వ్యభిచార గృహంపై పోలీసుల దాడి

14 Feb, 2020 08:36 IST|Sakshi

ముగ్గురు బంగ్లాదేశ్‌ యువతులకు విముక్తి

ఘట్‌కేసర్‌: గుట్టుచప్పుడు కాకుండా ఓ అద్దె ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్న విషయం తెలుసుకుని పోలీసులు దాడులు నిర్వహించి ముగ్గురు బంగ్లాదేశ్‌ యువతులకు విముక్తి కలిగించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఘట్‌కేసర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని చౌదరిగూడలోని సాయినగర్‌కాలనీలో సురేందర్‌ మూర్తి, రాజేశ్వరి దంపతులు గత కొన్ని రోజులుగా గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్నారని గురువారం మధ్యాహ్నం పోలీసులకు సమాచారం అందింది. మల్కాజిగిరి ఏసీపీ నర్సింహారెడ్డి ఘట్‌కేసర్‌ పోలీస్‌ సిబ్బందితో కలిసి ఇంటి పరిసరాలను పరిశీలించారు. ఘట్‌కేసర్‌ పోలీస్‌స్టేషన్‌కు చెందిన ఓ కానిస్టేబుల్‌ విటుడిగా పరిచయం చేసుకుని ఇంట్లోకి ప్రవేశించడంతో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు తెలిసింది.

అతని సమాచారం మేరకు పోలీసులు వ్యభిచార గృహంపై దాడి చేసి వ్యభిచారం నిర్వహిస్తున్న సురేందర్‌ మూర్తి(37), రాజేశ్వరి(34) దంపతులను, బంగ్లాదేశ్‌కు చెందిన ముగ్గురు యువతులను అదుపులోకి తీసుకున్నారు. సురేందర్‌ మూర్తి, రాజేశ్వరి దంపతులను విచారించగా బంగ్లాదేశ్‌కు చెందిన అభిజిత్,ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మహేశ్‌లకు వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దాడుల్లో భాగంగా ఒక సెల్‌ఫోన్, రూ.5100 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు పోలీసులు  కేసు నమోదు చేశారు. అభిజిత్, మహేశ్‌లను అదుపులోకి తీసుకుంటామని పోలీసులు తెలిపారు. దంపతులతో పాటు బంగ్లాదేశ్‌కు చెందిన ముగ్గురు యువతులను స్టేషన్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. కేసు దర్యాప్తులో ఉందని తెలిపారు.

మరిన్ని వార్తలు