ప్రియుడే హంతకుడు 

12 Apr, 2020 03:55 IST|Sakshi
ఘటనా స్థలంలో వివరాలు సేకరిస్తున్న పోలీసులు (ఫైల్‌)

తంగడపల్లి మహిళ హత్య కేసు విచారణ కొలిక్కి

స్నేహితుడితో కలిసి చంపేసిన ఫేస్‌బుక్‌ ఫ్రెండ్‌ 

చేవెళ్ల: సంపన్న కుటుంబానికి చెందిన ఆమె.. ఫేస్‌బుక్‌లో పరిచయమైన ఓ ఫ్రెండ్‌ మాయలో పడింది. భర్త, పిల్లల్ని వదిలేసి అతడి వద్దకు వెళ్లిపోయింది. చివరకు కోరుకున్న ప్రియుడే కాలయముడై ఆమె ప్రాణాలు తీశాడు.. ఇదీ కొద్దిరోజుల క్రితం ‘దిశ’ఘటన తరహాలో సంచలనం సృష్టించిన రంగారెడ్డి జిల్లా తంగడపల్లి బ్రిడ్జి కింద వెలుగు చేసిన మహిళ (36) హత్య కేసు మిస్టరీ. తన స్నేహితుడి సాయంతో ప్రియుడు ఈ ఘాతుకానికి పాల్పడినట్టు తేల్చారు. ప్రియుడి స్నేహితుడిని పట్టుకున్న పోలీసులు ఈ మేరకు కీలక   ఆధారాలు సేకరించారు. అతడిని రిమాండ్‌కు తరలించినట్టు తెలుస్తోంది.

ఆ రోజేం జరిగిందంటే.. 
మార్చి 17న చేవెళ్ల మండలం తంగడపల్లి శివారులోని బ్రిడ్జి కింద యువతి మృతదేహం కనిపించింది. నగ్నంగా పడి ఉన్న ఆమె ముఖం పూర్తిగా ఛిద్రమైంది. ఒంటిపై ఖరీదైన నగలున్నాయి. పక్కనే నైలాన్‌ తాడు పడి ఉంది. ఇది మరో ‘దిశ’ఘటనలా ఉందంటూ అప్పట్లో ప్రచారమైంది. చేవెళ్ల పోలీసులు మహిళ ఆచూకీ కోసం రాష్ట్రంతోపాటు ఇతర రాష్ట్రాల పోలీసులకు తెలిపారు. మృతదేహం కుళ్లిపోతుండటంతో ఇటీవల చేవెళ్లలోనే పూడ్చిపెట్టారు. మృతురాలిని సిక్కింకు చెందిన మహిళగా గుర్తించారు. మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు కుటుంబీకులు నిరాకరించినట్లు తెలుస్తోంది. సంపన్న కుటుంబానికి చెందిన ఈ మహిళ భర్త వ్యాపారవేత్త అని, ఇద్దరు పిల్లలు ఉన్నట్లు సమాచారం.

ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయం 
ముంబైలో ఉండే ప్రధాన నిందితుడికి ఈ మహిళ ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయమైంది. అది ప్రేమ, వివాహేతర సంబంధానికి దారితీసింది. ఆమె భర్త, పిల్లల్ని వదిలేసి సిక్కిం నుంచి 4 నెలల క్రితం ముంబైకి వెళ్లి అక్కడే ఉండేది. ప్రియుడు మరో మహిళతో చనువుగా ఉంటున్నట్టు గుర్తించిన ఆమె.. తనను పెళ్లిచేసుకోవాలని ఒత్తిడి చేయటంతో ఆమెను అడ్డు తొలగించుకునేందుకు ప్రియుడు పథకం పన్నాడు.

చంపేసి ముంబైకి చెక్కేసి.. 
సీసీ కెమెరాల పుటేజీలు, సెల్‌ఫోన్‌ సిగ్నళ్ల జీపీఎస్‌ ట్రాక్‌ను సేకరించడం ద్వారా పోలీసులు ఓ కారులో ఇద్దరు వ్యక్తులు వచ్చినట్లు గుర్తించారు. ప్రధాన నిందితుడికి బంధువు, స్నేహితుడైన యువకుడు హైదరాబాద్‌లో ఇంటర్న్‌షిప్‌ కోసం ఉంటున్నాడు. ప్రధాన నిందితుడు తాను హైదరాబాద్‌ వస్తున్నానని, కారు ఏర్పాటు చేయాలని కోరటంతో ఈ యువకుడు అద్దె కారును ఏర్పాటు చేశాడు. గత నెల 15న ముంబై నుంచి నిందితుడు తన ప్రియురాలిని తీసుకొని విమానంలో హైదరాబాద్‌ వచ్చాడు. ఇక్కడి యువకుడితో కలిసి అద్దె కారులో లాంగ్‌ డ్రైవ్‌ కోస మని ముగ్గురూ వికారాబాద్‌కు వచ్చారు.

పథకం ప్రకారం నైలాన్‌ తాడుతో కారులోనే మహిళ మెడకు ఉరిబిగించి హత్య చేశారు. తంగడపల్లి బ్రిడ్జి వద్ద వాహనం ఆపి మృతదేహాన్ని తాడుతో కిందికి దించారు. ముఖం గుర్తించకుండా బండరాయితో మోది ఛిద్రం చేశారు. రాయితోపాటు మహిళ దుస్తులను తమతో తీసుకెళ్లారు. కారు తంగడపల్లి ప్రగతి రిసార్టు మీదుగా ప్రొద్దటూరు నార్సింగి మీదుగా ఔటర్‌ రింగ్‌రోడ్డుకు చేరుకున్నట్లు సీసీటీవీ ఫుటేజీలో పోలీసులు గుర్తించారు. అనంతరం ప్రధాన నిందితుడు ముంబై వెళ్లిపోయాడు. కారు నంబర్‌ ఆధారంగా దానిని అద్దెకు తీసుకున్న యువకుడిని అదుపులోకి తీసుకోవటంతో ఈ కీలక ఆధారాలు లభించినట్లు సమాచారం. 

>
మరిన్ని వార్తలు