ప్రతీకారంతో రగిలి అదును చూసి..

29 Aug, 2019 10:14 IST|Sakshi

సాక్షి, కావలి(నెల్లూరు) : జలదంకి మండలంలోని బ్రాహ్మణక్రాక గ్రామంలో ఈనెల 22వ తేదీన జరిగిన హత్య కేసులో నిందితుడైన పందిటి శీనయ్య అనే వ్యక్తిని అరెస్ట్‌ చేసినట్లు కావలి డీఎస్పీ డి.ప్రసాద్‌ తెలిపారు. కావలిలోని తన కార్యాలయంలో బుధవారం ఆయన వివరాలు వెల్ల డించారు. జలదంకి మండలంలోని చామదల గ్రామం అరుంధతీయవాడకు చెందిన శీనయ్య మేనత్త కుమారుడైన పోలయ్యను ఏప్రిల్‌ నెలలో మొద్దు నాగార్జున (27) తన బంధువులతో కలిసి తీవ్రంగా కొట్టి గాయపరిచాడు.

దీంతో పోలయ్య మూడునెలలపాటు కోమాలో ఉండటం, దీనికి సంబంధించిన కేసులో నాగార్జున పేరు లేకపోవడంతో శీనయ్య ప్రతీకారంతో రగిలిపోయాడు. నాగార్జునను హత్య చేయాలని ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు. ఈనెల 22వ తేదీ శీనయ్య నాగార్జునను బ్రాహ్మణక్రాక వద్ద ఉన్న మద్యం షాపునకు పిలిచాడు. అతని చేత మద్యం తాగించాడు. అనంతరం వెనుకవైపున జొన్నపొలంలోకి తీసుకెళ్లి బండరాయితో నాగార్జున తలపై బలంగా కొట్టాడు. మరణించాడో లేదో అనే అనుమానం వచ్చి గొంతు నులిమాడు. అతను చనిపోయాడని నిర్ధారించుకుని శీనయ్య అక్కడి నుంచి పరారయ్యాడు.

మరుసటిరోజు పొలంలో నాగార్జున మృతదేహాన్ని చూసిన రైతు పోలీసులకు సమాచారం తెలియజేయడంతో వారు కేసు నమోదుచేసి దర్యాప్తు చేశారు. శీనయ్యను అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించాడు. హత్యకు గురైన నాగార్జున కూడా అదే గ్రామంలోని అరుంధతీయవాడకు చెందిన యువకుడని డీఎస్పీ తెలిపారు. కావలి రూరల్‌ సీఐ టి.మురళీకృష్ణ, జలదంకి ఎస్సై కె.ప్రసాద్‌రెడ్డి, ఏఎస్సై తిరుమలరెడ్డి, సిబ్బంది దర్యాప్తు చేశారని వెల్లడించారు. 

మరిన్ని వార్తలు