చదివింది ఏడు.. మోసాల్లో పీహెచ్‌డీ..! 

9 Jun, 2020 10:40 IST|Sakshi

సాక్షి, ఒంగోలు: ఒకటి కాదు..రెండు కాదు..ఏకంగా 150 కేసుల్లో నిందితుడు..సాధారణంగా పోలీసులంటే ఎవరైనా భయపడతారు.. కానీ ఇతను మాత్రం ఎక్కువగా పోలీసులనే టార్గెట్‌ చేస్తాడు. చదివింది ఏడో తరగతే అయినా ఇంటర్నెట్‌లో వచ్చే వార్తల ఆధారంగా పోలీసులనే బెదిరించడం, భయపెట్టడం, ఆపై కేసు మాఫీ చేయిస్తానంటూ లక్షలు డిమాండ్‌ చేయడం అతని నైజం..ఆ ప్రాంతం..ఈ ప్రాంతమని సంబంధం లేకుండా మోసాలకు పాల్పడుతున్న రాచంపల్లి శ్రీనివాసులు అలియాస్‌ మంగలి శ్రీను పోలీసులకు పట్టుబడ్డాడు. పోలీసుల విచారణలో అతని నేర చరిత్ర, నేర పంథాను తెలుసుకొని పోలీసులకు మతిపోయినంత పనైంది. స్థానిక జిల్లా ఎస్పీ కార్యాలయంలోని గెలాక్సీ సమావేశమందిరంలో సోమవారం ఏర్పాటు విలేకరుల సమావేశంలో నిందితుడి హాజరుపరిచి వివరాలు వెల్లడించారు.  (‘గ్యాంగ్‌’పై బహిష్కరణ వేటు)

మంగలి శ్రీను నేరాల చిట్టాల్లో కొన్ని.. 
► 2019 మార్చి 26న ఏఆర్‌ ఆర్‌ఎస్సైకి ఒకరికి ఫోన్‌చేసి డీఐజీ కార్యాలయం నుంచి ఫోన్‌చేస్తున్నానని, నీపై ఉన్న సస్పెన్షన్‌ ఎత్తివేయాలంటే రూ.50వేలు బ్యాంకు ఖాతాకు జమ చేయాలని సూచించాడు. అయితే ఆయన తిరస్కరించాడు.  
► అదే రోజు ప్రకాశం జిల్లా వలేటివారిపాలెం పోలీసుస్టేషన్‌ కానిస్టేబుల్‌ ఖాశింకు ఫోన్‌చేసి డీఐజీ కార్యాలయం నుంచి మాట్లాడుతున్నానని మహిళా సిబ్బందిపై రాత్రిపూట డ్యూటీలో అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, ఈ ఘటనకు సంబంధించి సస్పెన్షన్‌ ఎత్తివేయాలంటే రూ.50వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేయగా కానిస్టేబుల్‌ తిరస్కరించాడు.  
► 2020 జనవరి 11న ఒంగోలు తాలూకా పీఎస్‌ పరిధిలోని కానిస్టేబుల్‌ ఆనంద్‌ను ఓరల్‌ ఎంక్వయిరీ నుంచి తప్పించేందుకు రూ.లక్ష డిమాండ్‌ చేసి విఫలమయ్యాడు. పలు కేసుల్లో కొంతమంది అతనితో నేరుగా వచ్చి కలుస్తామనడంతో ఆ తర్వాత వారితో ఎటువంటి సంబంధాలు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు.  
► అనకాపల్లిలో ఒక హెడ్మాస్టర్‌పై అక్కడి మహిళలు అసభ్యకరంగా వ్యవహరిస్తున్నాడంటూ ఆరోపించారు. ఈ వార్తను ఇంటర్నెట్‌లో చదివిన మంగలి శ్రీను అతని ఫోన్‌నంబర్‌ సంపాదించి ఇంటెలిజెన్స్‌ డీఐజీ ఆఫీసు నుంచి  అంటూ బెదిరించి, సస్పెండ్‌ కాకుండా ఉండాలంటే అంటూ డబ్బులు కాజేశాడు.  
► నెల్లూరులో ఒక కానిస్టేబుల్‌ గాంబ్లింగ్‌ కేసులో సస్పెండ్‌ కాగా దానిని ఎత్తివేయిస్తానని అంటూ డబ్బులు కొట్టేసినట్లు ప్రాథమిక సమాచారం. ఇదే విధంగా ప్రొద్దుటూరు, కడప వంటి అనేక చోట్ల ఇదే తరహా నేరాల్లో నగదు తీసుకున్నట్లు సమాచారం.తాజాగా శ్రీకాకుళంలో ఒక నేరంలో అరెస్టు అయి బయటకు వచ్చి మరో నేరం చేసేందుకు యత్నిస్తూ గిద్దలూరు పోలీసులకు పట్టుబడ్డాడు.

