సుపారీ గ్యాంగ్‌ అరెస్ట్‌

17 Aug, 2019 08:30 IST|Sakshi
 ధర్మవరం రూరల్‌ పోలీసులకు పట్టుబడిన నిందితులు

నలుగురి హత్య కుట్రలు భగ్నం 

సబ్‌జైలులోనే పథక రచన  

మారణాయుధాలు, వాహనం స్వాధీనం

సాక్షి, అనంతపురం: డబ్బు కోసం పీకలు కోసే సుపారీ గ్యాంగ్‌ను జిల్లా పోలీసులు అరెస్ట్‌ చేశారు. టెక్నాలజీ ఆధారంగా పాత నేరస్తులపై నిఘా ఉంచడంతో నలుగురు వ్యక్తులు హత్యలకు గురికాకుండా కాపాడగలిగారు. జిల్లాలో నాలుగు వేర్వేరు హత్యలకు పన్నిన కుట్రలను ధర్మవరం రూరల్, తాడిపత్రి రూరల్, కళ్యాణదుర్గం పోలీసులు భగ్నం చేశారు. మొత్తం తొమ్మిది మంది నిందితలను అరెస్ట్‌ చేసి మారణాయుధాలు స్వాధీనం చేసుకున్నారు. మరికొంతమంది నిందితులు పరారీలో ఉన్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఎస్పీ బూసారపు సత్యయేసుబాబు శుక్రవారం పోలీసు కాన్ఫరెన్స్‌హాల్లో మీడియాకు వెల్లడించారు.

బత్తలపల్లిలో ఇద్దరి హత్యలకు కుట్ర 
బత్తలపల్లిలో ఇద్దరి హత్యలకు పన్నిన కుట్రను పోలీసులు భగ్నం చేశారు. ధర్మవరం డీఎస్పీ రమాకాంత్‌ ఆధ్వర్యంలో రూరల్‌ సీఐ చిన్న పెద్దయ్య, బత్తలపల్లి ఎస్‌ఐ రామకృష్ణారెడ్డి, సిబ్బంది బృందంగా ఏర్పడి పక్కా సమాచారంతో బత్తలపల్లి – ధర్మవరం రహదారిలో వేల్పుమడుగు క్రాస్‌ వద్ద ఏడుగురు నిందితులను అరెస్ట్‌ చేశారు. అరెస్టయిన వారిలో బత్తపల్లి మండలం గంటాపురానికి చెందిన బోయపాటి ఈశ్వరయ్య, పావగడ తాలూకా కనికెలబండ గ్రామానికి చెందిన వెంకటేష్, కంబదూరు మండలం రాళ్లపల్లికి చెందిన గంగాధర్, బత్తలపల్లి మండలం గంటాపురం గ్రామానికి చెందిన అక్కిం లక్ష్మినారాయణ, పోట్లమర్రికి చెందిన బొత్తల నాగార్జున, గంటాపురానికి చెందిన అంబక్‌పల్లి శివశంకర్, మాతంగి వెంకటనారాయణ, ఎర్రాయపల్లికి చెందిన గొట్టి రమణ ఉన్నారు. వీరి నుంచి నాలుగు వేటకొడవళ్లు, 8 డిటోనేటర్లు, 8 జెలిటెన్‌ స్టిక్స్, 200 గ్రాముల నాటు బాంబుబల తయారీ పౌడర్, మూడు ఐరన్‌ పైపులు, ఒక మారుతీ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ కుట్రలో మరో నిందితుడైన గంగాధర్‌ తాడిపత్రి రూరల్‌పోలీసులకు చిక్కాడు.

