కి‘లేడీ’ అరెస్టు

7 Jan, 2020 10:49 IST|Sakshi

సాక్షి, భీమారం(వరంగల్‌): వివిధ ప్రాంతాల నుంచి నగరానికి వచ్చి ఇల్లు అద్దెకు తీసుకుంటున్న కొందరు దొంగతనాలకు పాల్పడుతున్నారు. కేయూ పోలీస్‌స్టేషన్‌ పరిదిలో ఇలాంటి సంఘటనలు వెలుగు చూశాయి. ఈమేరకు నిఘా వేసిన పోలీసులు నిందితురాలిని అరెస్ట్‌ చేసి ఆరు తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి కేయూసీ పోలీస్‌స్టేషన్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇన్‌స్పెక్టర్‌ డేవిడ్‌ రాజు వివరాలు వెల్లడించారు. హుస్నాబాద్‌ మండలం హైసమ్మవాగు తండాకు చెందిన భూక్య రజిత యాదవ నగర్, పెద్దమ్మగడ్డ ప్రాంతాల్లో ఇల్లు అద్దెకు తీసుకుని చుట్టుపక్కల వారితో పరిచయాలు పెంచుకుంది. నమ్మకస్తురాలిగా ఉంటూ ఉదయం ఎవరూలేని ఇళ్లలోకి ప్రవేశించి దొంగతనాలు చేస్తోంది. ఆ తర్వాత ఇళ్లు ఖాళీ చేసి మరో ఏరియాకు మకాం మార్చేది. ఇదిలా ఉండగా రెడ్డిపురం క్రాస్‌ వద్ద సోమవారం అనుమానాస్పదంగా కనిపించిన రజితను అదుపులోకి తీసుకుని విచారించగా దొంగతనాలు వెలుగు చూశాయి. పెద్దమ్మగడ్డ, యాదవనగర్‌ ప్రాంతాల్లో చోరీ చేసినట్లు ఆమె అంగీకరించగా సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు  డేవిడ్‌రాజు తెలిపారు. ఈ సమావేశంలో ఎస్సైలు హరికృష్ణ, రవీందర్, సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు