పెట్రోల్‌ పోసి హత్య చేసిన మహిళ అరెస్టు 

22 Jun, 2019 10:08 IST|Sakshi

మరిది, ఆడపడుచుపై దాడి

వివాహేతర సంబంధంతోనే ఘటన

సాక్షి, విజయవాడ : మరది, ఆడపడుచుపై పెట్రోలు పోసి హత్య చేసిన ఘటనలో నిందితురాలు ముంతాజ్‌బేగాన్ని అరెస్టు చేసినట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు. వివరాలు.. కానూరు సనత్‌నగర్‌ సిద్దిఖ్‌నగర్‌లో రిక్షాపుల్లర్‌ ఫరీద్, ఆమె భార్య ముంతాజ్‌బేగం నివసిస్తున్నారు. వీరికి కుమారుడు(12) ఉన్నాడు. ముంతాజ్‌బేగానికి ఇంటి పక్కనే ఉంటున్న మరిది ఖలీల్‌(27)తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం తెలిసిన పెద్దలు వారిని మందలించారు. మూడు నెలల క్రితం ఖలీల్‌ నజీరున్నీసాను వివాహం చేసుకున్నాడు. వివాహం అయిన తరువాత నుంచి ఖలీల్‌ వదిన ముంతాజ్‌బేగానికి దూరంగా ఉంటున్నాడు. పెళ్లి తరువాత పట్టించుకోవటం లేదని మంతాజ్‌బేగం కక్ష పెంచుకుంది.

హత్యకు కుట్ర..
మరిది ఖలీల్, అతని భార్య నజీరున్నీసాను హతమార్చాలని ముంతాజ్‌బేగం నిర్ణయించుకుంది. ఈ నెల 19వ తేదీన ఉదయం 9 గంటలకు ఇంట్లో ఉన్న ఖలీల్, నజీరున్నీసాను హతమార్చటానికి డబ్బాలో పెట్రోల్‌ తీసుకుని, మరో చేతితో కాగడా వెలిగించుకుని ఖలీల్‌ ఇంట్లోకి వెళ్లింది. బెడ్‌రూంలో భార్యాభర్తలు ఉంటారని గ్రహించి గదిలోకి వచ్చి ఖలీల్‌పై పెట్రోల్‌ పోసి నిప్పుంటించి గదికి గడియపెట్టి పారిపోయింది. అయితే ఆ సమయంలో గదిలో ఖలీల్‌తో పాటు దివ్యాంగురాలైన ఆడపడుచు హాజిని(49)మంచంపై ఉంది. ఈ ఘటనలో ఆడపడుచు సజీవ దహనం కాగా, కాలిన గాయాలతో ఖలీల్‌ కేకలు వేయటంతో అతడి భార్య నజీరున్నీసా, తల్లి హమీదున్నీసాలు వచ్చి తలుపు గడి తీశారు. అప్పటికే ఖలీల్‌ బాగా కాలిపోవటంతో విజయవాడ ప్రభుత్వస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ అదే రోజు మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు హత్య కేసు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. సీపీ ద్వారకాతిరుమలరావు ఆదేశాల మేరకు నిందితురాలిని శుక్రవారం సీఐ పెద్దిరాజు అరెస్టు చేశారు.

మరిన్ని వార్తలు