మాజీ మంత్రి శ్రీధర్‌బాబుపై కేసు

22 Oct, 2017 10:40 IST|Sakshi

నా ఇంట్లో గంజాయి పెట్టించి కేసులో ఇరికించజూశారు: ముత్తారం టీఆర్‌ఎస్‌ అధ్యక్షుని ఫిర్యాదు

సాక్ష్యంగా శ్రీధర్‌బాబు ‘వాయిస్‌’ రికార్డు

అదుపులో మాజీ సర్పంచ్‌ 

పది కిలోల గంజాయి స్వాధీనం  

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌/హైదరాబాద్‌: మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుపై హైదరాబాద్‌లోని చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్‌లో మాదక ద్రవ్యాల నిరోధక చట్టం(ఎన్‌డీపీఎస్‌) కింద కేసు నమోదైంది. పెద్దపల్లి జిల్లా ముత్తారం మండల టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు శ్రీధర్‌బాబుతోపాటు ఓడేడ్‌ మాజీ సర్పంచ్‌ సుదర్శన్‌గౌడ్, ఇల్లందుల భార్గవ్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు ఆదివారం వెల్లడించారు. వినాయకచవితి సమయంలో మాదక ద్రవ్యాల నిరోధక చట్టం కింద తనపై కేసు నమోదు చేయించేలా కుట్ర పన్నారని, ఇందుకు భార్గవ్‌ ద్వారా తన ఇంట్లో గంజాయి పెట్టించారని కిషన్‌రెడ్డి తన ఫిర్యాదులో ఆరోపించారు. ఎఫ్‌ఐఆర్‌లో సుదర్శన్‌ను ఏ–1గా, శ్రీధర్‌బాబును ఏ–2గా, భార్గవ్‌ను ఏ–3గా చేర్చినట్లు పోలీసులు తెలిపారు. టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు సుదర్శన్, భార్గవ్‌ను ఇప్పటికే అదుపులోకి తీసుకొని, 10 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. 

భూవివాదాలే కారణమా? 
పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గంలో భూవివాదాలే ‘గంజాయి కుట్ర’కేసు పర్యవసానమన్న చర్చ జరుగుతోంది. పోలీసులు, రాజకీయ వర్గాల సమాచారం మేరకు కేసు వివరాలివీ.. ఓడేడ్‌లో మానేరు ఒడ్డున ఉన్న భూమి కొనుగోలు విషయంలో తలెత్తిన వివాదం నేతల మెడకు చుట్టుకుంది. గ్రామ అవసరాల కోసం కొనుగోలు చేసిన భూమికి ఎవరూ డబ్బులు చెల్లించుకుంటే.. మాజీ సర్పంచ్‌ సుదర్శన్‌ తానే డబ్బును చెల్లించి ఆ భూమిని తన పేరిట రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. ఇది గిట్టని కిషన్‌రెడ్డి.. సుదర్శన్‌ను నిలదీయడంతోపాటు ఎమ్మెల్యే పుట్ట మధు దృష్టికి తీసుకెళ్లారు. ఆయన గ్రామాభివృద్ధి కోసం కొనుగోలు చేసిన భూమిని గ్రామానికే కేటాయించాలని సుదర్శన్‌కు సూచించారు. అందుకు సుదర్శన్‌ నిరాకరించారు. దీంతో కిషన్‌రెడ్డి, సుదర్శన్‌ మధ్య విభేదాలు మరింత పెరిగాయి. ఒకరిపై మరొకరు కక్షగట్టి కేసుల్లో ఇరికించుకునే వ్యూహం పన్నారు. అందులో భాగంగానే ఓడేడ్‌కు చెందిన భార్గవ్‌ను పావుగా వాడుకున్నట్లు సమాచారం.

సుదర్శన్‌గౌడ్‌... భార్గవ్‌ ద్వారా కిషన్‌రెడ్డికి చెందిన పశువుల కొట్టంలో గంజాయి పెట్టించినట్లు సమాచారం. భార్గవ్‌ కోవర్ట్‌గా మారి ఈ విషయాన్ని కిషన్‌రెడ్డికి చెప్పి ఆయనకు దగ్గరయ్యాడు. దీంతో భార్గవ్‌ ద్వారా కిషన్‌రెడ్డి అసలు విషయాలు రాబట్టారు. సుదర్శన్‌కు నమ్మకంగా ఉంటూనే ఆయన ఫోన్‌లో మాట్లాడిన వాయిస్‌ రికార్డులన్నీ భార్గవ్‌ తన మొబైల్‌లోకి డౌన్‌లోడ్‌ చేసుకుని కిషన్‌రెడ్డికి చేరవేశాడు. తనను కేసులో ఇరికించేందుకు సుదర్శన్‌గౌడ్‌.. మాజీ మంత్రి శ్రీధర్‌బాబుతో కూడా మాట్లాడినట్టు కిషన్‌రెడ్డి గుర్తించారు. వాయిస్‌ రికార్డు కూడా ఉండటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంథనికి చెందిన అధికార పార్టీ నేత ప్రభుత్వ స్థాయిలో చర్చించిన తర్వాతే ఆడియో రికార్డుల ఆధారాలతో చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్‌లో శ్రీధర్‌బాబు, తదితరులపై కిషన్‌రెడ్డి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. వాయిస్‌ శ్రీధర్‌బాబుదేనా కాదా అన్న అంశాన్ని నిర్ధారించుకునేందుకు ఆడియో టేపులను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపనున్నారు. 

సుదర్శన్‌గౌడ్‌, శ్రీధర్‌బాబు మధ్య జరిగిన ఆడియో సంభాషణ ఇలా సాగింది..
సుదర్శన్‌ గౌడ్‌: నమస్తే సార్‌.. నేను ఓడేడు మాజీ సర్పంచ్‌ సుదర్శన్‌ గౌడ్‌ మాట్లాడుతున్నా..
శ్రీధర్‌బాబు: ఆ.. చెప్పు సుదర్శన్‌..
సుదర్శన్‌గౌడ్‌: కిషన్‌రెడ్డిని గంజాయి విషయంలో దొరకబట్టుదామని ప్లాన్‌ చేస్తున్నా..
శ్రీధర్‌బాబు: ఓకే..
సుదర్శన్‌గౌడ్‌: ఆ విషయంలో దుగ్గల్‌కు ప్లాన్‌ చెప్తే.. అక్కడకిపోయి వేరేవాళ్లతో పెట్టిస్తా..
శ్రీధర్‌ బాబు: ఎప్పుడు పెడతవో చెప్పు.. దుగ్గల్‌కు చెప్పినా లాభం ఉండదు. హైదరాబాద్‌లో చెప్పిస్తా.. ఒకరోజు ముందు చెప్పు..
సుదర్శన్‌గౌడ్‌: ఈరోజు సాయంత్రం పెట్టిస్తా..
శ్రీధర్‌ బాబు: ఈ రోజు సాయంత్రం పెట్టిస్తావా.. ఓకే
సుదర్శన్‌గౌడ్‌: ఒక పదికిలోలు తెప్పియ్యాల్నా సార్..
శ్రీధర్‌ బాబు: హా..
సుదర్శన్‌గౌడ్‌: నా ఫోన్‌ కాంటాక్ట్‌లో ఉండండి
శ్రీధర్‌ బాబు: ఏ టైమ్‌లో చేస్తావు అందాదా..
సుదర్శన్‌గౌడ్‌: ఈరోజు వినాయకచవితి కదా.. వాళ్ల కొట్టంలో పెట్టిస్తా
శ్రీధర్‌ బాబు: వాడి ఇంట్లో పెట్టిస్తావా.. లేక భూమిలోనా..
సుదర్శన్‌గౌడ్‌: వాడి ఇంట్లో కొట్టం ఉంటుంది.. కొట్టంలో పెట్టిస్తా.. సార్‌ నాకు కొంచెం.. కొంచెం..
శ్రీధర్‌బాబు: ఆ ఓకే అమ్మా.. ఓకే.. అని పెట్టేశారు. అయితే, ఈ ఆడియోటేపుల్లో ఉన్నది శ్రీధర్‌బాబు గొంతేనా అన్నది నిర్ధారించాల్సి ఉంది.

ఆడియో టేపు సంభాషణలో ఏం మాట్లాడారో వినండి 

మరిన్ని వార్తలు