దివ్య హత్య కేసు: వేరే వాళ్లకు దక్కకూడదనే..

20 Feb, 2020 19:31 IST|Sakshi

సాక్షి, గజ్వేల్‌(సిద్ధిపేట): రాష్ట్రంలో సంచలనం సృష్టించిన బ్యాంకు ఉద్యోగిని దివ్య(23)హత్య కేసులో నిందితుడైన వెంకటేశ్‌ను పోలీసులు గురువారం అరెస్టు చేశారు. వారం రోజుల్లో పెళ్లి అనగా.. దివ్యను ప్రేమిస్తున్నానని వెంటపడుతూ వేధిస్తున్న నిందితుడు వెంకటేష్‌ ఈ నెల 18న ఆమెను హత్య చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఎన్నో మలుపులు తిరిగిన ఈ కేసును చివరకు పోలీసులు ఛేదించారు. మొదట పోలీసులు వెంకటేష్‌ తల్లిదండ్రులను అదుపులోకి తీసుకోవడంతో.. నిందితుడు తానే స్వయంగా వచ్చి నిన్న(బుధవారం) వేములవాడ పోలీసు స్టేషన్‌లో లొంగిపోయిన విషయం తెలిసిందే.  విచారణలో నిందితుడు తానే దివ్యను కత్తితో పొడిచి హత్య చేసినట్లు ఒప్పుకోవడంతో వేములవాడ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు తెలిపారు.

ఇక నిందితుడు దివ్యను హత్య చేసిన తీరును పోలీసులు వివరిస్తూ.. ఈ నెల 18 దివ్య తండ్రి లక్ష్మీరాజ్యం పోలీసు స్టేషన్‌కు వచ్చి.. తన కూతురుని వేధిస్తున్న వేములవాడకు చెందిన వెంకటేశ్‌.. తనను హత్య చేసి ఉంటాడని అనుమానం వ్యక్తం చేశారు. ఈ మేరకు గజ్వేల్‌ పోలీసు స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్‌ దాఖలైంది. పోలీసు కమిషనర్‌ ఎన్‌ శ్వేత, ఏసీపీ నారాయణ ఆధ్వర్యంలో 5 ప్రత్యేక బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేశారు. ఈ క్రమంలో నిన్న(బుధవారం) రాత్రి వేములవాడ పట్టణంలో స్పెషల్ టీమ్స్ అధికారులు వెంకటేష్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా తానే దివ్యను హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. 

దివ్య హత్య : పోలీసుల అదుపులో వెంకటేష్‌ తల్లిదండ్రులు

కాగా 5 నెలల క్రితం దివ్యకు గజ్వేల్ ఏపీజీవీబీ బ్యాంకులో ఉద్యోగం వచ్చింది. గతంలో వెంకటేశ్‌తో సన్నిహితంగా మెలిగిన దివ్య.. ఉద్యోగం వచ్చిన నాటి నుంచి తనను దూరం పెడుతోందని భావించిన వెంకటేశ్‌.. ఆమెపై కక్ష పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో దివ్యకు వేరేవారితో పెళ్లి కుదరడంతో తనకు దక్కనిది, మరెవరికీ దక్కకూడదన్న ఉద్దేశంతో చంపాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం దివ్య ఉద్యోగం చేస్తున్న గజ్వేల్ బ్యాంకు వద్దకు, ఆమె ఇంటికి పలుమార్లు వచ్చి వెళ్ళాడు. ఈ క్రమంలో ఈనెల 18న రాత్రి సుమారు 7:45 గంటల సమయంలో బ్యాంకు నుండి ఒంటరిగా  ఇంటికి వెళ్తున్న దివ్యను గమనించి వెంబడించాడు. ఇక ఆ సమయంలో ఇంటిలో దివ్య తల్లిదండ్రులు కూడా లేకపోవడంతో నిందితుడు తన వెంట తెచ్చుకుని కత్తి తీసి దివ్య గొంతు, ఇతర శరీర భాగాలపై పొడిచి హత్య చేశాడు.

(వారం రోజుల్లో ఆమెకు పెళ్లి, ఈలోగా ఘోరం..)

ఈ నేపథ్యంలో పోలీసు స్టేషనులో లొంగిపోయిన వెంకటేశ్‌ను.. పోలీసులు విచారించగా తానే దివ్యను కత్తితో పొడిచి హత్య చేసినట్లు అంగీకరించాడు. తొలుత ఘటనాస్థలం నుంచి నేరుగా సికింద్రాబాద్‌ నుంచి రైలులో విజయవాడకు, అక్కడి నుంచి వరంగల్‌ మీదుగా వేములవాడకు వచ్చినట్లు వెల్లడించాడు.  కాగా నిందితుడికి కఠిన శిక్ష పడి దివ్యకు న్యాయం జరిగేలా కేసు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ కమిషనర్ శ్వేత పేర్కొన్నారు. ఇక కేసు 24 గంటల్లో చేధించిన గజ్వేల్ ఏసీపీ నారాయణ, గజ్వేల్ సీఐ ఆంజనేయులు, మధుసూదన్ రెడ్డి, సిబ్బందిని పోలీస్ కమిషనర్ శ్వేత అభినందించారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు