రైస్‌ పుల్లింగ్‌ ముఠా అరెస్టు

30 Jul, 2019 11:10 IST|Sakshi
వివరాలు వెల్లడిస్తున్న సీసీఎస్‌ ఇన్‌చార్జి డీఎస్పీ అజీజ్‌  

సాక్షి, కోనేరుసెంటర్‌(కృష్ణా) : జిల్లాలోని పలు ప్రాంతాల్లో తక్కువ ధరకు బంగారాన్ని విక్రయిస్తామంటూ ప్రజలను మోసం చేస్తూ రైస్‌ పుల్లింగ్‌ నేరాలకు పాల్పడుతున్న పలువురిని బందరు సీసీఎస్‌ పోలీసులు సోమవారం అరెస్ట్‌ చేశారు. వారి నుంచి రైస్‌ పుల్లింగ్‌ యంత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం బందరు సీసీఎస్‌ పోలీస్‌స్టేషన్‌లో ఇన్‌చార్జి డీఎస్పీ అజీజ్‌ విలేఖరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాలు గుడివాడ బిళ్లపేట గ్రామానికి చెందిన బొడ్డేపల్లి రాజేష్‌ వెల్డింగ్‌ పనులు చేస్తుంటాడు. రోజువారీ సంపాదన చాలని రాజేష్‌ తక్కువ కాలంలో ధనవంతుడు కావాలని దురాలోచన చేశాడు. తక్కువ ధరకు బంగారాన్ని ఇప్పిస్తానని జనాన్ని నమ్మిస్తూ మోసాలు చేయడం మొదలుపెట్టాడు. మరిన్ని నేరాలకు పాల్పడేందుకు రైస్‌ పుల్లింగ్‌కు సంబంధించి విశేషాలపై పట్టు సాధించాడు.

రైస్‌పుల్లింగ్‌లో ఆరితేరిన అనంతరం చల్లపల్లి మండలం లంకపల్లి గ్రామానికి చెందిన కాగిత చక్రధర్, ముదినేపల్లికి చెందిన గరిమెళ్ల హర్షవర్ధన్, గుడివాడకు చెందిన వర్ల గణేష్, భీమడోలుకు చెందిన బొంతుల శ్రీను, కొత్తగూడేనికి చెందిన బాకీ లక్ష్మీపతి, గుడివాడకు చెందిన షేక్‌అల్లాభక్షు, బాపట్ల కోటేశ్వరరావు, తాళ్లపాలేనికి చెందిన కారే దుర్గాప్రసాద్, గుడ్లవల్లేరుకు చెందిన జంపాని దేవదత్తలకు మాయమాటలు చెప్పి దొంగతనాలు చేసేందుకు ఒప్పించాడు. అలాకొంత కాలంగా గుడివాడ వన్‌టౌన్‌లోని బేతవోలు సమీపంలో ఉన్న కామాక్షి గుడిలోని ధ్వజ స్తంభానికి ఉన్న కలశాన్ని దొంగతనం చేశాడు. గుడివాడ రూరల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని చౌటపల్లి గ్రామంలోని శివాలయం గుడిలో ఉన్న కలశాన్ని అపహరించారు. వీటితో పాటు జిల్లాలోని అనేక చోట్ల రైస్‌ పుల్లింగ్‌ నేరాలకు పాల్పడి ప్రజలను మోసం చేశారు. అలాగే ఆకివీడులో సగం ధరకే బంగారాన్ని ఇప్పిస్తానని కొంత మందిని నమ్మించి పెద్ద మొత్తంలో డబ్బులు గుంజుకుపోయారు. వీరి మాటలు నమ్మిన మచిలీపట్నానికి చెందిన సిద్దిశెట్టి ఖాజావలి రూ.50 వేలు వరకు ముట్టజెప్పి మోసపోయాడు.

విషయం తెలుసుకున్న బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మరో వ్యక్తి అబ్దుల్లా వద్ద అదే తరహాలో మరో రూ. 20వేలు వసూలు చేసి మోసం చేశారు. ఇలా మోసాలు చేస్తున్న రాజేష్, అతని మిత్రులపై మచిలీపట్నంతో పాటు గుడివాడలో పలు కేసులు నమోదు కాగా మచిలీపట్నం రైల్వేస్టేషన్‌ సమీపంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న వారిని బందరు సీసీఎస్‌ పోలీసులు సోమవారం పట్టుకున్నారు. వారి నుంచి రైస్‌ పుల్లింగ్‌కు సంబంధించిన టార్చ్‌లైట్, నల్ల పసుపు, చంద్రకాంత్‌ ముత్యం, టర్కీనోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ అజీజ్‌ తెలిపారు. తక్కువ ధరకు బంగారం వస్తుందన్న ఆశతో అనేక మంది అమాయకులు వీరి చేతిలో మోసపోయినట్లు చెప్పారు. అదుపులోకి తీసుకున్న వారందరినీ రిమాండ్‌ నిమిత్తం కోర్టుకు తరలిస్తున్నట్లు ఆయన వివరించారు. సమావేశంలో సీసీఎస్‌ ఎస్‌ఐ హబీబ్‌బాషా, మచిలీపట్నం ఎస్‌ఐ డి.రాజేష్, స్టేషన్‌ సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు