కోడి పందెలు జోరు

13 Jan, 2019 08:34 IST|Sakshi

మంచిర్యాలక్రైం: సంక్రాంతి ప్రత్యేకం కోడి పందెలు జోరందుకుంటున్నాయి. పందెంరాయుళ్లు సై అంటే సై అంటున్నారు. కోడి పందెల నిర్వహణ కోసం ఇప్పటికే జిల్లాలోని సరిహద్దు గ్రామాల్లో అన్నిచోట్ల రహస్యంగా సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. పోలీసులకు దొరకకుండా ఉండేలా స్థావరాలను ఇప్పటికే ఏర్పాట్లు చేసుకున్నట్లు సమాచారం.

సంక్రాంతి సందర్భంగా ఈ ఏడాది కూడా భారీగా పందెలు నిర్వహించేందుకు పలువురు తమదైన శైలిలో వ్యూహరచన చేస్తున్నారు. పోలీసులు ఎన్ని ఆంక్షలు విధించినా పందెంరాయుళ్లు ఎలాగైనా నిర్వహించాలన్న ఉత్సాహంతో సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో కోడి పుంజులకు శిక్షణ ఇస్తున్నట్లు తెలిసింది. మంచిర్యాల జిల్లాలోని చెన్నూర్‌ నియోజకవర్గం మందమర్రి, కోటపల్లి, నెన్నెల, నీల్వాయి, మంచిర్యాల నియోజకవర్గంలోని లక్సెట్టిపేట, హాజీపూర్, మంచిర్యాల గోదావరి నదీ పరివాహక ప్రాంతాల్లో కోడి పందెలు నిర్వహించేందుకు  ఏర్పాట్లు చేశారు.  

పందెలకు ప్రత్యేకం.. 
మంచిర్యాల జిల్లాలో గతంలో తరచుగా కోడి పందెలు నిర్వహించే ప్రాంతాలు లక్సెట్టిపేట మండలం వెంకట్రావ్‌పేట, బలరావుపేట, మందమర్రి మండలంలోని పులిమడుగు, మందమర్రి, శివ్వారం, కోటపల్లి మండలంలోని సిర్సా, అన్నారం, అర్జున్‌గుట్టా, కోటపల్లి, సుంపుటం, జనగామ, హాజీపూర్‌ మండలంలోని పెద్దంపేట, గొల్లపెల్లి, మంచిర్యాలలో గోదావరినదీ పరివాహక ప్రాంతాల్లో, శ్రీరాంపూర్‌లో, బెల్లంపల్లి డివిజన్‌లోని తాండూర్‌ మండలంలో భారీగా కోడి పందెలు నిర్వహించే వారు. గతేడాది టాస్క్‌ఫోర్స్, స్థానిక పోలీసులు చేసిన దాడిలో 8 కేసులు నమోదు కాగా పందెం కోడి పుంజులు 21, పందెం నిర్వహిస్తున్న 43 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి రూ.58,270ల  నగదు స్వాధీనం చేసుకున్నారు. 

పోలీసుల వైఫల్యం వల్లే..
జిల్లాలో ప్రతిఏటా సంక్రాంతి పండుగకు భారీ ఎత్తున కోడి పందెలు నిర్వహిస్తున్నారు. వాటి నియంత్రణలో మాత్రం పోలీసులు వైఫల్యం చెందుతున్నారు. సీజన్‌లో అడపదడపా దాడులు చేస్తూ నామమాత్రపు కేసులు నమోదు చేసి చేతులు దులుపుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. బడా పందెంరాయుళ్లపై దృష్టి సారించడం లేదన్న విమర్శలున్నాయి. కొన్నిచోట్లా ప్రభుత్వ ఉద్యోగులు, చోటమోటా రాజకీయ నాయకులు సైతం కోడి పందెల నిర్వహణలో పాల్గొనడం గమనార్హం. 

  • గతేడాది నమోదైన కేసులు కొన్ని.. 
  • 2018 జనవరి 4న మందమర్రి మండల కేంద్రంలోని శివారు ప్రాంతంలో కోడి పందెలు నిర్వహిస్తున్నారన్నా సమాచారం మేరకు రామగుండం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దాడి చేసి రెండు కోడి పుంజులను, ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేవారు. వారి నుంచి రూ.5500 నగదు స్వాధీనం చేసుకున్నారు.
  • 2018 జనవరి 11న స్థానిక పోలీసులు కోడి పందేల స్థావరంపై దాడిచేసి నాలుగు పందెం కోడి పుంజులు, ఓ వ్యక్తిని అరెస్ట్‌ చేశారు. రూ. 4080 నగదు స్వాధీనం చేసుకున్నారు.
  • 2018 జనవరి 15న లక్సెట్టిపేట మండల కేంద్రంలో కోడి పందెలు ఆడుతున్నారన్నా సమాచారం మేరకు రామగుండం టాస్క్‌ఫోర్స్‌ పోలీసుల దాడిచేసి మూడు పందెం కోళ్లు, ఇద్దరు వ్యక్తులను, రూ.1720 నగదు స్వాధీనం చేసుకున్నారు. 
  • 2018 ఫిబ్రవరి 21న జైపూర్‌ సర్కిల్‌ పరిధిలోని శ్రీరాంపూర్‌లో కోడి పందెల స్థావరంపై దాడిచేసి రెండు కోడి పుంజులను, 14 మందిని అరెçస్ట్‌ చేశారు. వీరివద్ద నుంచి రూ.22,850 నగదు స్వాధీనం చేసుకున్నారు.
  • 2018 ఫిబ్రవరి 28న లక్సెట్టిపేట మండల కేంద్రంలోని శివారు ప్రాంతాల్లో కోడి పందెం స్థావరాలపై స్థానిక పోలీసులు దాడిచేసి మూడు కోడి పుంజులు, ఐదుగురు వ్యక్తులను అరెçస్ట్‌ చేశారు. వీరి నుంచి రూ.2030 నగదు స్వాధీనం చేసుకున్నారు.

చర్యలు తీసుకుంటాం
ప్రభుత్వం నిషేధించిన ఏ ఆటలపైనా అయినా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. సంక్రాంతి పండుగకు కోటి పందెలు అధికంగా ఆడుతుంటారు. ఇది తమిళనాడు, సీమాంధ్ర ప్రాంతాల నుంచి మనకు వచ్చింది. కోడి పందెలపై హైకోర్టు నిషేధం విధించింది. వీటిపై ఇప్పటికే టాస్క్‌ఫోర్స్‌ టీమ్‌ తిరుగుతోంది. గతంలో కేసులు నమోదు చేశాం. సంక్రాంతి పండుగ సందర్భంగా కోడి పందెలపై ప్రత్యేక దృష్టి సారించాం. కోడి పందెలు, పేకాట, మట్కా తదితర నిషేధిత ఆటలపై సమాచారం ఇచ్చి పోలీసులకు సహకరించాలి. కోడి పుంజులు ఆడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. 

మరిన్ని వార్తలు