బుర్ఖా ధరించి పెట్రోల్‌, పుర్రెలతో యువతి ఇంట్లోకి

28 Feb, 2020 20:08 IST|Sakshi
సంఘటన స్థలంలో స్వాధీనం చేసుకున్న పుర్రె, వస్తువులు

సాక్షి, కడప అర్బన్‌: కడపలో సంచలనం రేకెత్తించిన యువతి కిడ్నాప్‌ కేసు పోలీసులు కొద్ది గంటల్లోనే ఛేదించారు. నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. డీఎస్పీ సూర్యనారాయణ గురువారం విలేకరులకు తెలిపిన వివరాలివి. కడపలోని వైవీ స్ట్రీట్‌కు చెందిన యువతి (21) బీటెక్‌ వరకు చదివింది. గత ఏడాది జావా కోర్సు కోసం బెంగళూరు వెళ్లింది. అదే సమయంలో రంగుల కృష్ణమోహన్‌ అనే యువకుడు బెంగళూరు వెళ్లి ఈ యువతిని ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకోవాలని వేధించేవాడు. ఈ విషయాన్ని ఆమె తన తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు ఆమెను కడపకు తీసుకు వచ్చారు.

ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం యువతి ఒంటరిగా ఉండటం కృష్ణమోహన్‌ గమనించాడు. బురఖాలో ఇంటికి వెళ్లి యువతికి కూడా బలవంతంగా బురఖా ధరింపచేసి కిడ్నాప్‌కు పాల్పడ్డాడు. ఇంటి సమీపంలోని వారు అనుమానించి యువతి తండ్రికి ఫోన్‌ చేశారు. వెంటనే ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడు ఇంజినీరింగ్‌ కళాశాలలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేసేవాడు. ప్రస్తుతం పక్కీర్‌పల్లి వార్డు సచివాలయ సెక్రటరీగా పనిచేస్తున్నాడు.  చదవండి: భార్య కొత్త వ్యక్తులతో ఫోన్లో మాట్లాడుతుందని..

నిందితుడి  వివరాలను తెలుపుతున్న కడప డీఎస్పీ సూర్యనారాయణ  

పక్కా ప్రణాలిక 
పక్కా ప్రణాళికతో నిందితుడు కిడ్నాప్‌కు పాల్పడినట్లు డీఎస్పీ తెలిపారు. బుధవారం రాత్రి రెండు లీటర్ల బాటిళ్లతో పెట్రోల్‌, పుర్రె, ఎముకలను యువతి ఇంటికి తీసుకెళ్లాడు. తర్వాత గ్యాస్‌ లీక్‌ చేశాడు. కొవ్వొత్తిని వెలిగించి గ్యాస్‌ స్టౌ పక్కనే ఉంచి అమ్మాయి దుస్తులపైకూడా పెట్రోల్‌ చల్లాడు. కొవ్వొత్తి చివరివరకు వెలుగుతూ పెట్రోల్, గ్యాస్‌ ద్వారా మంటలు చెలరేగి అగ్ని ప్రమాదం జరిగినట్లు భావించేలా స్కెచ్‌ వేశాడు. ప్రమాదంలో యువతి మరణించినట్లు ఉండాలని పుర్రె, ఎముకలను ఉంచాడు. సమీపంలో యువతి దుస్తులు కూడా ఉంచాడు. తర్వాత ఆ యువతిని బలవంతంగా తీసుకుని వెళ్లిపోయాడు.

ఇల్లు అంటుకుని యువతి మరణించినట్లు ప్రజలు భావిస్తారని ఇలాంటి కుట్రకు పాల్పడినట్లు పోలీసులు తమ విచారణలో గుర్తించారు. పోలీసులు సకాలంలో ఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేపట్టడంతో పెద్ద ప్రమాదం తప్పింది. లేకుంటే ఆ ఇల్లే కాకుండా సమీప ఇళ్లలో ఆస్తి, ప్రాణ నష్టం జరిగేది. సాంకేతిక అంశాల ఆధారంగా వేలూరు రైల్వేస్టేషన్‌లో గురువారం ఉదయం 11:30 గంటలకు గుర్తించి కృష్ణమోహన్, యువతిలను కడపకు తరలించారు. కృష్ణమోహన్‌ను అరెస్ట్‌ చేశారు. యువతిని తల్లిదండ్రులకు అప్పగించారు.  చదవండి:  అత్యాచారం: రూ 1.3 కోట్లు డిమాండ్‌

కిడ్నాపర్‌ బారి నుండి సురక్షితంగా కాపాడిన పోలీసు అధికారులు, సిబ్బందిని  డీఎస్పీ అభినందించారు. సీఐలు సత్యనారాయణ, అశోక్‌రెడ్డి,  ఎం. నాగభూషణం, హెడ్‌కానిస్టేబుల్‌ ప్రసాద్, కానిస్టేబుళ్లు రాయుడు, జనార్ధన్‌రెడ్డి, సాయి, గురవయ్యలకు బహుమతులను అందజేశారు. కీలక సమాచారం అందించిన హసన్‌సాహేబ్‌ అనే స్థానికుడిని కూడా డీఎస్పీ ప్రత్యేకంగా బహుమతిని అందజేసి అభినందించారు.   

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా