మీ త్యాగం చెదరని జ్ఞాపకం

22 Oct, 2018 13:07 IST|Sakshi
పుష్పగుచ్ఛం సమర్పించి శ్రద్ధాంజలి ఘటిస్తున్న ఎస్పీ రెమా రాజేశ్వరి

మహబూబ్‌నగర్‌ క్రైం : విధి నిర్వహణలో వీర మరణం పొందిన అమరుల త్యాగం చెదరని జ్ఞాపకం లాంటిదని ఎస్పీ రెమా రాజేశ్వరి అన్నారు. ఆదివారం పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని పరేడ్‌ మైదానంలో విధి నిర్వహణలో చనిపోయిన వారి కుటుంబసభ్యులు స్థూపం వద్ద కన్నీటి పర్యంతమయ్యారు. వారిని ఎస్పీ రెమా రాజేశ్వరి ఒదార్చారు. సంఘ విద్రోహక శక్తులతో పోరాడి ప్రాణాలు వదిలిన పోలీసులకు ఘనంగా నివాళులు అర్పించారు. అమరుల కీర్తి.. పోరాట పటిమ తమకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు. అనంతరం అదనపు ఎస్పీ వెంకటేశ్వర్లు, డీఎస్పీలు భాస్కర్, గిరిబాబు, సీఐలు రామకృష్ణ, రాజేష్, కిషన్, రాజు, అమరవీరుల కుటుంబ సభ్యులు ఒక్కొక్కరుగా అమరులకు పూలమాలలతో వందనం సమర్పించారు.

పోలీసుల సంక్షేమానికి కృషి  
సమస్యలను, సవాళ్లను ఎదుర్కోవడం పోలీస్‌ వృత్తిలో సహజమైన అంశంగా భావించి ప్రతి అధికారి ముందుకుసాగాలని ఎస్పీ రెమా రాజేశ్వరి అన్నారు. ప్రజల సంరక్షణ కోసం నిత్యం పోలీసింగ్‌ వ్యవస్థలో దేశవ్యాప్తంగా ఎక్కడో ఒక చోట పోలీస్‌ అధికారి ప్రాణాలు త్యాగం చేస్తున్నాడని, కాశ్మీర్‌ నుంచి కన్యకుమారి వరకు శాంతి భద్రతలను రక్షించే క్రమంలో ఈ ఏడాది 414 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారని గుర్తుచేశారు. అందరు ప్రశాంతమైన వాతావరణంలో ఉండటానికి అమరవీరులు చేసిన త్యాగమని కొనియాడారు.

రెండు దశాబ్దాల కిందట నల్లమల అటవీ ప్రాంత పరిసరాల్లో మావోయిస్టులు జరిపిన విధ్వంసం అంతా ఇంతా కాదన్నారు. ఎందరో అమాయక ప్రజల ప్రాణాలు పోయాయని,  సమాజంలో శాంతియుత వాతావరణ నిర్మాణం కోసం  పోలీసు బలగాలు, దేశ రక్షణ కోసం పొరాటం చేసే సైనికులు 39మంది చనిపోయారని  గుర్తు చేశారు. పోలీసులు చేస్తున్న సేవలను, త్యాగాలను ప్రజలు గుర్తు పెట్టుకోవాలని కోరారు. పోలీసులకు ప్రజల సహకారం ఉంటే శాంతిభద్రతల రక్షణ సులువవుతుందని,   ఎక్కవ జనాభా ఉన్న ఈ సమాజంలో సుమారు లక్ష మందికి ఒక పోలీస్‌ అధికారి అందుబాటులో ఉండి సేవ చేస్తున్నట్లు తెలిపారు. 

గౌరవప్రదంగా కవాతు 
పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం ఉదయం ఎస్పీ కార్యాలయం ఆవరణలో నిర్వహించిన కవాతు ఆకట్టుకుంది. సాయుధ బలగాలు సంప్రదాయ పూర్వకంగా వందనం సమర్పించగా ఎస్పీ రెమా రాజేశ్వరికి స్వీకరించారు. అనంతరం అమరుల ఆత్మశాంతి కోసం రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగానే అమరు పేరున రచించిన పుస్తకాన్ని పరేడ్‌ కమాండర్‌ వీరేష్‌ ఎస్పీకి అందజేయగా అదనపు ఎస్పీ వెంకటేశ్వర్లు చదివి వినిపించారు.

పిల్లలతో ముచ్చటించిన ఎస్పీ  
కార్యక్రమం అనంతరం అమరవీరుల కుటుంబ సభ్యులతో ఎస్పీ రెమా రాజేశ్వరి తన చాంబర్‌లో ముచ్చటించారు. వారి సాదక బాదకాలను అడిగి తెలుసుకున్నారు. బరువెక్కిన హృదయాలతో వారి కుటుంబసభ్యులు కంటతడి పెట్టారు. వేదికపై పలువురు తమ మనోభావాలు పంచుకున్నారు. చిన్నప్పుడు తండ్రితో కూతురు గడిపిన రోజులు.. కొడుకుతో తల్లి పంచుకున్న మధుర జ్ఞాపకాలు.. భార్య తన భర్తతో పెళ్లియిన నాటి నుంచి చివరకు పంచుకున్న తీపి గుర్తులు నెమరువేసుకుని భావోధ్వేగానికి లోనయ్యారు.
  
పట్టణంలో శాంతి ర్యాలీ 
అనంతరం ఎస్పీ రెమా రాజేశ్వరి జెండా ఊపి శాంతిర్యాలీ ప్రారంభించారు. అనంతరం అమరవీరుల కుటుంబ సభ్యులతో కలిసి ఎస్పీ వన్‌టౌన్‌ చౌరస్తాలో ఉన్న పరదేశీనాయుడు విగ్రహం వరకు వెళ్లారు. నినాదాలు చేస్తూ విగ్రహానికి ఎస్పీ రెమా రాజేశ్వరి, అదనపు ఎస్పీ వెంకటేశ్వవర్లు, డీఎస్పీ భాస్కర్‌ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అక్కడే అమరవీరుల కోసం రెండు నిమిషాలు మౌనం పాటించారు. కార్యక్రమంలో డీటీసీ అదనపు ఎస్పీ మురళీధర్‌రావు, డీఎస్పీలు గిరిబాబు, ఇమ్మాన్యుయేల్, డీఎఫ్‌ఓ గంగారెడ్డి, సీఐలు డివిపి రాజు, రామకృష్ణ, రాజేష్, కిషన్, అమర్‌నాథ్‌రెడ్డి, ఎస్‌ఐలు భాస్కర్‌రెడ్డి, పీపీ బాలగంగాధర్‌రెడ్డి, రెడ్‌క్రాస్‌ చైర్మన్‌ నటరాజ్, రాజయ్య, నాగభూషణం, సత్తయ్య, మన్మోహాన్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు