కోటయ్య  కేసు.. నీరుగారుస్తున్న పోలీసులు

24 Feb, 2019 11:17 IST|Sakshi
బీసీ కౌలు రైతు కోటేశ్వరరావు మృతదేహం వద్ద విలపిస్తున్న ఆయన భార్య ప్రమీల

ప్రభుత్వం, పోలీసులపై మచ్చ తుడిచేందుకు యత్నాలు

పోలీసుల దాడిలోనే కోటేశ్వరరావు మృతిచెందాడంటున్న కుటుంబ సభ్యులు

కౌలు రైతు మృతికి పోలీసుల తీరో మరోటో కారణం కావచ్చన్న సీఎం చంద్రబాబు

పోలీసుల దర్యాప్తు తీరుపై సర్వత్రా వ్యక్తమవుతున్న అనుమానాలు

సాక్షి, గుంటూరు: పోలీస్‌ శాఖ, ప్రభుత్వంపై మచ్చ తెచ్చే ఏ కేసునైనా ప్రభుత్వ పెద్దలు రాజకీయం చేసి నీరుగారుస్తున్నారా అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన కొండవీడు ఉత్సవాల్లో భాగంగా సీఎం సభ నేపథ్యంలో మృతి చెందిన బీసీ కౌలు రైతు కోటేశ్వరరావు కేసు ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం నిలిచింది. పోలీసుల దాడిలోనే కోటేశ్వరరావు మృతి చెందాడని కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ‘రైతు మృతికి పోలీసుల తప్పో లేక ఇంకోటో కావచ్చు. ప్రభుత్వం తరఫున మృతుని కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం ఇస్తాం’ అంటూ సీఎం చంద్రబాబు నాయుడు ఘటన జరిగిన కొద్దిసేపటికే ప్రకటించారు. సాక్షాత్తూ సీఎం నోటి నుంచి రైతు మృతుకి పోలీసుల ప్రవర్తన కారణం కావచ్చు అని వచ్చినప్పటికీ పోలీసులు పారదర్శకంగా కేసు దర్యాప్తు చేయడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

దర్యాప్తు చేయకుండానే ఆత్మహత్యని ప్రకటన
ఓ వైపు రైతు కోటేశ్వరరావు పోలీసుల దాడిలో మరణించాడని ఆయన కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మరోవైపు ఘటన స్థలంలో గొడవ జరిగినట్టు బొప్పాయి చెట్లు విరిగిపోయి కనిపిస్తున్నాయి. బొప్పాయి తోటలోనే పోలీసులు మద్యం తాగి, పేకాడినట్టు పేక ముక్కలు, మద్యం బాటిళ్లు దర్శనమిస్తున్నాయి. అయినప్పటికీ కేసు దర్యాప్తు మాత్రం పోలీసుల తప్పులేదన్న కోణంలోనే సాగుతోంది. ఎటువంటి దర్యాప్తూ చేయకముందే కోటేశ్వరరావు పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని సాక్షాత్తూ జిల్లా రూరల్‌ ఎస్పీ రాజశేఖరబాబు నిర్ధారించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కోటేశ్వరరావు ఆత్మహత్య చేసుకున్నాడని నిర్ధారించిన తరువాత డీఎస్పీతో విచారణ చేయిస్తామని ఎస్పీ ప్రకటించి ఉపయోగం ఏమిటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. తమ ఉన్నతాధికారే కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నాడని నిర్ధారించిన తరువాత డీఎస్పీ నిస్పక్షపాతంగా దర్యాప్తు ఎలా చేస్తారని మృతుని కుటుంబ సభ్యులు, బంధువులు ప్రశ్నిస్తున్నారు.

అధికార పార్టీ పెద్దల రాజకీయం..
సీఎం పర్యటన సందర్భంగా కోటేశ్వరరావు పోలీసుల దాడిలో మరణించాడని విమర్శలు వెల్లువెత్తడంతో ప్రభుత్వం, పోలీస్‌ శాఖ ప్రతిష్టకు భంగం కలుగుతుందని టీడీపీ పెద్దలు భావించారు. వెంటనే రైతు మృతిని రాజకీయం చేయడం మొదలుపెట్టారు. దీనికితోడు కేసులో ప్రత్యక్ష సాక్షి, కౌలు రైతు కోటేశ్వరరావు పాలేరు పున్నారావు ఘటన జరిగిన మరుక్షణం నుంచి మాయమై, మంత్రి ప్రెస్‌మీట్‌లో ప్రత్యక్షమవ్వడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మంత్రి ప్రెస్‌మీట్‌ అనంతరం పున్నారావు తిరిగి కనిపించడంలేదు. ఈ తీరు చూస్తుంటే పున్నారావును బెదిరించి కేసును తొక్కిపట్టే ప్రయత్నాల్లో భాగంగానే టీడీపీ నాయకులు అతడిని నిర్బంధించారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.(కోటయ్య ఫోన్‌ ఎందుకు మాయం చేశారు?)

బాధ్యత గల మంత్రి ప్రత్తిపాటి సైతం తన నియోజకవర్గంలో జరిగిన రైతు మృతిపై పూర్తి విచారణ జరపాల్సిందిపోయి, హెలీప్యాడ్‌ స్థలం అతనిది కాదంటూ కేసును పక్కదారి పట్టిం చేలా మాట్లాడటంపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తన తండ్రి పురుగుమందు తాగినట్టు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఎక్కడా పేర్కొనలేదని కోటేశ్వరరావు కుమారుడు వీరాంజనేయులు మొత్తుకుంటున్నారు. అయితే పోలీసులు మా త్రం కోటేశ్వరరావు పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్టు అతని కుమారుడు ఫిర్యాదులో పేర్కొన్నట్టు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. మరో వెపు ఈ ఘటనపై ఎస్పీ స్పందించిన తీరుకు, సిబ్బంది చెబుతున్న మాటలకు పొంతన కుదురడంలేదు. రైతును రక్షించే సమయంలో అతని కుమారుడు ఘటన స్థలంలో ఉన్నాడని పోలీసులు చెబుతుంటే, మృతుని కుమారుడు మాత్రం పోలీసులే తన తండ్రి మృతదేహాన్ని రోడ్డుపైకి ఎదురు తెచ్చిచ్చారని స్పష్టంచేస్తున్నారు. ఇలా పరస్పర విరుద్ధమైన ప్రకటనలు సర్వత్రా అనుమానాలను రేకెత్తిస్తున్నాయి.

 
కోటేశ్వరరావు భార్య ప్రమీలను ఓదార్చుతోన్న వైఎస్సార్‌సీపీ చిలకలూరి పేట సమన్వయకర్త విడదల రజని(ఫైల్‌)

కోటయ్య మృతి.. ఈ ప్రశ్నలకు బదులేది?

మరిన్ని వార్తలు