మద్యం అక్రమ రవాణాకు ‘చెక్‌’

7 Jun, 2020 03:55 IST|Sakshi
కృష్ణా జిల్లా మంతెనలో పోలీసులు స్వాధీనం చేసుకున్న అక్రమ మద్యం

రాష్ట్ర సరిహద్దుల్లో పోలీసుల ముమ్మర తనిఖీలు

తెలంగాణ, పంజాబ్,కర్ణాటక నుంచి భారీగా తరలివస్తున్న మద్యానికి అడ్డుకట్ట

జగ్గయ్యపేట, దాచేపల్లి, తిరువూరు, మైలవరం, నూజివీడు ప్రాంతాల్లో ఎస్‌ఈబీ నిఘా

మొక్కజొన్న ముసుగులో పంజాబ్‌ నుంచి తెచ్చిన రూ.20 లక్షల మద్యం పట్టివేత

సాక్షి, అమరావతి/అమరావతి బ్యూరో: నాటుసారా తయారీపై ఉక్కుపాదం మోపుతున్న స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో(ఎస్‌ఈబీ) ఇసుక, మద్యం అక్రమ రవాణాపైనా ప్రత్యేక దృష్టి సారించింది. ఇందుకోసం రాష్ట్ర సరిహద్దుల్లో ముమ్మర తనిఖీలు చేపట్టింది. తెలంగాణ, పంజాబ్, కర్ణాటక నుంచి భారీగా తరలి వస్తున్న మద్యానికి చెక్‌ పెడుతోంది. జగ్గయ్యపేట, దాచేపల్లి, తిరువూరు, మైలవరం, నూజివీడు ప్రాంతాల్లో ఎస్‌ఈబీ నిఘా పెట్టింది. మొక్కజొన్న ముసుగులో పంజాబ్‌ నుంచి తీసుకొచ్చి పొలంలోని గడ్డి వాములో దాచిన రూ.20 లక్షల మద్యాన్ని శనివారం స్వాధీనం చేసుకుంది.

పకడ్బందీ చర్యలతో..
► ఎస్‌ఈబీ సరిహద్దు ప్రాంతాల్లో పోలీసులను రంగంలోకి దించి కట్టుదిట్టమైన చర్యలు చేపట్టడంతో ఇతర రాష్ట్రాలకు చెందిన మద్యం పట్టుబడుతోంది. 
► సోదాల సమయంలో పట్టుబడుతున్న మద్యం అత్యధికంగా తెలంగాణ నుంచే వస్తున్నట్టు తేలింది. ఈ దృష్ట్యా సరిహద్దులోని జగ్గయ్యపేట, దాచేపల్లి, మైలవరం, తిరువూరు, నూజివీడు తదితర ప్రాంతాల్లోని చెక్‌ పోస్టుల్లో పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.
► గత నెల 29న తెలంగాణ నుంచి వస్తున్న 1,056 మద్యం బాటిల్స్‌ను మాచర్ల వద్ద ఎస్‌ఈబీ పోలీసులు పట్టుకున్నారు. 
► గత నెల 28న తెలంగాణాణ నుంచి ఏపీకి తరలిస్తున్న 284 మద్యం బాటిల్స్‌ను కర్నూలు ఎస్‌ఈబీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
► గత నెల 27న కర్ణాటక నుంచి ఏపీకి అక్రమంగా గోనె సంచుల్లో తరలిస్తున్న 543 మద్యం బాటిల్స్‌ను పట్టుకున్నారు.

మొక్కజొన్న లోడుతో పంజాబ్‌ మద్యం
► శుక్రవారం కృష్ణా జిల్లా కంకిపాడు పరిధిలోని మంతెన గ్రామ శివారులో రూ.20 లక్షల విలువైన 5,162 అక్రమ మద్యం బాటిల్స్‌ను పోలీసులు గుర్తించారు.
► విజయవాడ పోలీస్‌ కమిషన్‌ ద్వారకా తిరుమలరావు ఆదేశాలతో ఎస్‌ఈబీ పోలీసులు నిర్వహించిన మెరుపు దాడుల్లో పంజాబ్‌కు చెందిన అక్రమ మద్యం పట్టుబడటం గమనార్హం.
► కంకిపాడు మండలం మంతెన గ్రామానికి చెందిన వీరంకి వెంకటరమణ మండల స్థాయిలో పేకాట, కోడి పందేల నిర్వాహకుడిగా పేరుంది.
► అతనికి విజయవాడ కృష్ణలంకకు చెందిన లారీ బ్రోకర్‌ షేక్‌ మహబూబ్‌ సుబానీ, నిడమానూరుకు చెందిన లారీ యజమానులు కొండపల్లి ఆనంద్, షేక్‌ రఫీ ముఠాగా ఏర్పడి అక్రమ మద్యం సరఫరాకు పక్కా ప్రణాళిక రచించినట్టు పోలీసులు గుర్తించారు. 
► సుబానీ ద్వారా పంజాబ్‌లో తయారైన 142 కేసుల మద్యాన్ని కోల్‌కతా నుంచి మొక్కజొన్న లారీలో పంపించగా.. దానిని కంకిపాడు మండలం మంతెనలోని తన పొలం గల గడ్డివాములో వీరంకి వెంకటరమణ దాచి ఉంచాడు.
► పక్కా సమాచారం అందడంతో ఎస్‌ఈబీ అధికారులు మెరుపుదాడి చేసి రూ. 20 లక్షల విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.
► నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు అక్రమ మద్యంపై లోతుగా విచారణ జరుగుతోంది.

అక్రమ మద్యంపై కఠిన చర్యలు
ప్రజారోగ్యంతో ఆడుకునేలా నాటుసారా తయారీ, అక్రమంగా మద్యం తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. పొరుగు రాష్ట్రాల నుంచి మద్యం అక్రమంగా తరలించే వారిపై నిఘా పెట్టాం. బోర్డర్‌ చెక్‌పోస్టుల్లో సోదాలు ముమ్మరం చేశాం. మద్యం తరలిస్తూ పట్టుబడే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నాం. ఒక్కసారి పట్టుబడినా అటువంటి వారిపై నిఘా పెడుతున్నాం. అన్ని జిల్లాల్లో రాత్రి వేళ కూడా గస్తీ ముమ్మరం చేశాం.
– వినీత్‌ బ్రిజ్‌లాల్, కమిషనర్, ఎస్‌ఈబీ

మరిన్ని వార్తలు