‘ఆధార్‌’ మోసగాడి అరెస్ట్‌

16 Jul, 2019 11:23 IST|Sakshi
నిందితుడి అరెస్టు చూపుతున్న పోలీసులు 

సాక్షి, స్టేషన్‌ఘన్‌పూర్‌(వరంగల్‌) : ఆధార్‌ కార్డుల్లోని పేర్లు మారుస్తామని, తాను కలెక్టరేట్‌ నుంచి వచ్చానని నమిలిగొండ గ్రామస్తులను మోసం చేసిన ఆలువాల వినయ్‌కుమార్‌ని సోమవారం అరెస్ట్‌ చేసినట్లు ఏసీపీ వెంకటేశ్వరబాబు తెలిపారు. రైతులకు కేంద్ర ప్రభుత్వం అందించే పెట్టుబడి సాయాన్ని బ్యాంక్‌ ఖాతాలలో వేస్తామని గ్రామస్తుల నుంచి ఆధార్‌కార్డు నంబర్లు, వేలిముద్రలు తీసుకుని దాదాపు రూ.2.60లక్షలు కాజేశాడని తెలిపారు.  ఈ సందర్భంగా స్టేషన్‌ఘన్‌పూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఏసీపీ వివరాలను వెల్లడించారు. వరంగల్‌ అర్బన్‌ జిల్లాలోని నెక్కొండ మండలం సీతాపురం గ్రామానికి చెందిన  అలువాల వినయ్‌కుమార్‌ ఈ ఏడాది బీటెక్‌ పూర్తి చేశాడు.  

తమ గ్రామానికి చెందిన సం«ధ్యారాణిని చిల్పూరు గుట్ట వద్ద కులాంతర వివాహం చేసుకున్నాడు. అనంతరం చిల్పూరు మండలం చిన్నపెండ్యాల గ్రామంలో ఒక రూం అద్దెకు తీసుకుని ఓ ప్రైవేటు ఉద్యోగం కోసం వెతుకుతున్నాడు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రైమ్‌ మినిష్టర్‌ గ్రామీణ డిజిటల్‌ సాక్షరత అభియాన్‌(పీఎంజీడీఐఎస్‌ఏ)లో గ్రామాల్లోని యువతకు కంప్యూటర్‌పై అవగాహన, శిక్షణ కల్పించేందుకు అందులో విలేజ్‌ లెవల్‌ ఎంట్రప్రీనియర్‌గా చేరాడు.  రెండు నెలల క్రితం పీఎంజీడీఐఎస్‌ఏ ప్రోగ్రాంలో భాగంగా చిల్పూరు మండలం నష్కల్‌లో పనిచేశాడు. 

తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాధించాలని..
ఆ ప్రోగ్రాంను ఆసరాగా చేసుకుని ప్రజలను మోసం చేసి తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సాధించాలనే ఆలోచనతో ఆన్‌లైన్‌ను ఉపయోగించి దగా చేయాలనే ఆలోచనతో నమిలిగొండ గ్రామాన్ని ఎంచుకున్నాడు. ఆధార్‌ నంబర్లు, వేలిముద్రలతో వారి బ్యాంకు ఖాతాల నుంచి డబ్బులను తన ఖాతాలోకి మార్చుకునే అవకాశం ఆన్‌లైన్‌లో ఉందని తెలుసుకుని ముందుగా గ్రామ సర్పంచ్‌ను కలిశాడు. తాను జనగామ కలెక్టరేట్‌ నుంచి వచ్చానని, ఆధార్‌ కార్డులలో జిల్లా పేరు మారుస్తామని, తద్వారా కేంద్ర ప్రభుత్వం రైతులకు అందించే పెట్టుబడి సాయం డబ్బులు మీ ఖాతాలలో పడుతాయని సర్పంచ్‌తో నమ్మబలికాడు. అది నమ్మిన సర్పంచ్‌ మరుసటి రోజు ఉదయం గ్రామంలో డప్పు చాటింపు వేయించాడు.

ల్యాప్‌టాప్, ఫింగర్‌ ప్రింట్‌ డివైసర్‌తో గ్రామానికి వచ్చిన ఆ మోసగాడు ఈ నెల 1 నుంచి 4వ తేదీ వరకు  ల్యాప్‌టాప్‌లో బయోమెట్రిక్‌ ద్వారా వారి ఆధార్‌ కార్డుల వివరాలు, వేలిముద్రలు తీసుకుని ఆన్‌లైన్‌లో డిజీపే యాప్‌ ద్వారా వారి బ్యాంక్‌ ఖాతాల నుంచి మొత్తం రూ.2,59,500 డ్రా చేశాడు. బాధితులైన గ్రామస్తుల్లో ఒక్కొక్కరి బ్యాంకు ఖాతా నుంచి రూ.600 నుంచి రూ.1000 వరకు అక్రమంగా కామన్‌ సర్వీస్‌ సెంటర్‌ నుంచి అతడి ఖాతాలోకి మార్చుకున్నాడు. ఖాతాల నుంచి డబ్బులు కట్‌ అయిన విషయం మెస్సేజ్‌ల ద్వారా తెలుసుకున్న బాధితులు సర్పంచ్‌ను సంప్రదించగా సర్పంచ్‌ ఆ హైటెక్‌ మోసగాడికి ఫోన్‌ చేశారు. అయితే అతను ఈ నెల 9న వస్తానని, అప్పటివరకు ఆగండని బుకాయించాడు. అది నమ్మిన వారు అతను రాకపోవడంతో స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధితుల «ఫిర్యాదు మేరకు సీఐ రాజిరెడ్డి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

చిన్నపెండ్యాలలో అదుపులోకి..
ఈ క్రమంలో అతడిని చిన్నపెండ్యాలలో స్థానిక ఎస్సై రవి ఆధ్వర్యంలో సోమవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైటెక్‌ మోసగాడిని విచారించగా నేరం అంగీకరించాడని, రిమాండ్‌ నిమిత్తం కోర్టుకు తరలించినట్లు తెలిపారు. నిందితుడు మోసం చేసిన రూ.2,59,500లతో పాటు ల్యాప్‌టాప్, ఫింగర్‌ ప్రింట్‌ డివైసర్‌ను రికవరీ చేయడం జరిగింది. కోర్టులో విషయాన్ని న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లి బాధితులకు వారి బ్యాంకు ఖాతాల నుంచి నేరస్తుడు తన ఖాతాలోకి మార్చుకున్న డబ్బుల వివరాల ఆధారంగా బాధితులకు డబ్బులు తిరిగి అందేలా చూస్తామన్నారు. కేవలం వారం రోజుల లోపులోనే నిందితుడిని పట్టుకున్న సీఐ రాజిరెడ్డి, ఎస్సై శీలం రవియాదవ్‌ను, కానిస్టేబుళ్లు అనిల్, నవీన్, కుమార్‌లను ఏసీపీ ప్రత్యేకంగా అభినందించారు. అదే విధంగా వారిని ఫోన్‌లో సీపీ, డీసీపీ అభినందించినట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు