మరో పోలీసు బలవన్మరణం

25 Apr, 2019 10:35 IST|Sakshi
అజిన్‌రాజ్‌ (ఫైల్‌)

తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య

పని భారమా? ప్రేమ వ్యవహారమా?

సాక్షి, చెన్నై: పనిభారమా లేదా, ప్రేమ వ్యవహారమా..? ఏమోగానీ తుపాకీతో కాల్చుకుని యువ పోలీసు ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం కన్యాకుమారిలో ఈ ఘటన చోటు చేసుకుంది. తమిళనాడు – కేరళ సరిహద్దులోని  కన్యాకుమారి జిల్లా పశ్చిమ పర్వత శ్రేణుల్లో గోదైయారు జల విద్యుత్‌ కేంద్రం ఉంది. గోదైయారు నది నీటి ఆధారంగా ఇక్కడ విద్యుత్‌ ఉత్పత్తి సాగుతోంది. ఇక్కడ కన్యాకుమారి జిల్లా కులశేఖరం సమీపంలోని నడైక్కావుకు  చెందిన అజిన్‌రాజ్‌ (26) సాయుధ బలగాల విభాగం పోలీసుగా విధుల్ని నిర్వర్తిస్తున్నాడు. ఇక్కడి భద్రత విధుల్లో ఉన్న అజిన్‌కు అక్కడే బస చేయడానికి ఓ గదిని కేటాయించి ఉన్నారు. బుధవారం ఉదయం అజిన్‌ గది నుంచి తుపాకీ పేలిన శబ్దం రావడంతో సిబ్బంది ఉరకలు తీశారు.

అక్కడ గొంతులో తుపాకీ తూటా దిగి రక్తపు మడుగులో అజిన్‌ పడి ఉండటంతో ఆందోళన చెందారు. అతడ్ని పరిక్షించగా, మరణించినట్టు నిర్ధారించారు. అక్కడ వర్షం సైతం పడుతుండటంతో మృతదేహాన్ని తరలించడం కష్టతరంగా మారింది. సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతదేహాన్ని అతి కష్టం మీద పోస్టుమార్టం నిమిత్తం కన్యాకుమారికి తరలించాల్సి వచ్చింది. అయితే, గత కొద్ది రోజులుగా పని భారం అంటూ అజిన్‌ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ వచ్చినట్టు సమాచారం. అలాగే, ఎవరితోనో గంట తరబడి ఫోన్లో మాట్లాడుతూ వచ్చాడు. తుపాకీతో కాల్చుకునేందుకు కొద్ది సమయానికి ముందు కూడా అతడు ఎవరితోనో ఫోన్లో మాట్లాడి ఉండటంతో ఆ నెంబర్‌ ఎవరిదో ఆరా తీస్తున్నారు. అజిన్‌రాజ్‌ 2018లో మణిముత్తారు సాయుధ బలగాల బెటాలియన్‌ నుంచి పోలీసు విభాగంలో చేరారు. ఏడాది పాటుగా విధులు నిర్వహిస్తూ వస్తున్న అజిన్‌ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకోవడం అతని కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచింది. ఇటీవల కాలంగా పని భారం, మానసిక వేదనతో ఆత్మహత్యలకు పాల్పడే పోలీసుల సంఖ్య రాష్ట్రంలో పెరుగుతున్న విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు