లచ్చలకు లచ్చలు ఇచ్చుడే!

6 Oct, 2019 08:32 IST|Sakshi

మరోసారి తెరపైకి ఏఎస్సై మోహన్‌రెడ్డి , అతడి సన్నిహితుల ఆడియో రికార్డ్‌ 

పాత రికార్డునే బయట పెట్టినట్లు అనుమానం 

పోలీస్, రాజకీయ, ఐటీ శాఖలకు ఇచ్చిన ‘లెక్కలు’ చెప్పిన మోహన్‌రెడ్డి 

సాక్షి, కరీంనగర్‌: ‘ఖర్చులకు ఇబ్బందవుతుంది శ్రీధర్‌.. 200 మంది దాక డబ్బులు ఇయ్యాలె. ప్రాపర్టీ ఉంది. కానీ ఇప్పటికీ లచ్చలకు లచ్చలు ఇచ్చుడైతంది. ఎక్కడి కెళ్లి తేవాలె. డీఎస్పీకి రూ.2 లక్షలు ఇచ్చిన. కరీంనగర్‌ డీఎస్పీకి రూ.4 లక్షలు ఇచ్చిన. రూరల్‌ సీఐకి రూ.2 లక్షలిచ్చిన,  సీఐడీ డీఎస్పీకి లక్ష... ఈ సీఐకి లక్షన్నర. ఇన్‌కంటాక్సాయనకు రూ.8 లక్షలిచ్చిన. ఇంక రూ.12 లక్షలు ఇవ్వాలె. రూ.20 లక్షలకు మాట్లాడిన. మన అందరి పేర్లు ఇచ్చిన. నా ఒక్కని కోసమా చేస్తున్నది. అందరి కోసమే కద’  ఫైనాన్సర్‌గా అవతారమెత్తి భూ కబ్జాలు, దౌర్జన్యాలతో కోట్లకు పడగలెత్తి తరువాత పరిణామాల్లో అరెస్టయి జైలుకు వెళ్లొచ్చి సస్పెండ్‌ అయిన ఏఎస్సై మోహన్‌రెడ్డి తన సన్నిహితులైన శ్రీధర్‌రెడ్డి, బావమరిది శ్రీపాల్‌రెడ్డితో మాట్లాడిన సంభాషణ ఇది.

రికార్డ్‌ ద్వారా కాకుండా ఒకేదగ్గర కూర్చొని మాట్లాడినప్పుడు గుట్టుగా రికార్డు చేసినట్లుగా ఉన్న ఈ సంభాషణ ఇటీవల జరిగినదా? పాతదా అనే దాంట్లో స్పష్టత లేదు. సన్నిహితులైన శ్రీధర్‌రెడ్డితోపాటు ‘బావ’ అన్న సంబోధన ఆధారంగా మోహన్‌రెడ్డి బావమరిది శ్రీపాల్‌రెడ్డి కూడా ఈ మీట్‌లో ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఈ సంభాషణను సామాజిక మాధ్యమాల ద్వారా వైరల్‌ చేయడంతో సస్పెండ్‌ అయిన ఏఎస్సై మోహన్‌రెడ్డికి సంబంధించిన చర్చ మళ్లీ మొదలైంది. 

కేసుల్లో శిక్షలు పడకుండా ఏం చేయాలంటే... 
పోలీసులకు ఎవరెవరికి ఎంతెంత ఇచ్చాడో స్వయంగా తన సన్నిహితులకు చెపుతుండగా రికార్డ్‌ చేసిన సంభాషణలో మోహన్‌రెడ్డి అనేక విషయాలు చెప్పుకొచ్చాడు. కేసుల్లో శిక్షలు పడకుండా లాయర్లను పెట్టుకుని ఏం చేయాలి..? ఎవరెవరిని మేనేజ్‌ చేయాలి? అనే విషయాలను చర్చించినట్లు రికార్డు వింటే అర్థమవుతోంది. 20 కేసుల దాకా ఉన్నప్పుడు 2 లేదా 3 కేసుల్లో శిక్షలు పడడం సహజమని, ఒకసారి శిక్ష పడితే బతికుండుడే వేస్ట్‌ అని కూడా శ్రీధర్‌రెడ్డి, మోహన్‌రెడ్డి మాట్లాడుకోవడం వినిపిస్తోంది.

కాగా, 20 మంది వరకున్న మోహన్‌రెడ్డి గ్యాంగ్‌ కేసుల నుంచి బయట పడడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎవనికి ఎంతిచ్చిన.. ఎక్కడిచ్చిన అనేది తనకే తెలుసని చెప్పిన మోహన్‌రెడ్డి తానెక్కడా సంతకం చేయలేదని చెప్పుకొచ్చాడు. అయితే కేసుల నుంచి బయటపడాలంటే చాలా చేయాల్సి ఉంటదని చెప్పడం గమనార్హం. న్యాయపరమైన అంశాలను కూడా ప్రస్తావిస్తూ, ఇబ్బందికర వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

ఎక్కడో ‘సిట్టింగ్‌’ లో ఉన్నప్పుడు సెల్‌ఫోన్‌ ఆడియో రికార్డు ఆప్షన్‌ ద్వారా ఎవరో ఈ సంభాషణను రికార్డు చేసినట్టు తెలుస్తోంది. అయితే ఒకేసారి కాకుండా, రెండు మూడు వేర్వేరు సంభాషణలను మిక్స్‌ చేసి బయటకు విడుదల చేసినట్లు అనుమానిస్తున్నారు. సన్నిహితులుగా కూర్చొన్నప్పుడు జరిగిన సంభాషణ ఎలా రికార్డ్‌ అయిందనే విషయంలో స్పష్టత లేదు. 

సీఐలు, ఎస్సైలు ఎవడూ చెయ్యడు... పెద్దోళ్లతోనే... 
ఆడియో రికార్డు చివరలో మోహన్‌రెడ్డితో ఆయన బావమరిది, శ్రీధర్‌రెడ్డి కొంత గట్టిగా మాట్లాడినట్లు తెలుస్తోంది. దాంతో ‘మనం ఎవలకు భయపడే అవసరం లేదు. గీ సీఐలు, ఎస్సైలు ఎవ్వడు చెయ్యడు. పెద్దాయనకు చెప్పిచ్చిన. పొలిటికల్‌ పెద్దాయనకు గూడ తెలుసు. అందరూ మనకు సపోట్‌ జేస్తరు. పెద్ద పెద్ద పనులు చేపిచ్చుకుందాం.

మినిమం రూ.పది లక్షలు. అసొంటి పనైతె తే...’ అలా సంభాషణ సాగింది. కాగా ఇప్పటికీ తన కేసుల నుంచి బయట పడడానికి పోలీస్‌ అధికారులు, రాజకీయ ప్రముఖులతో మోహన్‌రెడ్డి టచ్‌లోనే ఉన్నాడనే అనుమానాలు ఈ సంభాషణలు వింటే కలుగక మానవు. కాగా సంభాషణ ఆఖరులో ‘ఎన్ని ప్రాబ్లంలు ఎదురైన మనం చేసింది న్యాయం ... ధర్మం’ అనడమే కొసమెరుపు. 

మరిన్ని వార్తలు