సెక్యూరిటీ గార్డు నుంచి ఘరానా దొంగగా!

30 Jul, 2019 11:31 IST|Sakshi
నేరస్తులను చూపుతున్న ఎస్పీ, అదనపు ఎస్పీ, డీఎస్పీ తదితరులు

సాక్షి, మహబూబ్‌నగర్‌ : అసోం నుంచి జిల్లాకు వలస వచ్చాడు.. పలు కంపెనీల్లో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తూ ఓ దొంగతనం కేసులో జైలుకి సైతం వెళ్లి వచ్చాడు. ఆ తర్వాత రాత్రి వేళల్లో తాళం వేసిన ఇళ్లలో దొంగతనాలు చేయడం మొదలుపెట్టి.. జడ్చర్ల పోలీసులకు నిద్రలేకుండా చేశాడు. ఎట్టకేలకూ ఈ ఘరానా దొంగ పోలీసులకు చిక్కాడు.  ఈ కేసుకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం ఎస్పీ రెమా రాజేశ్వరి విలేకర్లకు వెల్లడించారు. 

టెక్నికల్‌ విభాగం సహకారంతో..
జడ్చర్ల పోలీస్‌స్టేషన్‌ పరిధిలో వరుసగా జరుగుతున్న దొంగతనాల నేపథ్యంలో ఒక ప్రత్యేక పోలీసు బృందం ఏర్పాటుచేయగా, పోలీసు టెక్నికల్‌విభాగం వారి సహకారంతో దొరికిన ఆధారాలతో నిందితుడిని సోమవారం అదుపులోకి తీసుకుని విచారణ చేయడం జరిగింది.  ఈ మూడు కేసుల్లో నిందితుడు కేషాబ్‌మేధి నుంచి మొత్తం రూ.1.62 లక్షలను రికవరీ చేయడం జరిగింది. నేరస్తుడుని రిమాండ్‌కు తరలించినట్లు ఎస్పీ తెలిపారు. ఈ కేసును చేధించిన జడ్చర్ల పోలీసులను ఎస్పీ అభినందించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ వెంకటేశ్వర్లు, డీఎస్పీ భాస్కర్‌ పాల్గొన్నారు.

అనుమానితులపై సమాచారం ఇవ్వండి
జిల్లాకు వివిధ రాష్ట్రాల నుంచి వలసలు వచ్చి పలు ఇళ్లలో అద్దెకు దిగుతుంటారని, అలాంటి వ్యక్తులపై అనుమానం ఉంటే వారి వివరాలు స్థానిక పోలీసులకు ఇవ్వాలని జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి అన్నారు. కొందరు అద్దె ఇళ్లలో ఉండేవారు చాలా రోజులు కన్పించకుండాపోయి మళ్లీ వస్తుంటారని, మరి కొందరి దగ్గర ఉన్నట్టుండి వాహనాలు, డబ్బులు అధికంగా కన్పిస్తుంటాయని, ఇలాంటి వారి వివరాలు ఇవ్వాలన్నారు. ఆధార్‌కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఇతరత్రా ప్రభుత్వ, వృత్తిపరమైన అధికారిక ధృవీకరణ పత్రాలను పరిశీలించాల్సి ఉందని, ఇటీవల కాలంలో పోలీసుశాఖ చేస్తున్న కార్డన్‌ సెర్చ్‌లో వీటిని తనిఖీ చేయటం జరుగుతుందని ఇటువంటి అంశాల పట్ల ప్రజలు కూడా అవగాహన కలిగి ఉండాలని ఎస్పీ వివరించారు. మన జిల్లాకు సంబంధించి ఇతర రాష్ట్రాల నుండి వచ్చి పనిచేస్తున్న వారి వివరాలు చాలా వరకు సేకరించి పెట్టామని ఈ కార్యక్రమం నిరంతరం కొనసాగుతుందని ఎస్పీ తెలిపారు. నేరాలను నియంత్రించడానికి పోలీసుశాఖ చేపట్టే చర్యలకు అందరు తమవంతు సమాచారం ఇవ్వడం వలన శాంతియుత వాతావరణాన్ని నిర్మించగలమని  తెలిపారు.

తాళం వేసిన ఇళ్లే టార్గెట్‌
తాళం వేసిన ఇళ్లను టార్గెట్‌ చేసి రాత్రి వేళల్లో చోరీలకు పాల్పడేవాడు. ఈమేరకు 2019 జూన్‌ 17, 18న ఇతను అర్ధరాత్రి బాదేపల్లిలోని సూర్యనాగమణి ఇంట్లో చొరబడి, అర్ధతులం కమ్మలు, 25 తులాల కాళ్లపట్టిలు, రూ.25 వేలు నగదు, రెండు సిలిండర్లు మొత్తం రూ.50 వేల విలువవి చోరీ చేశాడు. అదేవిధంగా జూలై 14, 15న అర్ధరాత్రి క్యామ చిలకమ్మ ఇంట్లో చొరబడి రెండు తులాల బంగారు గొలుసు, రెండు తులాల బంగారు నాను, అర్ద తులం చెవిరింగులు, 12 తులాల వెండి కాలిపట్టా, 2 కలర్‌ టీవీలు, రూ.5300 నగదు మొత్తం రూ.85,300 ఇతర వస్తువులు తస్కరించాడు. అనంతరం  జూలై 19న అర్ధరాత్రి బాదేపల్లిలోని అష్రఫ్‌ సుల్తానా భర్త హసన్‌బిన్‌ అబ్ధుల్‌ సాబ్‌ ఇంట్లో రెండున్నర తులాల నెక్లెస్, ఒక తులం మంగళసూత్రం, 17 తులాల వెండి పట్టాలు, టీవీ ఇతర వస్తువులు దోపిడీ చేశాడు. వీటి విలువ సుమారు రూ.80 వేలుగా గుర్తించారు.

ఐదేళ్ల నుంచి ఇక్కడే మకాం.
అసోం రాష్ట్రానికి చెందిన కేషాబ్‌ మేధి 5ఏళ్ల నుంచి జడ్చర్లలో నివాసం ఉంటూ పోలేపల్లిలో ఉన్న హెటిరో ఫార్మసిలో సెక్యూరిటీ గార్డుగా చేరాడు. కొన్ని రోజుల తర్వాత అతని ప్రవర్తన బాగాలేకుంటే కంపెనీ వారు తొలగించారు. ఆ తర్వాత గొల్లపల్లి గ్రామంలో ఉన్న సలసార్‌ బాలాజీ టెక్స్‌టైల్స్‌లో సెక్యురిటీ గార్డుగా పనిచేశాడు. అక్కడ పనిచేసే సమయంలో రాగిబండల్స్‌ చోరీ కేసులో మరో ఇద్దరితో పాటుగా ఇతనిపై కేసు నమోదు కావడంతో జైలుకు వెళ్లి వచ్చాడు. ఆ తర్వాత నిందితుడు కేషాబ్‌మేధి సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూనే రాత్రి వేళల్లో తాళాలు వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకొని దొంగతనాలను పాల్పడటం ప్రారంభించాడు.  

మరిన్ని వార్తలు