దూరం పెడుతోందన్న కోపంతోనే హత్యా...

31 Aug, 2019 11:05 IST|Sakshi
వివరాలు వెల్లడిస్తున్న కల్లూరు ఏసీపీ వెంకటేష్, పోలీసు సిబ్బంది 

సాక్షి, ఖమ్మం : జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కావటి తేజస్విని హత్య కేసులో నిందితుడు బొల్లెదు నితిన్‌ను వీఎంబంజర్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రేమించిన అమ్మాయి దూరం పెడుతుందన్న కోపంతో యువతిని హత్య చేసినట్లు నిందితుడు విచారణలో వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. దీనికి సంబంధించి కల్లూరు ఏసీపీ వెంకటేష్‌ శుక్రవారం రాత్రి వీఎంబంజర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. సత్తుపల్లికి చెందిన బొల్లెదు నితిన్, పెనుబల్లి మండలం, కుప్పెనకుంట్లకు చెందిన కావటి తేజస్వినిని మూడేళ్లుగా సత్తుపల్లిలో డిప్లొమా చదువుతున్న రోజుల నుంచి ప్రేమిస్తున్నాడని, మూడు నెలలుగా నితిన్‌ ఫోన్‌ చేసినప్పటికీ తేజస్విని సరిగ్గా మాట్లాడటం లేదని, వేరే వాళ్లతో మాట్లాడుతుందనే అనుమానంతో, పథకం ప్రకారం హత్య చేసినట్లు తెలిపారు.

కుప్పెనకుంట్లలోని తేజస్విని ఇంటి వద్దకు వెళ్లి ఆమెతో మాయమాటలు చెప్పి, మాట్లాడాలని ఇంటి వెనుక నుంచి తీసుకెళ్లి, ద్విచక్రవాహనంపై టేకులపల్లి వెళ్లి, అక్కడి నుంచి ముందుగా అనుకున్న నిర్మానుష్య ప్రదేశం కొత్తలంకపల్లి గుట్టల వద్దకు తీసుకువెళ్లి, మాట్లాడే పేరుతో పక్కన కూర్చోబెట్టుకుని మాట్లాడుతూ.. జేబులో కర్చీఫ్‌ను తీసి, తేజస్విని మెడకు బిగించి, చేతితో నులిమి హత్య చేసినట్లు పేర్కొన్నారు.ముందుగానే పెట్రోల్‌ కూడా తీసుకుని వెళ్లినప్పటికీ, రోడ్డు మీద వాహనాలు తిరుగుతుండటంతో బయపడి తేజస్విని మృతదేహాన్ని అక్కడే వదిలి వెళ్లినట్లు తెలిపారు. కేవలం ప్రేమోన్మాదంతోనే తేజస్విని హత్య చేసినట్లు ఏసీపీ పేర్కొన్నారు. హత్య అనంతరం ద్విచక్రవాహనాన్ని అక్కడి దగ్గర్లో పొదల్లో పడేసి, ఏమీ ఎరుగనట్లు బస్సు ఎక్కి ఖమ్మంలోని ప్రైవేటు హాస్టల్‌కు వెళ్లాడు.

తేజస్విని తండ్రి కావటి సత్యనారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు, సాంకేతిక ఆధారాలు, ఫోన్‌ కాల్స్, ఇతర మార్గాల ద్వారా విచారణ చేపట్టినట్లు శుక్రవారం లంకపల్లి పొదల వద్ద ఉన్న బండి కోసం వచ్చి, అది తీస్తుండగా పోలీసులు గుర్తించి, నిందితుడు బొల్లెద్దు నితిన్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తే నేరం తానే చేసినట్లు విచారణలో నితిన్‌ వెల్లడించినట్లు ఏసీపీ తెలిపారు. తనను దూరం చేస్తూ,  మాట్లాడటం లేదని, తనను పెళ్లి చేసుకుంటుందో లేదోనని, తనకు దక్కనిది, వేరే వారికి దక్కకూడదనే అక్కస్సుతోనే తేజస్వినిని హత్య చేసినట్లు నిందితుడు ఒప్పుకున్నట్లు వెల్లడించారు. కేసును చేధించిన ట్రైనీ ఎస్‌ఐ శ్రీకాంత్‌ను, ఎస్‌ఐ తోట నాగరాజును, సత్తుపల్లి రూరల్‌ సీఐ రవికుమార్, సత్తుపల్లి సీఐ సురేష్‌లను అభినందిస్తున్నట్లు, వారికి రివార్డులు అందేలా చూస్తానన్నారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా