మీటూ : నటుడిపై లైంగిక వేధింపుల కేసు

15 Jun, 2019 09:10 IST|Sakshi
నటుడు, దళిత కార్యకర్త వినాయగన్‌ ( ఫైల్‌ ఫోటో)

సాక్షి, వాయనాడ్‌:  మలయాళ నటుడు, దళిత కార్యకర్త వినాయగన్‌పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. సామాజిక కార్యకర్త మృదులాదేవి శశిధరన్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వాయనాడ్‌ జిల్లాలోని కాల్‌పెట్టా పోలీస్‌ స్టేషన్‌  అధికారులు శుక్రవారం కేసు నమోదు చేశారు. ఈ వేధింపులకు సంబంధించిన ఆడియో రికార్డును ఆమె పోలీసులకు అందించారు. వినాయగన్‌పై మీటూ ఆరోపణలు కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.

నటుడు వినాయకన్‌ తనను వేధించాడంటూ కేరకు చెందిన సోషల్‌ యాక్టవిస్ట్‌ మృదులాదేవి మొదట ఫేస్‌బుక్‌లో ఒక పోస్ట్‌ పెట్టారు. గతంలో మహిళా నటిని వేధింపులకు గురి చేసిన సంఘటనలో తీవ్రంగా స్పందించి, ఉద్యమానికి మద్దతు తెలిపిన వినాయగన్‌, తన వరకూ వచ్చేసరికి మాత్రం ఇందుకు భిన్నంగా, మృగాళ్లకు ఏమాత్రం తీసిపోకుండా  ప్రవర్తించారని  ఆమె మండిపడ్డారు. తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. అందుకే ఆయనంటే గౌరవం పోయిందన్నారు. ఒక కార్యక్రమం నిమిత్తం వినాయగన్‌ను ఆహ్వానించేందుకు కాల్‌ చేసినపుడు ఫోన్‌లో తనతో అమర్యాదకరంగా చాలా అసభ్యంగా, మాట్లాడారని ఆమె రాసుకొచ్చారు. తన లైంగిక వాంఛ తీర్చాల్సిందిగా కోరడంతో పాటు, తన తల్లి కూడా తన కోరిక తీర్చాలన్నాడని ఆరోపించారు. దీనికి సంబంధించిన ఫోన్‌ రికార్డింగ్‌ కూడా తన దగ్గర వుందని మృదులాదేవి చెప్పారు. అయితే అబద్ధం చెబుతోందని కొంతమంది నెటిజనులు సోషల్‌ మీడియాలో వాదనకు దిగడంతో ఆమె చివరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మరోవైపు  కుల, మతపరమైన వివక్ష, దాడులకు తాను వ్యతిరేకమని చెప్పుకున్న మృదులా దేవి  మహిళా నటికి మద్దతుగా నిలవడంతో వినాయగన్‌ వ్యక్తిత్వం తనకు ప్రేరణ నిచ్చిందని పేర్కొన్నారు.  అలాగే బీజేపీకి వ్యతిరేకంగా ఆయన చేసిన ప్రకటనపై సోషల్ మీడియాలో దుమారం, ఆయనపై జరుగుతున్న కులపరమైన దాడిని తాను వ్యతిరేకించానని చెప్పారు. కాగా విశాల్, శ్రేయా జంటగా నటించిన పొగరు సినిమాలో విలన్ పాత్రలో కనిపించిన నటుడే వినాయగన్.

మరిన్ని వార్తలు