శివగణేష్‌కు కన్నీటి వీడ్కోలు

24 Jan, 2018 09:06 IST|Sakshi

పెందుర్తి, చోడవరంలో అంజలి ఘటించిన ఉన్నతాధికారులు

శివగణేష్‌ వాహనాన్ని ఢీకొన్నది అంబులెన్స్‌

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల వద్ద డ్రైవర్‌ అరెస్ట్‌

పెందుర్తి: పెందుర్తి మండలం సాధూమఠం వద్ద ఆనందపురం – అనకాపల్లి బైపాస్‌పై ప్రమాదంలో మరణించిన పోలీస్‌ కానిస్టేబుల్‌ కాకర శివగణేష్‌(26) అంత్యక్రియలు మంగళవారం పూర్తి చేశారు. పెందుర్తి పోలీస్‌ స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్న శివగణేష్‌ సోమవారం అర్థరాత్రి విధులు ముగించుకుని చోడవరంలోని తన ఇంటికి వెళ్తున్న సమయంలో సాధూమఠం వద్ద ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. విషయం తెలుసుకున్న పోలీస్‌ ఉన్నతాధికారులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు మంగళవారం ఉదయాన్నే కేజీహెచ్‌ మార్చురీ వద్దకు చేరుకున్నారు. అక్కడ పోస్టుమార్టం పూర్తయిన తర్వాత తోటి పోలీసుల సందర్శనార్థం పెందుర్తి పోలీస్‌ స్టేషన్‌ వద్ద శివగణేష్‌ పార్థివదేహాన్ని కాసేపు ఉంచారు. జాయింట్‌ సీపీ – 2 రవికుమార్‌మూర్తి, పెందుర్తి సీఐ పి.సూర్యనారాయణ, గాజువాక ట్రాఫిక్‌ సీఐ జూరెడ్డి మురళి, ఎస్‌ఐలు మన్మథరావు, స్వామినాయుడు, అప్పలరాజు, రామారావు, జి.డి.బాబు, ఉమామహేశ్వరరావు, ఏఎస్‌ఐలు, హెచ్‌సీలు, పీసీలు, హోంగార్డులు ఘనంగా అంజలి ఘటించారు. అనంతరం శివగణేష్‌ మృతదేహాన్ని చోడవరం తరలించి అంత్యక్రియలు జరిపారు.

అంబులెన్స్‌ డ్రైవర్‌ అరెస్ట్‌: సోమవారం రాత్రి సాధూమఠం వద్ద శివగణేష్‌ బైక్‌ను అంబులెన్స్‌ ఢీకొంది. ప్రమాదం జరిగిన తర్వాత స్థానికులను విచారించి ఆధారాలు సేకరించిన పోలీసులు హైదరాబాద్‌ నుంచి ఒడిశాకు ఓ మృతదేహాన్ని తరలిస్తున్న అంబులెన్స్‌ శివగణేష్‌ బైక్‌ను ఢీకొన్నట్లు నిర్థారించారు. వెంటనే ఆనందపురం – అనకాపల్లి బైపాస్‌తో పాటు, ఎన్‌హెచ్‌ – 16 మీదుగా ఉన్న అన్ని పోలీస్‌స్టేషన్‌లకు సమాచారం అందించి అప్రమత్తం చేశారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల వద్ద అంబులెన్స్‌ను గుర్తించిన అక్కడి పోలీసులు పెందుర్తి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఎస్‌ఐ మన్మథరావు అంబులెన్స్‌ డ్రైవర్, హైదరాబాద్‌ వాసి నరసింహారెడ్డిని అదుపులోకి తీసుకుని అరెస్ట్‌ చేశారు. సీఐ పి.సూర్యనారాయణ ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు