తక్కువ ధరకే బంగారం అంటూ ఏకంగా..

8 Sep, 2019 06:52 IST|Sakshi
నిందితుల వివరాలు వెల్లడిస్తున్న సీసీఎల్‌ డీఎస్పీ వినోద్‌కుమార్‌ 

రూ.30 లక్షలు సమర్పించుకున్న బాధితుడు

మోసగాళ్ల ముఠా అరెస్ట్‌

రూ.18 లక్షల నగదు స్వాధీనం 

సాక్షి, కర్నూలు: తక్కువ ధరకే బంగారం ఇస్తామంటూ నమ్మబలికి, పంచలోహ విగ్రహాలు అంటగట్టి ఏకంగా రూ.30 లక్షలతో చెక్కేసిన ముగ్గురు ముఠా సభ్యులను పోలీసులు శనివారం అరెస్ట్‌ చేశారు. వారి వద్ద నుంచి రూ.18 లక్షల నగదు రికవరీ చేశారు. నిందితుల వివరాలను సీసీఎస్‌ పోలీసు స్టేషన్‌లో డీఎస్పీ వినోద్‌కుమార్‌ విలేకరులకు వెల్లడించారు. స్థానిక గణేష్‌ నగర్‌లో నివాసముండే శివకుమార్‌ నంద్యాల చెక్‌పోస్టు సమీపంలో సాయిబాబా నర్సరీ నిర్వహిస్తున్నాడు. కర్ణాటక రాష్ట్రం దావణగేరి జిల్లా కొరచరహట్టీ గ్రామానికి చెందిన కొరచ గంగప్ప, అగసహల్లీ గ్రామానికి కొరస నాగేష్, ఉత్సవణహల్లీ గ్రామానికి చెందిన కొరచ విజయకుమార్‌ ముఠాగా ఏర్పడి కష్టపడకుండా డబ్బు సంపాదించేందుకు ప్రణాళిక రచించుకున్నారు.

శివకుమార్‌ విజిటింగ్‌ కార్డు దొరకబుచ్చుకొని అందులోని నంబర్‌కు ఫోన్‌ చేసి, ఇంటి నిర్మాణం కోసం పునాదులు తవ్వుతుండగా పాత కాలం నాటి బంగారం దొరికిందని, తక్కువకే ఇస్తామని నమ్మబలికారు. ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందన్న ఉద్దేశంతో విక్రయించడానికి కర్నూలుకు వచ్చామని చెప్పడంతో శివకుమార్‌ ఈ ఏడాది ఏప్రిల్‌ 21న నంద్యాల చెక్‌పోస్టు వద్ద వారిని కలుసుకున్నాడు. రెండు నాణేలు ఇచ్చి పరిశీలించుకు రమ్మని పంపారు. నాణేలు ఒరిజినల్‌ కావడంతో వారి మాటలు నమ్మి 3 కిలోల బంగారు కోసం రెండు విడతలుగా రూ.30 లక్షలు అప్పజెప్పాడు. అనంతరం పంచలోహాలతో తయారుచేసిన నకిలీ నాణేలను కట్టబెట్టారు. వాటిని బంగారు వ్యాపారి వద్ద కరిగించగా నకిలీవని తేలడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.

కేసు నమోదు చేసుకున్న సీసీఎస్‌ పోలీసులు నిఘా ఉంచారు. శనివారం బళ్లారి చౌరస్తా సమీపంలోని ఇంటర్నేషనల్‌ ఫంక్షన్‌ హాల్‌ వద్ద ముగ్గురినీ అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి రూ.18 లక్షల నగదు స్వాధీనం చేసుకుని సీసీఎస్‌ డీఎస్పీ వినోద్‌కుమార్‌ ఎదుట హాజరు పరిచారు. మోసగాళ్లను అరెస్టు చేయడమే గాక వారి వద్ద నుంచి భారీ మొత్తంలో నగదు రికవరీ చేసినందుకు ఎస్‌ఐ మల్లికార్జున, ఏఎస్‌ఐ విజయ్‌భాస్కర్, హెడ్‌కానిస్టేబుళ్లు జెఎండీ రఫి, ఎంవీ శ్రీనివాసులు, కానిస్టేబుళ్లు దేవరాజు, రమేష్‌లను డీఎస్పీ అభినందించారు.  ఇది చదవండి : డీటీ..అవినీతిలో మేటి!

మరిన్ని వార్తలు