మోస్ట్‌వాంటెడ్‌ క్రిమినల్‌ అరెస్ట్‌

30 Jan, 2020 10:09 IST|Sakshi
వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ బూసారపు సత్యయేసుబాబు

సాక్షి, అనంతపురం: అత్త.. అమ్మమ్మ అంటూ వరుసలు కలుపుతాడు.. నేను మీ బంధువును అంటూ నమ్మిస్తాడు.. అదును చూసి దోచేస్తాడు. ఈ మోస్ట్‌ వాంటెడ్‌ దొంగను సీసీఎస్, తాడిపత్రి పోలీసులు సంయుక్తంగా అరెస్ట్‌ చేశారు. నిందితుని నుంచి రూ. 40 లక్షల విలువజేసే 101.4 తులాల బంగారు ఆభరణాలతో పాటు ఓ ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను బుధవారం నగరంలోని పోలీసు కాన్ఫరెన్స్‌ హాలులో ఎస్పీ బూసారపు సత్యయేసుబాబు మీడియాకు వివరాలు వెల్లడించారు. కర్నూలు జిల్లా నంద్యాల మండలం కానాల గ్రామానికి చెందిన దూదేకుల మస్తాన్‌వలి అలియాస్‌ మస్తాన్‌ ఐటీఐ వరకు చదువుకుని ఎలక్ట్రీషియన్‌గా పనిచేసేవాడు.

తాగుడు, పేకాట, బెట్టింగ్‌లకు అలవాటుపడి దొంగగా మారిన మస్తాన్‌ రాష్ట్రంలోని అనంతపురం, కడప, కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో గత మూడేళ్లలో ఏకంగా 26 నేరాలకు పాల్పడ్డాడు. మంచిగా, నేర్పుగా, అణకువగా మాట్లాడటం.. అత్త, అవ్వ, మామా అంటూ బంధుత్వాలు, వరుసలతో మాటలు కలపడమే పనిగా పెట్టుకున్నాడు. గ్రామీణ ప్రాంతాలకు వెళ్లి ఇళ్లలో మగవాళ్లు లేని సమయం చూసి వృద్ధ మహిళలతొ మీకు దూరపు బంధువును అవుతానని నమ్మబలుకుతాడు. వారు నిజమేనని నమ్మి మర్యాదలు చేయడం ప్రారంభిస్తారు. ఈ క్రమంలో వారు ధరించిన బంగారు ఆభరణాలు బాగున్నాయని కితాబిస్తూనే చాకచక్యంగా నగలను ఇవ్వాలని కోరుతాడు. ఇతని మాటలు నమ్మి వారు ఆభరణాలను ఇచ్చేస్తాడు. ఒక వేళ ఇవ్వని పక్షంలో లాక్కొనిపారిపోతాడు.  

అరెస్టయినా 
మస్తాన్‌ 26 కేసుల్లో అరెస్ట్‌ అయ్యాడు. తాడిపత్రి రూరల్, పామిడి, పెద్దవడుగూరు, పెద్దపప్పూరు, పుట్లూరు, తాడిపత్రి, అనంతపురం, కర్నూలు జిలాలలో ప్యాపిలి, మద్దికెర, కడపలో రాజుపాళ్యం, ప్రకాశం ప్రాంతాల్లో 2017 నుంచి నేరాలకు పాల్పడ్డాడు. అంతకు మునుపు కూడా ఇతనిపై 14 నేరాలున్నాయి. గతంలో తిరుపతి, కోవెలకుంట్ల పోలీసులు అరెస్ట్‌ చేసి జైలుకు పంపినా ఇతనిలో మార్పు రాలేదు. దొంగలపై నిఘా ఉంచిన తాడిపత్రి సబ్‌ డివిజన్‌ పోలీసులు ఈ మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్‌ అయిన మస్తాన్‌ను సీసీఎస్‌ డీఎస్పీ శ్రీనివాసులు, తాడిపత్రి డీఎస్పీ శ్రీనివాసులు, అనంతపురం డీఎస్పీ వీరరాఘవరెడ్డి పర్యవేక్షణలో సీసీఎస్‌ సీఐ శ్యాంరావు, తాడిపత్రి రూరల్‌ ఎస్‌ఐ రాజశేఖర్, సీసీఎస్‌ ఎస్‌ఐలు చలపతి, చాంద్‌బాషా, సిబ్బంది శ్రీనివాసులు, భాస్కర్, కృష్ణానాయక్, జయచంద్రారెడ్డి, తిరుపతయ్య, ఫరూక్, అనిల్, మల్లి, సతీష్, మనోహర్, రంజిత్, దూద్‌వలీ అరెస్ట్‌ చేశారు. వీరిని ఎస్పీ సత్యయేసుబాబు అభినందించారు. రివార్డులతో సత్కరించారు.   

మరిన్ని వార్తలు