అసలు సూత్రధారి ఎక్కడ?

9 Nov, 2019 11:11 IST|Sakshi

సాక్షి, మహబూబ్‌నగర్‌ క్రైం: ఒకప్పుడు ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో మావోయిస్టుల ప్రాబల్యం ఎక్కువగా ఉండేది. దీంతో పలువురు రాజకీయ నాయకులను మావోయిస్టులు టార్గెట్‌ చేసేవారు.. అలాంటి వారికి స్వీయరక్షణ కోసం ఆయుధం కొనుగోలు చేసి, అది కూడా ఎవరికీ కనిపించకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకునేవారు. కానీ నేడు పరిస్థితులు చాలా మారాయి. సమాజంలో కొందరు ప్రత్యేకంగా కనిపించి నలుగురిలో గుర్తింపు పొందాలని యత్నిస్తుంటారు. ఇలాంటి వారిలో చాలా మంది పిస్తోల్‌ను ఎంచుకుంటున్నారు. ఈక్రమంలోనే ఇతర రాష్ట్రాల నుంచి తక్కువ ధరలకు గన్స్‌ కొనుగోలు చేసి ఇక్కడ విక్రయిస్తున్నారు. ఇలాంటి కల్చర్‌ పాలమూరు పట్టణంలో పెరుగుతున్నట్లు సమాచారం.

గన్‌ దొరకడంతో కలకలం
ఇటీవల తిమ్మాసనిపల్లికి చెందిన వరద రవి దగ్గర గన్‌ దొరకడం కలకలం రేపింది. అయితే అతనికి గన్‌ అమ్మిన వ్యక్తి ఆచూకీ ఇంకా లభ్యం కావడం లేదు. కొనుగోలు చేసిన వ్యక్తి మాత్రం రిమాండ్‌కు వెళ్లగా.. విక్రయించిన అసలు సూత్రధారి ఇంకా పరారీలో ఉన్నాడు. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన అనిల్‌కుమార్‌ అనే వ్యక్తి జీవనోపాధి కోసం మహబూబ్‌నగర్‌కు వచ్చాడు. ఈక్రమంలోనే స్థానికంగా గప్‌చుప్‌ల బండి నడుపుతూ వచ్చాడు. ఇలాగే పని చేసుకుంటూ స్థానికంగా కొంత పరిచయాలు పెరిగిన తర్వాత మొదట అదే కాలనీకి చెందిన కొందరు వ్యక్తులకు తుపాకులు విక్రయించినట్లు సమాచారం.

అయితే సడన్‌గా వరద రవి గన్‌తో పోలీసులకు పట్టుపడటంతో మిగితా గన్‌ కల్గిన వ్యక్తులు అలర్ట్‌ అయి వాటిని పోలీసుల కంటపడకుంగా రహస్య ప్రాంతాల్లో దాచిపెట్టినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఇంకా ఎవరితో గన్‌లు ఉన్నాయానే విషయం పరారీలో ఉన్న ఒక్క అనిల్‌కుమార్‌ మాత్రమే తెలుసు. అతను పట్టుబడితే పాలమూరు పట్టణంలో గన్‌ కల్గిన వారి జాతకం బయటకు రానుంది. వరద రవి పట్టుబడిన విషయం తెలుసుకున్న అనిల్‌కుమార్‌ ఉత్తర ప్రదేశ్‌కు పరార్‌ అయినట్లు సమాచారం. స్థానికంగా అతని గురించి సరైన సమాచారం లేకపోవడం వల్ల ఆచూకి కోసం వెతకడం కష్టంగా మారింది.

ఆధార్‌ కార్డు మాత్రమే దొరికింది
తుపాకీ విక్రయించిన వ్యక్తి పేరు అనిల్‌కుమార్‌ అని తెలిసింది. అతనికి సంబంధించి కేవలం ఒక ఆధార్‌కార్డు మాత్రమే లభించింది. దాని ఆధారంగా అతని కోసం గాలింపు చర్యలు చేపట్టడం జరిగింది. – ఉమామహేశ్వరరావు, రూరల్‌ సీఐ, మహబూబ్‌నగర్‌ 

మరిన్ని వార్తలు