ప్రేమకు అడ్డు వస్తున్నాడని హత్య

7 Jul, 2019 11:51 IST|Sakshi
శివారెడ్డి, మహేందర్‌రెడ్డిని అరెస్ట్‌ చూపిస్తున్న డీఎస్పీ మధుసూదన్‌రావు 

సాక్షి, పాల్వంచ(ఖమ్మం): తన ప్రేమకు అడ్డుగా ఉన్నాడని భావించి అమ్మాయి అన్నను అంతమొందించిన ప్రేమికుడిని, అతడికి సహకరించిన మరో యువకుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను శనివారం సీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ మధుసూదన్‌రావు వెల్లడించారు. తాను ప్రేమిస్తున్న అమ్మాయి అన్న బెదిరించడంతో తట్టుకోలేక కక్షతో రగిలిపోతుండగా, గురువారం అర్ధరాత్రి అనుకోకుండా కలవడంతో ఘర్షణ పడి చివరికి హత్య చేశారు. పట్టణంలోని తెలంగాణనగర్‌కు చెందిన యనముల మాధవరెడ్డి కొడుకు శివశంకర్‌రెడ్డి అలియాస్‌ శివారెడ్డి మొబైల్‌ రిపేరింగ్‌ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.

ఇతను  కొంత కాలంగా బ్రాహ్మణవీధికి చెందిన ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. ఈ విషయం అమ్మాయి కుటుంబంలో తెలిసి గొడవలు జరిగాయి. పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ పెట్టగా శివారెడ్డి అమ్మాయి జోలికి రానని హామీ పత్రాన్ని కూడా రాసిచ్చాడు. అయినా మళ్లీ ప్రేమ వ్యవహారం కొనసాగిస్తున్నాడు. దీంతో అమ్మాయి అన్న ఎండీ.షకీల్‌ తన స్నేహితులతో కలిసి శివారెడ్డిని గతంలో రెండుసార్లు బెదిరించాడు. ఈక్రమంలో  గురువారం రాత్రి శివారెడ్డి తన స్నేహితుడి పుట్టిన రోజు వేడుకలో పాల్గొని తెలంగాణనగర్‌కు వెళుతుండగా దమ్మపేట సెంటర్‌ వద్ద  షకీల్, అతని స్నేహితుడిని తిట్టుకుంటూ వెళ్లాడు. తట్టుకోలేకపోయిన షకీల్‌ తన స్నేహితుడితో కలిసి శివారెడ్డి ఇంటికే వెళ్లాడు.

ఎప్పటి నుండో షకీల్‌పై కక్షతో రగిలి పోతున్న శివారెడ్డి ఇదే అదునుగా భావించి వరుసకు అన్న అయిన అనుముల మహేందర్‌రెడ్డితో కలిసి కత్తితో షకీల్‌ మెడిపై పొడిచాడు. దీంతో రక్తం కారుతున్న షకీల్‌ భయంతో రోడ్డు వద్ద పాత ఇనుప కొట్టు వరకు పారిపోయాడు. ఈ క్రమంలో షకీల్‌ స్నేహితుడు స్థానికులను నిద్ర లేపి తీసుకొచ్చేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో వారు మళ్లీ షకీల్‌ను వెంబడించి మెడపై, ఛాతిపై నరికి అక్కడి నుంచి పరారయ్యారు. షకీల్‌ అక్కడిక్కడే మృతి చెందాడు. షకీల్‌ తండ్రి గౌస్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు శనివారం స్థానిక దమ్మపేట సెంటర్‌ వద్ద నిందితులు శివారెడ్డి, మహేందర్‌ రెడ్డిని అరెస్ట్‌ చేసినట్లు డీఎస్పీ తెలిపారు. సమావేశంలో సీఐ మడత రమేష్, పట్టణ ఎస్‌ఐ ముత్యం రమేష్‌ పాల్గొన్నారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా