ఈర్ష్యతోనే కార్లు, బైక్‌లు దహనం

24 Aug, 2019 09:17 IST|Sakshi

కేసులో నిందితుల అరెస్టు

సీసీ కెమెరాల ఫుటేజీతో కీలక ఆధారాలు లభ్యం

సాక్షి, విజయవాడ : విజయవాడ నగరంలో వాహనాల దహనం కేసులో నిందితులను 24 గంటల వ్యవధిలోగా అరెస్టు చేసినట్లు డీసీపీ సీహెచ్‌ విజయరావు తెలిపారు. కమాండ్‌ కంట్రోల్‌ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.  ఈనెల 21వ తేదీ అర్ధరాత్రి సమయంలో అజిత్‌సింగ్‌నగర్, శ్రీనగర్‌కాలనీ, కృష్ణా హోటల్‌ సెంటర్‌లలో రోడ్డు పక్కన పార్కింగ్‌ చేసిన రెండు కార్లు, రెండు బైక్‌లు, స్కూటర్‌ను అర్ధగంట వ్యవధిలో కొందరు దుండగులు దహానానికి పాల్పడినట్లు చెప్పారు.

ఈ ఘటనలపై బాధితుల ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు వివరించారు. ఘటనా స్థలంలోని సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించి నిందితుల కోసం అజిత్‌సింగ్‌నగర్‌ ఇన్‌స్పెక్టర్‌ లక్ష్మీనారాయణ, ఎస్‌ఐలతో  ప్రత్యేక బృందాలను ఏర్పాటు దర్యాప్తు చేసినట్లు చెప్పారు. ఘటన జరిగిన ప్రదేశంలో అనుమానితులను విచారించటంతో పాటు సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా ముగ్గురు నిందితులను 24 గంటల లోగా అరెస్టు చేసినట్లు తెలిపారు. కేసులలో ఒక యువకుడితో పాటు ఇద్దరు బాలురు ఉన్నారని చెప్పారు. ఇది చదవండి : బెజవాడలో అర్ధరాత్రి అలజడి

మద్యం మత్తులో..
తమకు లేని వాహనాలు ఎదుటివారికి ఉన్నాయనే ఈర్ష్య, వాహనాలను దహనం చేయాలనే సరదాతోనే నిందితులు ప్రవర్తించినట్లు విచారణలో వెల్లడైనట్లు డీసీపీ విజయరావు వివరించారు. న్యూ ఆర్‌ఆర్‌పేటకు చెందిన గుమ్మడి సంజయ్‌ బాబు(19) మరో ఇద్దరు బాలురుతో కలసి 21వ తేదీన ప్రభాస్‌ కళాశాల సమీపంలోని బార్‌లో మద్యం కొనుగోలు చేశారు. వీరు కృష్ణానది దుర్గాఘాట్‌ వద్దకు చేరుకుని మద్యం తాగారు. అనంతరం వారు మద్యం మత్తులో అజిత్‌సింగ్‌నగర్, రామకృష్ణాపురం, శ్రీనగర్‌ కాలనీలోని వాహనాలపై పెట్రోల్‌ పోసి తగులపెట్టారు. సంజయ్‌బాబు గతంలో బైక్‌ కొనుగోలు చేయగా వాయిదాలు కట్టలేకపోవటంతో ఫైనాన్స్‌ సంస్థ స్వాధీనం చేసుకుంది. అప్పటి నుంచి ఎదుటి వారి వాహనాలను చూడగానే తగులపెట్టాలనే కోరిక కలుగుతుందని సంజయ్‌ విచారణలో అంగీకరించినట్లు డీసీపీ చెప్పారు. చిన్న వయసులోనే మద్యానికి అలవాటు పడటంతో పాటు ఇటువంటి ఘటనలకు పాల్పడటం విచారకరమని డీసీపీ విజయరావు పేర్కొన్నారు.

తల్లిదండ్రులు పిల్లలను గమనించాలి
తల్లిదండ్రులు పిల్లలు ఏం చేస్తున్నారో గమనించాలని లేనిపక్షంలో ఇటువంటి ఘటనలకు అవకాశం ఉంటుందని డీసీపీ విజయరావు అభిప్రాయపడ్డారు. బైక్‌లు వాహనాలు దహనం కేసులో  ఇద్దరు మైనర్లు ఉండటం విచారకరమన్నారు. చిన్న వయస్సులోనే మద్యం తాగి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడటానికి కారణం వారిని ఎవ్వరూ పట్టించుకోకపోవటమేనని అన్నారు. 

సీసీ కెమెరాల నీడలో నగరం
నగరంలో సీసీ కెమెరాల నీడలో ఉందని దొంగతనాల కేసులలో నేరస్తులను గుర్తించి పట్టుకోవటంలో సీసీ కెమెరాలు ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయని డీసీపీ వివరించారు. నగర పోలీస్‌ కమిషనర్‌ ద్వారకా తిరుమలరావు ఆదేశాల మేరకు నగరంలో నేరాల నియంత్రణ, నేరస్తులు కదలికలపై పటిష్టమైన నిఘా ఏర్పాటు చేశామన్నారు. నగరంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తుల కదలికలపై నిఘా ఉంచామన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిని వివిధ రకాల నేరస్తులను, చట్ట వ్యతిరేక, అసాంఘిక  కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవటం జరుగుతుందని డీసీపీ హెచ్చరించారు.  

మరిన్ని వార్తలు