కోడెల కాల్‌డేటానే కీలకం!

22 Sep, 2019 11:17 IST|Sakshi

ఆత్మహత్యకు ముందు ఫోన్‌ కాల్స్‌పై పోలీసుల విచారణ

గంట వ్యవధిలో 12 మందితో మాట్లాడినట్లు నిర్ధారణ

సాక్షి, అమరావతి: టీడీపీ సీనియర్‌ నేత, మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాద రావు ఆత్మహత్యకు సంబంధించి పోలీసులు ప్రధానంగా ఫోన్‌కాల్‌ డేటాపై దృష్టి సారించారు. సూసైడ్‌ నోట్‌ కూడా లభించకపోవడంతో పోలీసులు సాంకేతిక పద్ధతులను అనుసరిస్తున్నారు.  కీలక ఆధారంగా మారిన ఆయన సెల్‌ఫోన్‌ అదృశ్యం కావడంతో కాల్‌డేటాను హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌ పోలీసులు విశ్లేషిస్తున్నట్టు సమాచారం. కోడెల ఆత్మహత్యకు ముందు గంట వ్యవధిలో 10–12 మందితో మాట్లాడినట్టు గుర్తించారు.  చని పోవడానికి ముందు గంట వ్యవధిలో చేసిన ఫోన్‌కాల్స్‌లో కచ్చితంగా ఎవరో ఒకరికి తన ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితుల గురించి కోడెల చెప్పి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కోడెలతో ఫోన్‌లో మాట్లాడిన వారిని పోలీసులు వ్యక్తిగతంగా పిలిచి ఆరా తీస్తున్నట్టు తెలిసింది. మరోవైపు బంజారాహిల్స్‌లోని కోడెల నివాసం వద్ద పోలీసులు సెక్యూరిటీని అప్రమత్తం చేసి ఎవరైనా అక్కడికి వస్తే సమాచారం ఇవ్వాలని సూచించినట్లు తెలిసింది. కోడెల కుమారుడు శివరామ్‌ను కూడా పోలీసులు విచారించనున్నారు. ఇప్పటికే విచారించిన కుటుంబ సభ్యులతోపాటు మరికొందరిని కూడా మరోసారి విచారించే అవకాశం ఉంది.

మేనల్లుడి ఫిర్యాదుపైనా విచారణ..
కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య చేసుకున్న రోజు ఆయన మేనల్లుడు కంచేటి సాయిబాబు గుంటూరు జిల్లా సత్తెనపల్లి పోలీసులకు చేసిన ఫిర్యాదుపై కూడా బంజారాహిల్స్‌ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కుమారుడు శివరామ్, కుటుంబీకుల వల్లే కోడెల ఆత్మహత్య చేసుకున్నట్లు సాయిబాబు అరోపించిన సంగతి తెలిసిందే. కోడెల మృతిపై సీబీఐ విచారణకు ఆదేశించాలని గుంటూరు జిల్లాకు చెందిన బోరుగడ్డ అనిల్‌కుమార్‌ తెలంగాణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వాజ్యం(పిల్‌) దాఖలు చేసిన సంగతి తెలిసిందే. కోడెల మరణానికి ప్రతిపక్ష నేత చంద్రబాబు కారణమని అనిల్‌కుమార్‌ ఆరోపించారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా