అద్దె పేరుతో ఘరానా మోసం

24 Jun, 2019 09:34 IST|Sakshi

సాక్షి, అనంతపురం : మాయమాటలతో యజమానులను నమ్మించి కార్లను విక్రయించే ఘరానా మోసగాళ్ల ముఠాను త్రీటౌన్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. వీరి నుంచి 29 కార్లను స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం నగరంలోని పోలీసు కాన్ఫరెన్స్‌ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలను ఎస్పీ బూసారపు సత్యయేసుబాబు వెల్లడించారు. అరెస్టయిన వారిలో తాడిమర్రి మండలానికి చెందిన జయచంద్రారెడ్డి, కర్నూలు జిల్లా మద్దికెర మండలం బురుజుల గ్రామానికి చెందిన దినేష్‌ ఉన్నారు. ఎంబీఏ వరకు చదువుకున్న జయచంద్రారెడ్డి ధర్మవరంలో సివిల్‌కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్నాడు. దినేష్‌ బీటెక్‌ పూర్తి చేసి ఓ బ్యాంకులో పనిచేస్తూ సస్పెండ్‌ అయ్యాడు. వీరిద్దరి మధ్య స్నేహం కుదిరింది. 

ఈ క్రమంలో వ్యసనాలకు బానిసలయ్యారు. జల్సాల కోసం మోసాలకు పాల్పడ్డారు. కార్ల యజమానులకు మాయమాటలు చెప్పి అద్దె పేరుతో వాహనాలను తీసుకొని ఏకంగా వాటిని ఇతరుల వద్ద కుదవ పెట్టారు. ఇలా ఏ ఈడాది ఫిబ్రవరి నుంచి 29 కార్లను యజమానుల నుంచి తీసుకున్నారు. కార్లు తిరిగి ఇవ్వకపోవడంపై బాధితుల ఫిర్యాదుల మేరకు అనంతపురం త్రీటౌన్, వన్‌టౌన్, టూటౌన్, నాల్గవ పట్టణ పోలీసుస్టేషన్‌లలో కేసులు నమోదు అయ్యాయి. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను అరెస్ట్‌ చేశారు.   

మరిన్ని వార్తలు