విచారణలో విస్తుగొల్పే విషయాలు.. 
మంగలి శ్రీను నేర చరిత్రను పరిశీలిస్తే దాదాపు 150కిపైగా కేసుల్లో నిందితుడిగా ఉన్నట్లు అంచనా. 80 కేసులు కొట్టివేయగా..ప్రస్తుతం 50 నుంచి 60 కేసుల వరకు నడుస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో ఏకంగా 18 మందిని మోసం చేసేందుకు ప్రయత్నించి విఫలమైనట్లు గుర్తించారు. ఇతనిపై బెంగళూరు, కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో 20 కేసుల్లో నాన్‌బెయిలబుల్‌ వారెంట్లు పెండింగ్‌లో ఉన్నాయి. పీలేరు, హిందూపూర్, నెల్లూరు, కడప, పొద్దుటూరు, వనపర్తి, జమ్మలమడుగు, ఆత్మకూరు ప్రాంతాల్లో కూడా దాదాపు ఇదే తరహాలో పలువురు ప్రభుత్వ ఉద్యోగులను, పోలీసులను, జైలు సిబ్బందిని, ప్రైవేటు వ్యక్తులను కూడా చీటింగ్‌ చేసినట్లు విచారణలో తేలింది. ప్రాథమికంగా రూ.11.80 లక్షలు చీటింగ్‌ చేసినట్లు నిర్థారణకు వచ్చారు. పోలీసుల విచారణలో తనకు ఇంగ్లిష్‌ రాకపోవడంతో ఉన్నతాధికారులను టార్గెట్‌ చేయలేకపోయానని చెప్పడం విశేషం. (నన్ను నేను చూసుకోలేక పోయాను: మహిమా చౌదరి)

నగదు బదిలీకి సరికొత్త ఎత్తుగడ..  
చదువుకున్నది ఏడో తరగతి అయినా టెక్నాలజీ వినియోగంలో అత్యంత తెలివితేటలు ప్రదర్శించేవాడు మంగలి శ్రీను. అత్యంత తక్కువ ధరలో ఉండే 2జీ ఫోన్‌లు వాడేవాడు. నిత్యం ఇంటర్‌నెట్‌లో నేరవార్తలు తెలుసుకుంటూ ఏదైనా నేరంలో చిక్కుకుని మానసికంగా మధనపడుతున్నవారిని, ఏదైనా నేరారోపణలు ఎదుర్కొంటున్నవారిని గుర్తించి వారి సమాచారం సేకరించి టార్గెట్‌ చేసేవాడు. ఈ తరహాలోనే గిద్దలూరు కేసులో శ్రీనివాసులు వద్ద నుంచి రూ.2లక్షలను తిరుపతిలోని ఒక పరిచయం లేని ఖాతాకు జమచేయించాడు. తన కుటుంబసభ్యులు ఆస్పత్రిలో ఉన్నారని, తన ఖాతాకు సంబంధించి డబ్బు డ్రా చేసేందుకు అవకాశం  లేనందున  అకౌంట్‌ నంబర్‌ ఇస్తే అందులో తన బంధువులు డబ్బులు వేస్తారని, అందుకు లక్షకు రూ.2 వేల చొప్పున కమీషన్‌ కూడా ఆఫర్‌ ఇచ్చినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.  

అపరిచిత వ్యక్తులకు డబ్బులు బదిలీ చేయవద్దు: ఎస్పీ 
పెద్దగా చదువుకోని మంగలి శ్రీను సాంకేతికతను వినియోగించుకుంటూ అక్రమ పద్ధతిలో డబ్బును సంపాదిస్తూ బెట్టింగ్‌ వ్యసనంలో పోగొట్టుకుంటున్నట్లు గుర్తించామని, బాగా చదువుకున్న వారు కూడా సైబర్‌ క్రైంల వ్యవహారంలో మోసపోవడం బాధగా ఉంటుందని ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌ అన్నారు. అపరిచిత వ్యక్తులు ఫోన్‌చేసి అకౌంట్లలో డబ్బులు వేయమంటే వేయడం సరికాదని,  అపరిచిత వ్యక్తులు ఫోన్‌చేసి అకౌంట్‌ వివరాలు అడిగితే తెలపరాదన్నారు. వైట్‌ కాలర్‌ నేరాలు పెరిగిపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏటీఎంల వద్ద జరుగుతున్న మోసాలపై అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ కేసుల్లో ఉన్నతాధికారినని చెప్పి సస్పెన్షన్‌లు ఎత్తివేయిస్తాడనే ఉద్దేశంతో మంగలి శ్రీను సూచించిన ఖాతాలకు డబ్బులు జమచేసిన వారి వ్యవహారంపై కూడా దృష్టిసారించామని, ఆధారాలు లభ్యం కాగానే వారిపై కూడా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కేసులో అంతర్‌రాష్ట్ర నేరస్తుడిని పట్టుకోవడంతో పాటు కర్నాటక, ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాలలోని అనేక నేరాలకు సంబంధించిన వ్యవహారాలను బయటకు రప్పించడంలో కృషి  చేసిన మార్కాపురం డీఎస్పీ జి.నాగేశ్వరరెడ్డి, గిద్దలూరు సీఐ ఉప్పటూరి సుధాకర్, గిద్దలూరు ఎస్సై షస్త్రక్‌ సమంధార్‌వలి, గిద్దలూరు సర్కిల్‌ సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. 

