ఆమె టార్గెట్‌ బ్యూటీపార్లర్‌ 

17 Jun, 2018 08:14 IST|Sakshi

కిలేడీ అరెస్ట్‌ మూడు నెలల్లో 17 చోరీలు 

మారేడుపల్లి : నగరంలోని బ్యూటీపార్లర్లలో చోరీలకు పాల్పడుతూ పోలీసులను ముప్పుతిప్పలు పెట్టిన ఓ ఘరానా మహిళా దొంగను మారేడుపల్లి పోలీసులు శనివారం అరెస్టుచేసి రిమాండ్‌కు తరలించారు. నార్త్‌ జోన్‌ డీసీపీ సుమతి తెలిపిన మేరకు.. కడప టౌన్‌కు చెందిన పైడికాల్వ డైసీ మార్టిన్‌ అలియాస్‌ డైసీ అలియాస్‌ వందన అలియాస్‌ లక్ష్మి అలియాస్‌ ప్రియ (36) ఇలా కొత్త కొత్త పేర్లతో పరిచయం చేసుకుంటూ బ్యూటీపార్లర్లలో గత మూడు నెలలుగా 17 బ్యూటీపార్లర్లలో చోరీలకు పాల్పడింది. నిర్వాహకులను మాటలతో నమ్మించి మాయచేసి వారి బంగారు ఆభరణాలను చోరీ చేసేది.

బాధితులు  ఫిర్యాదు చేయడంతో పోలీసులు నిఘా ఉంచి నిందితురాలిని అరెస్టు చేశారు.ఆమె నుంచి రూ. 17 లక్షల రూపాయల విలువైన బంగారు ఆభరణాలను స్వాధీన పర్చుకున్నారు.    డైసీ తక్కువ కస్టమర్లతో ఉన్న బ్యూటీపార్లర్లను ఎంచుకుని బ్యూటీపార్లర్ల నిర్వాహకులను దోచుకుంది. సందర్భాన్ని బట్టి తాను బ్యూటీపార్లర్‌కు సంబంధించిన కాస్మొటిక్స్‌ సరఫరా చేస్తానని, మంచి ఆఫర్లు ఉన్నాయంటూ బ్యూటీపార్లర్‌ నిర్వాహకులను నమ్మిస్తుంది. కాస్మొటిక్స్‌ పెట్టుకునే ముందు ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను తీసి పక్కనపెట్టాల్సిందిగా సూచిస్తుంది.

కాస్మొటిక్స్‌ మొఖానికి రాసిన తర్వాత నెమ్మదిగా బంగారు ఆభరణాలను తీసుకుని అక్కడి నుండి పరారవుతుంది. ఈ సంవత్సరం ఫిబ్రవరి ,2018 నుండి మే వరకు   హైదరాబాద్‌ నగరంలో 9, సబరాబాద్‌లో 5, రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో 3  చొప్పున బ్యూటీపార్లర్లలో చోరీకి పాల్పడినట్లు డీసీపీ సుమతి తెలిపారు. విద్యావంతుల కుటుంబానికి చెందిన డైసీ బీఏ ఇంగ్లీష్‌ చదివింది. మారేడుపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో వాణి అనే బ్యూటీపార్లర్‌ నిర్వాహకురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేశారు. నిందితురాలిని బిహెచ్‌ఈఎల్‌లో  సంచరిస్తుందనే సమాచారంతో మారేడుపల్లి పోలీసులు అరెస్టుచేసి రిమాండ్‌కు తరలించారు.. నిందితురాలిపై పీడీయాక్టు నమోదు చేయనున్నట్లు డీసీపీ సుమతి తెలిపారు. విలేకరుల సమావేశంలో ఏసీపీ శ్రీనివాస్, సీఐ శ్రీనివాసులు, డీఐ అప్పలనాయుడు పలువురు పాల్గొన్నారు.

 
 

మరిన్ని వార్తలు