ఆధిపత్య పోరుతోనే.. 
అరెస్టయిన బోయపాటి ఈశ్వరయ్యకు బత్తలపల్లికి చెందిన ఓ వ్యక్తితో కొంతకాలంగా విభేదాలు ఏర్పడ్డాయి. గ్రామంలో ఆధిపత్య పోరు, రానున్న ఎన్నికల్లో సదరు వ్యక్తి ఉంటే ఇబ్బందులు తప్పవని భావించిన నిందితుడు హత్యకు కుట్ర పన్నాడు. దీంతో పాటు కోర్టు విచారణలో ఉన్న ఓ కేసు విషయంలో తనకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాడనే నెపంతో ఎలాగైనా కడతేర్చాలని పథక రచన చేశాడు. తన పొలం పనులు చూసుకునే చలపతి అనే వ్యక్తితో చర్చించి కిరాయి హంతకులను కూడగట్టాలని సూచించాడు. ఓ హత్యకేసులో నిందితులైన లక్ష్మినారాయణ, అంబక్‌పల్లి శివశంకర్, బొత్తల నాగార్జునలను చలపతి సంప్రదించి విషయాన్ని తెలియజేశాడు. నాగార్జున ద్వారా గొట్టి రమణ, ఈయన ద్వారా నాటు బాంబుల తయారీలో సిద్ధహస్తుడైన వెంకటేష్, గంగాధర్‌లను ఆశ్రయించాడు. తనకు అడ్డు తగులుతున్న వ్యక్తిని అంతమొందించేందు కోసం బోయపాటి ఈశ్వరయ్య రూ. 4 లక్షలు అందజేశాడు. దీంతో హత్యకు అవసరమైన వేటకొడవళ్లు, మందుగుండు సామగ్రి సిద్ధం చేసుకుని కుట్ర పన్నుతుండగా పోలీసులకు పట్టుబడ్డారు. వీరిని విచారించగా దీంతోపాటు మరోరెండు వేర్వేరు హత్యలకు కుట్ర  పన్నినట్లు వెల్లడైంది.

మనస్పర్ధలతో మరొకటి.. 
పరారీలో ఉన్న నిందితుడు సుబ్బరాయుడికి బత్తలపల్లి మండలానికి చెందిన మరో వ్యక్తితో కొంతకాలంగా మనస్పర్ధలున్నాయి. ఇద్దరూ సమీప బంధువులే అయినప్పటికీ మండలస్థాయి పదవి విషయంలో ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి. తన పదవి పోయేందుకు ఆ వ్యక్తే కారణమని భావించిన సుబ్బరాయుడు అతన్ని చంపాలని భావించాడు. గొట్టి రమణను ఆశ్రయించి రూ.20 లక్షలు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. సుబ్బరాయుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.

హత్యకుట్ర భగ్నం 
తాడిపత్రి మండలానికి చెందిన ఓ గ్రామస్థాయి నాయకుడిని హతమార్చేందుకు జరిపిన కుట్రను పోలీసులు భగ్నం చేశారు. వీరాపురానికి చెందిన లక్ష్మినారాయణ, కంబదూరు మండలం రాల్లపల్లికి చెందిన గంగాధర్‌లను శుక్రవారం అరెస్ట్‌ చేశారు.  తాడిపత్రి డీఎస్పీ శ్రీనివాసులు పర్యవేక్షణలో రూరల్‌ సీఐ వెంకటేశ్వర్లు, ఎస్‌ఐ రాజశేఖర రెడ్డి, సిబ్బంది బృందంగా ఏర్పడి పక్కా సమాచారంతో మరువ వంక వద్ద వీరిని అదుపులోకి తీసుకుని, వీరి నుంచి రెండు వేట కొడవళ్లు, ఏడు డిటోనేటర్లు, ఏడు జిలిటెన్‌ స్టిక్స్, 200 గ్రాముల బాంబుల తయారీ పొడిని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో వీరాపురం గ్రామానికి చెందిన రంగనాథరెడ్డి, వెంకటనారాయణ, పావగడకు చెందిన వెంకటేశ్‌లు పరారీలో ఉన్నారు. వీరి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