చైన్‌స్నాచింగ్‌లతో మొదలు.. 
అనంతరంపురం జిల్లా నల్లమడ మండలం వేలమద్ది గ్రామానికి చెందిన మంగలి శ్రీనుకు 20 ఏళ్లకు పైగా నేర చరిత్ర ఉంది. తొలినాళ్లలో చైన్‌స్నాచింగ్‌లు, మోటార్‌ బైక్‌ల దొంగతనాలు, గృహ దొంగతనాలకు పాల్పడి జైలుకు వెళ్లాడు. ఆ కేసుల్లో కోర్టుకు హాజరయ్యే సమయంలో జైలు నుంచి తనకు ఎస్కార్టుగా వచ్చే సిబ్బందిని, పలువురు జైలు సిబ్బందిని ప్రలోభపెట్టి అనారోగ్యంతో ఉన్నట్లు, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు చూపించేవారు. కానీ అతను మాత్రం ఆస్పత్రిలో ఉండకుండా కర్నాటకలో దొంగతనం చేసి పట్టుబడ్డాడు. అప్పట్లో ఈ కేసు సంచలనం సృష్టించింది. ఈ కేసులో ఎస్కార్టు సిబ్బందితో పాటు జైలు సిబ్బంది కూడా సస్పెన్షన్‌కు గురయ్యారు. ఈ కేసు అనంతరం మంగలి శ్రీను తన నేర పం«థాను మార్చుకున్నాడు. తన కారణంగా సస్పెండైన కడప జైలులోని ఒక కానిస్టేబుల్‌కు ఫోన్‌చేసి ఇంటెలిజెన్స్‌ డీఐజీని మాట్లాడుతున్నానంటూ తొలుత బెదిరించాడు. ఆపై సస్పెన్షన్‌ ఎత్తివేయాలంటే తాను చెప్పిన బ్యాంకు ఖాతాకు డబ్బులు వేయాలంటూ కొంత మొత్తం గుంజాడు.  

పట్టుబడిందిలా..! 
2019 సాధారణ ఎన్నికల సమయంలో గిద్దలూరు పరిధిలోని దిగువమెట్ట చెక్‌పోస్టు వద్ద ఎం శ్రీనివాసులు అనే వ్యక్తి వద్ద పోలీసులు రూ.29.47 లక్షలు సీజ్‌చేశారు. ఈ విషయాన్ని ఇంటర్నెట్‌ వార్తల తెలుసుకున్న మంగలి శ్రీను నగదు సీజ్‌ చేసిన పోలీసుస్టేషన్‌కు ఫోన్‌చేసి అక్కడ ఉన్న సిబ్బందితో ఇంటెలిజెన్స్‌ ఐజీ ఆఫీసు నుంచి మాట్లాడుతున్నానంటూ ‘ ఏం చేస్తున్నారు, ఆ డబ్బు ఏం చేశారంటూ హెచ్చరించడంతో అక్కడ విధుల్లో ఉన్న సిబ్బంది కొంత డైలమాలో పడి కేసు వివరాలను అతనికి చెప్పారు. దీంతో అతను నంధ్యాలకు చెందిన ఎం.శ్రీనివాసులతో(ఎన్నికల సమయంలో పోలీసులు డబ్బులు సీజ్‌ చేసింది ఇతని వద్దే) మాట్లాడి వ్యవసాయపరంగా సంపాదించిన సొత్తు కనుక దాన్ని వెనక్కి ఇప్పిస్తానంటూ నమ్మించాడు. అయితే ఇందుకు తాను సూచించిన ఖాతాకు రూ.2 లక్షలు పంపాలని సూచించడంతో..ఆ వ్యక్తి ఆ మొత్తాన్ని జమ చేశాడు. నెల్లూరులో కూడా ఇదే తరహా ఘటనపై ఫిర్యాదు రావడంతో జిల్లా ఎస్పీ స్పెషల్‌ టాస్క్‌ఫోర్సును ఏర్పాటుచేసి నిందితున్ని అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి గిద్దలూరు పరిధిలో జరిగిన ఘటనకు సంబంధించి రూ.1.60 లక్షలు, నెల్లూరులో జరిగిన ఘటనకు సంబంధించి రూ.1.20 లక్షలు మొత్తం రూ.2.80 లక్షలు సీజ్‌ చేశారు.  

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు