గంజాయి విక్రేత అరెస్టు

19 May, 2018 08:06 IST|Sakshi
నిందితుడిని అరెస్టు చూపుతున్నఏసీపీ రక్షిత కే.మూర్తి

కిలో880 గ్రా. గంజాయి స్వాధీనం

ఏసీపీ రక్షిత కే.మూర్తి

జ్యోతినగర్‌(రామగుండం) : నిషేధిత గంజాయిని విక్రయిస్తున్న బిపుల్‌దాస్‌ (34)ను అరెస్టు చేసినట్లు గోదావరిఖని ఏసీపీ రక్షిత కే.మూర్తి, రామగుండం సీఐ సాగర్, ఎన్టీపీసీ ఎస్సై చంద్రకుమార్‌ తెలిపారు. శుక్రవారం అరెస్టు వివరాలు వెల్లడించారు. ఒడిశా రాష్ట్రం మల్కన్‌గిరి జిల్లా కలిమెల మండలం కంగూరుకొండకు చెందిన బిపుల్‌దాస్‌ గతంలో ఎన్టీపీసీ రామగుండం ప్రాజెక్టులో కాంట్రాక్టు కార్మికుడిగా విధులు నిర్వహించాడు. అనంతరం స్వగ్రామానికి వెళ్లాడు. అక్కడ పని దొరకక సులువుగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశ్యంతో కలిమెల అటవీ ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తి వద్ద గంజయి కొనుగోలు చేసి రామగుండం ప్రాంతంలో రెండుసార్లు విక్రయాలు చేపట్టాడు. ఈ క్రమంలో మరోసారి విక్రయించేందుకు రాగా.. పక్కా సమాచారంతో పోలీసులు ఎన్టీపీసీ లేబర్‌ గేట్‌ సమీపంలో బిపుల్‌దాస్‌ను తనిఖీ చేయగా రూ.19,000 విలువగల కిలో 880గ్రాముల గంజాయి పట్టుబడింది. తహసీల్దార్‌ డి.శ్రీనివాస్‌ సమక్షంలో స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ తెలిపారు. ఈ సందర్భంగా పోలీసులు దుబాసి రమేశ్, టి.స్వామిని అభినందించి వారికి నగదు రివార్డులు అందజేశారు.

కఠిన చర్యలు: ఏసీపీ రక్షిత కే.మూర్తి
గంజాయి, గుట్కాలను విక్రయిస్తే కఠినచర్యలు తప్పవని ఏసీపీ రక్షిత కే.మూర్తి స్పష్టం చేశారు. మత్తు పదార్థాలను రవాణా చేస్తున్న విషయాలను పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.   

మరిన్ని వార్తలు