ప్రస్తుతం అరెస్ట్‌ అయిన ఇద్దరు, పరారీలో ఉన్న ముగ్గురు కలిసి  పథకం వేశారు. జిల్లా జైలులో ఉన్నప్పుడు ఈ ఐదుగురు కలిసి కుట్రకు వ్యూహరచన చేశారు. ఈ ఏడాది ఏప్రిల్‌ 11న జరిగిన వీరాపురం చింతా భాస్కర్‌రెడ్డి హత్య కేసులో లక్ష్మినారాయణ, రంగనాథరెడ్డి, వెంకటనారాయణలు, కంబదూరు పోలీసు స్టేషన్‌ పరిధిలో  జరిగిన పేలుళ్ల కేసులో గంగాధర్, వెంకటేష్‌లు జిల్లా జైలులో ఉండేవారు. తమకు ఓ వ్యక్తి టార్గెట్‌గా ఉన్నాడని, అతనని హతమార్చేందుకు సహకరించాలని వీరాపురానికి చెందిన ముగ్గురు నిందితులు గంగాధర్, వెంకటేష్‌ అడిగారు. ఇందుకు సహకరిస్తే ఆర్థికంగా సహాయపడతామని చెప్పడంతో సరేనని అంగీకరించారు. మందుగుండు సామగ్రి, పేలుడు పదార్థాలు వినియోగించి చంపడంలో తమకు అనుభవముందని, గతంలో కంబదూరు పోలీసు స్టేషన్‌ పరిధిలో వారు పాల్పడిన పేలుళ్ల హత్యోదంతాన్ని గుర్తు చేశారు.

హత్య కుట్రకు అక్కేడే వ్యూవహరచన చేశారు. ఇటీవలే వీరాంతా రెండు వేర్వేరు సందర్భాల్లో బెయిల్‌పై జైలు నుంచి బయటికి వచ్చారు. వీరంతా కలసి శుక్రవారం ఆ వ్యక్తిని చంపాలని సిద్ధమయ్యారు. తాను బత్తలపల్లి హత్యల్లో పాల్గొంటానని వెంకటేష్‌ చెప్పగా, మందుగుండు సామగ్రి, మారణాయుధాలతో లక్ష్మినారాయణ, గంగాధర్‌లు ఆ వ్యక్తిని చంపాలని బయలుదేరి పోలీసులకు చిక్కాడు. మిగతా ఇద్దరు ఈ విషయం తెలుసుకుని పరారీలో ఉన్నట్లు ఎస్పీ వివరించారు. నాలుగు వేర్వేరు హత్య కుట్రలను భగ్నం చేసిన తాడిపత్రిరూరల్, ధర్మవరం రూరల్, కళ్యాణదుర్గం పోలీసులను ఎస్పీ భూసారపు సత్యయేసుబాబు అభినందించారు.

ఆర్వోసీ మాజీ నేత హత్యకు కుట్ర  
కంబదూరు మండలం రాళ్లపల్లికి చెందిన ఆర్వోసీ మాజీ నాయకుడు రామకృష్ణను చంపాలని కె.బి.వెంకటేష్, ఇ.గంగాధర్‌లు పథకం పన్నారు. ఈ ఇద్దరూ కలిసి ఈ ఏడాది ఫిబ్రవరి 10న రాళ్ళపల్లి దుర్గప్పను మందుపాతర పేల్చి కడతేర్చారు. హతుడి సోదరుడైన రామకృష్ణ నుంచి ప్రతీకారచర్య ఉంటుందని నిందితులు భావించారు. దుర్గప్ప హత్యకేసులో జైలు నుంచి బయటకొచ్చాక కచ్చితంగా చంపుతాడని, అంతకన్నా ముందుగానే రామకృష్ణను తామే చంపితే ఇబ్బందులుండబోవని భావించారు. దీంతో జైలులోనే పథక రచన చేసినట్లు నిందితులు విచారణలో అంగీకరించారు.

మరిన్ని వార్తలు