండా చేయాలని నిర్ణయించుకున్నాడు. 

ప్లాన్‌ ప్రకారమే.. 
పవన్‌ కళ్యాణ్‌ను అడ్డు తొలగించుకోవాలని తల్వా ర్‌ సాయి నిర్వయించుకున్నాడు. శనివారం సా యంత్రం పవన్‌ కళ్యాణ్‌ ఓ ఫంక్షన్‌లో ఉండగా తల్వార్‌ సాయి అతడికి ఫోన్‌ చేసి రెచ్చగొట్టే మా టలు మాట్లాడాడు. ఎవరి సత్తా ఏమిటో చూసు కుందామని, హమల్‌వాడీ పక్కన గల రైల్వే కోర్టు కు చెందిన మైదానంలోకి రావాలని ఇద్దరు చా లెంజ్‌ చేసుకున్నారు. ఇందులో భాగంగా సాయం త్రం 5 గంటల ప్రాంతంలో పవన్‌ కళ్యాణ్, తల్వా ర్‌ సాయిల గ్రూపులకు చెందిన కొంతమంది రైల్వే మైదానానికి చేరుకున్నారు. వీరి మధ్య మాట మాట పెరిగి కొట్టుకున్నారు.

అనంతరం పవన్‌ కళ్యాణ్‌ తన తమ్ముడు నర్సింగ్‌ యాదవ్‌కు ఫోన్‌ చేసి గొడవ జరుగుతున్న విషయాన్ని తెలపడంతో అతను తన స్నేహితులను వెంటబెట్టుకుని మైదానానికి చేరుకున్నాడు. తల్వార్‌ సాయి తన వద్దనున్న తల్వార్‌తో పవన్‌ కళ్యాణ్‌పై దాడి చేశాడు. అతని తమ్ముడు మహేందర్, సంజయ్‌లు క్రికెట్‌ బ్యాట్‌తో వారిపై దాడి చేశారు. ఘటనలో పవన్‌ కళ్యాణ్‌ అతడి గొంతు తెగడంతో అక్కడే పడిపో యాడు. అన్నపై దాడిని నివారించేందుకు తమ్ము డు నర్సింగ్‌యాదవ్‌ అడ్డుపడగా అతని చాతిలో, కడుపులో తల్వార్‌తో పొడవగా అతను అక్కడికక్కడే మృతిచెందాడు. కొన ఊపిరితో ఉన్న పవన్‌ను చికిత్స నిమిత్తం అంబులెన్స్‌లో ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. జరుగుతున్న గొడవను నర్సింగ్‌యాదవ్‌తో వచ్చిన ప్రేమ్‌కుమార్‌ ఫోన్‌లో చిత్రీకరిస్తుండగా అతనిపై దాడికి పాల్పడ్డారు.

దాడుల విషయమై ప్రేమ్‌కుమార్‌ మూడో టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు అక్కడకు చేరుకుని నర్సింగ్‌ మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా మృతుల తండ్రి నగేశ్‌ ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు రంగంలోకి దిగి నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు శారు. శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు నిందితులు తల్వార్‌ సాయి, మహేందర్, సంజయ్‌లదిళ్ల వద్ద కాపుకాసి వారిని పట్టుకున్నట్లు ఏసీపీ తెలిపారు. ఈ ముగ్గురిపై హత్య నేరం కింద సెక్షన్లు నమోదు చేసి అరెస్టు చేసినట్లు చెప్పారు. సమావేశంలో నగర సీఐ నరేశ్, 3వ టౌన్‌ ఎస్సై కృష్ణ పాల్గొన్నారు.

అన్నదమ్ముల అంత్యక్రియలు పూర్తి 
దారుణ హత్యకు గురైన ఇద్దరు అన్నదమ్ములకు ఆదివారం మధ్యాహ్నం అంత్యక్రియలు పూర్త య్యాయి. ఆదర్శనగర్‌కు చెందిన పవన్‌ కళ్యాణ్‌(21), నర్సింగ్‌ యాదవ్‌(19)ల మృతదేహాలకు ఆదివారం పోస్టుమార్టం జరిగింది. అనంతరం పోలీసులు మృతదేహాలను కుటుంబీకులకు అందజేశారు. వారి మృతదేహాలను ఆదర్శనగర్‌కు తరలించారు. ఒకేసారి ఇద్దరు కొడుకులు మృతిచెందడంతో తండ్రి నగేశ్, అతని కుటుంబ సభ్యులు, బంధువులు బోరుమని విలపించారు. అంత్యక్రియలకు బంధువులు, మృతుల స్నేహితులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దుబ్బ శ్మశానవాటికలో అంత్యక్రియలు పూర్తిచేశారు.

మరిన్ని వార్తలు