ఎట్టకేలకు ప్రొఫెసర్‌ అరెస్ట్‌

20 Mar, 2018 20:06 IST|Sakshi

న్యూఢిల్లీ : విద్యార్థుల ఆందోళనతో ఢిల్లీ పోలీసులు దిగొచ్చారు. లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం(జేఎన్‌యూ) ప్రొఫెసర్‌ అతుల్‌ జోహ్రీని మంగళవారం పోలీసులు అరెస్ట్‌ చేశారు. జేఎన్‌యూ లైఫ్‌ సైన్స్‌ విభాగంలో విధులు నిర్వహిస్తున్న అతుల్‌పై నాలుగు రోజుల క్రితం అదే విభాగానికే చెందిన విద్యార్థినులు తమను వేధిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అయితే నాలుగు రోజులు గడిచిన పోలీసులు అతుల్‌ని అరెస్ట్‌ మాత్రం చేయలేదు.

అతుల్‌ని అరెస్ట్‌ చేయాలని 54 మంది అధ్యాపకులు డిమాండ్‌ చేసిన పోలీసులు స్పందించలేదు. దీంతో ఆగ్రహించిన విద్యార్థులు సోమవారం నిరసన ర్యాలీ చేపట్టారు. ఢిల్లీ పోలీసులకు, యూనివర్సిటీకి వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. వీరికి తోడుగా మహిళ హక్కుల సంఘాలు ఆందోళన నిర్వహించాయి. దీంతో సమస్య తీవ్రతను గ్రహించిన పోలీసులు అతుల్‌ని అరెస్ట్‌ చేశారు. మరికొంత మంది విద్యార్థినులు కూడా అతుల్‌పై ఇదే విధమైన ఆరోపణలతో ఫిర్యాదులు చేశారని, లోతైన దర్యాప్తు చేపడతామని డీసీపీ మౌనిక భరాద్వాజ్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు