ప్రేమ వ్యవహారమే కారణమా..?

19 Apr, 2019 10:40 IST|Sakshi
జ్యోత్స్న మృతదేహం (ఫైల్‌)

జ్యోత్స్న మృతి చెందిన రోజు ఫ్లాట్‌లోనే అంకూర్‌ స్నేహితుడు పవన్‌

అన్ని కోణాల్లోనూ దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు

విశాఖ సిటీ: ఇంజినీరింగ్‌ విద్యార్థిని జ్యోత్స్న మృతి కేసులో వాస్తవాలను వెలికి తీసేందుకు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఆ రోజు ఫ్లాట్‌లో ఏం జరిగింది.? జ్యోత్స్న మృతికి కారణమేంటి.? అనే వివరాలపై ప్రాథమిక దర్యాప్తు పూర్తి చేసిన పోలీసులకు పలు కీలక ఆధారాలు లభ్యమైనట్లు తెలుస్తోంది. విద్యార్థిని మృతి చెందిన రోజున పవన్‌ ఫ్లాట్‌లోనే ఉన్నట్లు తేలింది. జ్యోత్స్నకు ఫ్యాకల్టీ అంకూర్‌కు మధ్య ప్రేమ వ్యవహారం సాగిందని దర్యాప్తులో తేలినట్లు తెలుస్తోంది. అయితే ఇదే యువతి మరణానికి కారణమా..? అనే విషయంపై పోలీసులు దృష్టి సారించారు. ఆమె ఆత్మహత్య చేసుకుందని అంకూర్‌ పోలీసులకు ఫిర్యాదు చెయ్యడం, కాదు హత్యేనంటూ మృతురాలి తల్లిదండ్రులు, ప్రజాసంఘాలు ఆరోపిస్తుండటంతో కేసుని సవాల్‌గా తీసుకున్న పోలీసులు విచారణ వేగవంతం చేస్తున్నారు. ఈ నెల 15వ తేదీన అంకూర్‌ ఫ్లాట్‌కు వెళ్లడం, ఆమె అక్కడ ఫ్యాన్‌కు ఉరేసుకొని మృతి చెందిందంటూ పోలీసులకు ఫిర్యాదు అందిన విషయం తెలిసిందే.

అయితే జ్యోత్స్న మృతి చెందిన సమయంలో తాను ఫ్లాట్‌లో లేనని, ఉదయం 9 గంటలకే కోచింగ్‌ సెంటర్‌ నుంచి వెళ్లిపోయి మధ్యాహ్నం 3 గంటలకు తిరిగి వచ్చేసరికి మృతి చెందినట్లు గుర్తించానని పోలీసులకు అంకూర్‌ తెలిపారు. అయితే ఆ సమయంలో అంకూర్‌ స్నేహితుడు పవన్‌ ఫ్లాట్‌లోనే ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆ దిశగానూ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. ఒకవేళ జ్యోత్స్న ఆత్మహత్య చేసుకోవాలనుకుంటే గాజువాకలో ఉన్న తన నివాసంలోనూ.. లేదా చుట్టుపక్కల ఎక్కడైనా ఆత్మహత్యకు పాల్పడవచ్చు. కానీ గాజువాక నుంచి శాంతిపురంలోని అంకూర్‌ నివాసముంటున్న ఎన్‌క్లేవ్‌ ఫ్లాట్‌కి వచ్చి ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరమేంటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్న పోలీసులు జ్యోత్స్న ఫోన్‌ లాక్‌ ప్యాట్రన్‌ని సాంకేతిక నిపుణుల ద్వారా తీసి కాల్‌ డేటాను చెక్‌ చెయ్యాలని భావిస్తున్నారు. మరోవైపు పోస్ట్‌మార్టం నివేదిక వచ్చిన తర్వాత ఆమెది హత్యా..? లేదా ఆత్మహత్యా..? అనే నిర్థారణ కూడా వస్తుందని అభిప్రాయపడుతున్నారు. రెండు రోజుల్లో కేసుకి సంబంధించిన పూర్తి వాస్తవాలు వెల్లడి కానున్నాయని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. 

మరిన్ని వార్తలు