ప్రయాణికులు పోగొట్టుకున్న బ్యాగు అందజేత  

4 Apr, 2018 14:16 IST|Sakshi
బ్యాగును అందజేస్తున్న పోలీసులు

వికారాబాద్‌: రైలులో ఓ బ్యాగు అనుమానస్పదంగా కనిపించడంతో ప్రయాణికులు ఆందోళన చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు బ్యాగును పరిశీలించి ప్రయాణికులు దానిని పోగొట్టుకున్నట్టు గుర్తించి చివరికి వారికి అందజేశారు. వికారాబాద్‌ ఆర్‌పీఎఫ్‌ ఎస్సై ఎంబీ. రాథోడ్‌ కథనం ప్రకారం వివరాలు.. విశాఖపట్నం నుంచి ముంబయి వెళ్లే ఎల్‌టీటీ ఎక్స్‌ప్రెస్‌లో సోమవారం మధ్యాహ్నం సమయంలో కాజీపేట రైల్వేస్టేషన్‌లో భార్గవ్‌ కుటుంబం ముంబయి వెళ్లడానికి రైలు ఎక్కింది.

వీరు బీ2లో సీట్లు బుక్‌ చేసుకోగా రైలు ఎక్కిన సమయంలో బీ1లో ఎక్కారు. అక్కడి నుంచి బీ2లోకి వచ్చి తమ సీట్లలో కూర్చున్నారు. ఈ క్రమంలో లగేజ్‌లో నుంచి ఒక బ్యాగును బీ1లోనే మరిచిపోయారు. రైలు సికింద్రాబాద్‌ దాటి వికారాబాద్‌ వస్తుండగా కొందరు  ప్రయాణికులు బ్యాగ్‌ అనుమానస్పదంగా ఉండటాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వికారాబాద్‌కు రైలు చేరుకోగానే ఆర్‌పీఎఫ్, జీఆర్‌పీ పోలీసులు బ్యాగును స్వాధీనం చేసుకుని పరిశీలించారు.

అందులో పది తులాల వరకు బంగారు ఆభరణాలు, దుస్తులతోపాటు ఓ వివాహ ఆహ్వాన పత్రిక లభించింది. పెండ్లికార్డులో ఉన్న నంబర్‌కు ఫోన్‌ చేసి బ్యాగు పోగొట్టుకున్న వారి వివరాలు సేకరించారు. అనంతరం వారికి ఫోన్‌ చేసి బ్యాగు వికారాబాద్‌ పీఎస్‌లో ఉందని వారికి తెలియజేశారు.

దీంతో వారు మంగళవారం వికారాబాద్‌ ఆర్‌పీఎఫ్‌  పీఎస్‌కు చేరుకోగా పోలీసులు భార్గవ్‌కు చెందిన విలువైన వస్తువులతో కూడిన బ్యాగును అందజేశారు. ఈ సందర్భంగా భార్గవ్‌ పోలీసులకు «కృతజ్ఞతలు తెలిపి ఆనందం వ్యక్తం చేశారు. రైలులో ప్రయాణిస్తున్నపుడు జాగ్రత్తగా ఉండాలని ఎస్సై రాథోడ్‌ సూచించారు.  

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా