మహిళా మావోయిస్టు అరెస్టు

9 Mar, 2020 08:22 IST|Sakshi
పోలీసులు స్వాధీనం చేసుకున్న టిఫిన్‌బాక్స్, వైర్లు 

ఏటూరునాగారం బస్టాండ్‌ వద్ద పట్టుకున్న పోలీసులు

ఏటూరునాగారం: ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రానికి చెందిన మహిళా మవోయిస్టును ములుగు జిల్లా ఏటూరునాగారం పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. స్థానిక సీఐ నాగబాబు దీనికి సంబంధించిన వివరాలు మీడియాకు తెలిపారు. ఎస్సై శ్రీకాంత్‌రెడ్డి సిబ్బందితో ఏటూరునాగారంలో పెట్రోలింగ్‌ నిర్వహిస్తుండగా.. బస్టాండ​ వద్ద ఒక మహిళ అనుమానాస్పదంగా కనిపించడంతో తనిఖీ చేయగా ఆమె వద్ద ఉన్న సంచిలో పేలుడు పదార్థాలు, పేలుళ్లకు వాడే టిఫిన్‌ బాక్స్‌, వైర్లు, విప్లవ సాహిత్యం లభించిందని చెప్పారు. ఆమెను విచారించగా, తన పేరు హేమ్ల జయమతి, భర్త పేరు మడకం ఉంగ, ఛత్తీస్‌గఢ్‌లోని మరియుగొండి మండలం పుల్లుం గ్రామవాసిగా తెలిపిందని సీఐ నాగబాబు వెల్లడించారు. ఈ విషయాన్ని ఛత్తీస్‌గఢ్‌ పోలీసులకు తెలపగా.. ఆమె నేరచరిత్రపై వివరాలు పంపించారని చెప్పారు.

మవోయిస్టు పార్టీలో ఆమె 14 ఏళ్ల నుంచి ఆమె పనిచేస్తోందని, 2017లో పామేడు ఏరియా కమిటీలో పనిచేసిన జయమతి పలు ఎన్‌కౌంటర్లలో పాల్గొని తప్పించుకుందని చెప్పారు. 2013 ఏప్రిల్‌, మే మధ్యకాలంలో చిన్నగల్లెం, బానిసగూడ పీఎస్‌​ పరిధిలో పోలీసు పార్టీని చంపడానికి జరిపిన కాల్పుల్లో కీలక పాత్ర పోషించినట్టు తెలిపారు. తాజాగా పామేడు కమిటీ సెక్రటరీ మనీల ఆదేశాల మేరకు ఛత్తీస్‌గఢ్‌ నుంచి ఏటూరునాగారం గుర్త తెలియన వ్యక్తి దగ్గర నుంచి పేలుడు పదార్థాలు, విప్లవ సాహిత్యం తీసుకొని తిరిగి ఛత్తీస్‌గఢ్‌ వెళ్లేందుకు ఏటూరునాగారం బాస్టాండ్‌కు రాగా పట్టుకున్నట్టు తెలిపారు. ఆమెపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపుతున్నామని వివరించారు. జయమతిపై ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం రూ.8 లక్షల రికార్డు ప్రకటించిందని చెప్పారు.

మరిన్ని వార్తలు