కి‘లేడి’ అరెస్టు

23 Nov, 2019 10:59 IST|Sakshi

సాక్షి భువనగిరిఅర్బన్‌(నల్గొండ) : బస్సుల్లో చోరీలకు పాల్పడుతున్న ఓ మహిళను అరెస్టు చేసినట్లు డీసీపీ కె.నారాయణరెడ్డి శుక్రవారం తెలిపారు. ఆంద్రప్రదేశ్‌ రాష్ట్రంలోని కర్నూల్‌ జిల్లా భూదవారిపేటకు చెందిన అక్షింతల సంధ్య అలియాస్‌ దివ్య టైలరింగ్‌ పనిచేస్తు జీవనం సాగిచేంది. టైలరింగ్‌లో డబ్బులు అనుకున్నంతగా రాకోపోవడంతో సంతృప్తి చెందలేదు. అనంతపూర్‌ జిల్లాకు చెందిన గంట రామస్వామి బ్యాచ్‌లో చేరి 2010 నుంచి 2016 వరకు చాలా ప్రాంతాల్లో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికురాలిగా నటిస్తు అసలు ప్రయాణికుల వద్ద నుంచి బంగారు అభరణాలను అపహరించేది. ఆమె తన ముఠా సభ్యులతో కలిసి భువనగిరిటౌన్, రూరల్, బీబీనగర్, యాదగిరిగుట్ట, ఆలేరు ములుగు, దేవరకొండ పోలీస్‌ స్టేషన్ల పరిధిలో దొంగతనాలకు పాల్పడింది. గతంలోనే పోలీసులు ఆమెను అరెస్టు చేసి నల్లగొండ జైలు పంపారు. బెయిల్‌పై తిరిగి బయటికి వచ్చింది. తన గ్రామంలో ఉన్న లలితతో స్నేహం చేసింది. ఇద్దరు కలిసి  రద్దీగా ఉండే బస్సుల్లో చోరీలకు పాల్పడాలని నిర్ణయించుకుని హైదరాబాద్‌కు వచ్చారు. ఈ క్రమంలో ఈ నెల 21న హైదరాబాద్‌లోని  ఉప్పల్‌ నుంచి హన్మకొండకు వెళ్తున్న రద్దీగా ఉన్న బస్సును ఎక్కారు.

బస్సులో ప్రయాణిస్తున్న జి.సూర్యమ్మ, టి. కృష్ణవేణిల పక్కన ప్రయాణికులుగా కూర్చున్నారు. బస్సు భువనగిరి దాటిన తర్వాత బస్సులో రద్దీగా ఉండటంతో సంధ్య సూర్యమ్మ బ్యాగులో ఉన్న 4 గ్రాముల బంగారు చెవి దిద్దులు, లలిత జి.కృష్ణవేణికి చెందిన బ్యాగులో నుంచి  నగదును అపహరించారు. వెంటనే బస్సును రాయగిరి వద్ద హడవీడిగా నిలిపి వేసి  దిగారు. గమనించిన సూర్యమ్మ, కృష్ణవేణిలు తమ బ్యాగులను చెక్‌ చేసుకోగా బంగారం, నగదు కనబడలేదు. వెంటనే వారిని పట్టుకోమని తోటి ప్రయాణికులకు చెప్పడంతో సంధ్యను పట్టుకొగా, లలిత పారిపోయింది. అనంతరం సంధ్యను ప్రయాణికులు రూరల్‌ పోలీస్‌లకు అప్పగించారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి విచారణ చేపట్టగా చోరీలకు పాల్పడుతున్నట్లు అంగీకరించింది. ఆమెనుంచి చెవి దిమ్మెలు, రూ.లక్ష నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అనంతరం కోర్టుకు రిమాండ్‌కు పంపినట్లు చెప్పారు. కేసును ఛేదించిన రూరల్‌ సీఐ సురేందర్‌రెడ్డిని, ఎస్‌ఐ రాఘవేందర్‌గౌడ్‌ను, సిబ్బందిని అభినందించారు.    

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా