కాబోయే భర్తకు ఫోన్‌ చేశాడని ప్రియుడినే..!

29 Feb, 2020 19:44 IST|Sakshi

సాక్షి, కడప: తాను పెళ్లి చోసుకోబోయే యువకుడికి ఫోన్‌ చేసి తన గురించి చెడ్డగా చెప్పి తన పెళ్లి చెడగొడుతున్నాడనే కారణంగా సాలా శ్రీనివాసులు అనే వ్యక్తిని ఓ నర్సు హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. కడప నగరం చిన్నచౌకు పోలీసుస్టేషన్‌ పరిధిలో అప్సర సర్కిల్‌ సమీపంలో ఉన్న ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో ల్యాబ్‌ టెక్నిషియన్‌గా పనిచేస్తున్న సాలా శ్రీనివాసులు అనే వ్యక్తి  గత నెల 25న హత్యకు గురైన విషయం విదితమే. మృతుని భార్య సుమతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు హత్య కేసుగా నమోదు చేశారు. ఈ సంఘటనలో నిందితురాలిని పోలీసులు అరెస్టు చేశారు. శనివారం సాయంత్రం చిన్నచౌకు పోలీసుస్టేషన్‌ ఆవరణంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో చిన్నచౌకు సీఐ కె.అశోక్‌రెడ్డి వివరాలను వెల్లడించారు. చదవండి: 'నేను ఏ తప్పు చేయలేదు' 

2014లో నారిపోగు సృజన అలియాస్‌ సృజన వాహని, హతుడు శ్రీనివాసులు కడపలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పనిచేసేవారు. ఆ సమయంలో పరస్పరం ప్రేమించుకున్నారు. ఈ సమయంలో వారిమధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. ఆ తర్వాత శ్రీనివాసులు సృజనను అనుమానంతో వేధిస్తుండడంతో ఆమె అక్కడ ఉద్యోగం మానేసి హైదరాబాదుకు వెళ్లి అక్కడి ఓ ప్రైవేటు నర్సింగ్‌ హోంలో నర్సుగా పనిచేస్తూ ఉండింది. ఈ నేపథ్యంలో గత ఏడాది అక్టోబరు 27న తిరిగి కడపలోని అదే ప్రైవేటు ఆస్పత్రిలో నర్సుగా చేరింది. అక్కడ ల్యాబ్‌ టెక్నిషియన్‌గా పనిచేస్తున్న శ్రీనివాసులుతో తిరిగి వివాహేతర సంబంధం కొనసాగించింది. అయితే శ్రీనివాసులు అప్పటికే సుమతి అనే మహిళను వివాహం చేసుకుని సంతానం కలిగి ఉన్నాడని తెలుసుకున్న సృజన అతనికి దూరంగా ఉంటూ వచ్చింది. ఈ పరిస్థితిలో సృజనకు రాజేష్‌ అనే యువకుడితో పెళ్లి చేయాలని ఆమె తల్లిదండ్రులు నిర్ణయించారు. ఈ విషయమై సృజన, శ్రీనివాసులు మధ్య గొడవ జరిగింది. చదవండి: నటి 'శ్రుతి' లీలలు మామూలుగా లేవుగా..!

రాజేష్‌ను పెళ్లి చేసుకోవద్దని ఆమెపై ఒత్తిడి తీసుకురాగా, అందుకు ఆమె అంగీకరించలేదు. దీంతో సృజన దగ్గరి నుంచి  రాజేష్‌కు సంబంధించిన ఫోన్‌ నంబరును హతుడు తీసుకుని అతనికి ఫోన్‌ చేసి బెదిరించినట్లు విచారణలో తెలిసింది. శ్రీనివాసులు తనకు ఎప్పటికైనా అడ్డుగా ఉంటాడని భావించి అతన్ని అంతమొందించాలని భావించింది. అదను కోసం వేచి ఉండగా గత నెల 24వ తేదీ రాత్రి శ్రీనివాసులు డ్యూటీకి వచ్చి సృజనతోపాటు విధులు నిర్వర్తించాడు. 25వ తేదీ తెల్లవారుజామున 2 గంటల సమయంలో నర్సులు విశ్రాంతి తీసుకునే గదిలో వీరిద్దరూ గొడవ పడ్డారు. శ్రీనివాసులు కోపంగా గదిలో ఉన్న చీరతో ఉరి వేసుకుని చనిపోతానని బెదిరించాడు. అప్పటికే శ్రీనివాసులును చంపాలనే ఉద్దేశంతో ఉన్న సృజన ఆలస్యం చేయకుండా అతని మెడకు చీరను బిగించి చంపేసింది.

ఆ తర్వాత ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. అన్ని కోణాల్లో దర్యాప్తు చేసిన పోలీసులు నిందితురాలిని గుర్తించి అరెస్టు చేశారు. అయితే ఈ సంఘటన జరిగే సమయంలో ఆసుపత్రిలోని సీసీ కెమెరాలను ఆఫ్‌ చేసి ఉండటంతో ఈ హత్య చేసేందుకు నిందితురాలికి ఇంకా ఎవరైనా సహకరించారా అనే విషయంపై కూడా ఆరా తీస్తున్నామని సీఐ వెల్లడించారు. ఈ కేసును ఛేదించిన ఎస్‌ఐలు ఎస్‌కే రోషన్, ఎం.సత్యనారాయణ, హెడ్‌ కానిస్టేబుల్‌ జె.రామసుబ్బారెడ్డి, కానిస్టేబుళ్లు సి.సుధాకర్‌ యాదవ్, ఎ.శివప్రసాద్, వి.చెండ్రాయులను సీఐ అశోక్‌రెడ్డి, డీఎస్పీ సూర్యనారాయణ అభినందించారు. 

మరిన్ని వార్తలు