అశ్లీల వెబ్‌సైట్లతో కాలయాపన.. ఓ జంటను..

3 Jun, 2019 12:29 IST|Sakshi

సాక్షి, నల్గొండ : హాజీపూర్ సైకో కిల్లర్  శ్రీనివాస్‌రెడ్డి నేర చరితపై పోలీసులు లోతుగా విచారిస్తున్నారు. శ్రీనివాస్‌రెడ్డి ఫోన్‌లో అశ్లీల వెబ్‌సైట్ల సెర్చింగ్‌లే  అధికంగా ఉన్నట్లు పోలీసుల పరిశీలనలో తెలిసింది. సెల్‌ఫోన్‌లో అశ్లీల వెబ్‌సైట్‌తో కాలయాపన చేయడంతోనే బాలికలపై అఘాయిత్యాలకు పాల్పడి ఉండొచ్చని వారు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా కొన్ని రోజుల క్రితం తమ ప్రాంతంలో మామిడి తోటలు చాలా ఉన్నాయని.. తెలిసిన వారి తోటల్లో మిమ్మల్ని పనికి కుదర్చుతానని వరంగల్‌ నుంచి ఓ జంటను శ్రీనివాస్‌ తీసుకొచ్చినట్లు సమాచారం. వారిని కొంతకాలంగా తన వద్ద లిఫ్ట్‌ మెకానిక్‌ పనిలో సహాయం చేయించుకున్నట్లు తెలిసింది. అనంతరం ఆ దంపతుల జాడ తెలియరాలేదని గ్రామస్తులు అంటున్నారు.  

శ్రీనివాస్‌రెడ్డి నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు గత శనివారం పోలీస్‌ కస్టడీకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా శనివారం మధ్యాహ్నం కర్కలమ్మ కుంట, మైసిరెడ్డిపల్లి గ్రామ పరిసరాల్లో నిందితుడిని తిప్పినట్లు తెలిసింది. దీంతో శ్రీనివాస్‌రెడ్డి ఇచ్చిన సమాచారంతో ఆదివారం కర్కలమ్మ కుంట, మైసిరెడ్డిపల్లి గ్రామ పరిసరాల్లో వెతకగా కల్పన, మనీషాలకు సంబంధించిన ఆధార్, స్కూల్‌ ఐడీ కార్డు లభ్యమయ్యాయి. నాలుగేళ్ల క్రితం తుంగని కల్పన హాజీపూర్‌ నుంచి మైసిరెడ్డిపల్లికి వెళ్తుండగా మార్గమధ్యలో అఘాయిత్యానికి పాల్పడిన తర్వాత మృతదేహాన్ని గన్నీ బ్యాగులో కుక్కి మర్రి బావిలో పడేశాడు.

కల్పన స్కూల్‌ యూనిఫాం, టిఫిన్‌ బాక్స్‌నూ బావిలో పడేశాడు. తర్వాత అటువైపు వెళ్లిన శ్రీనివాస్‌కి కల్పన స్కూల్‌ ఐడీ కార్డు కనిపించడంతో పక్కనున్న చెట్ల పొదల్లోకి విసిరేశాడు. మనీషానూ మర్రి బావి వద్దకు తీసుకొచ్చి అఘాయిత్యానికి పాల్పడిన తర్వాత మృతదేహన్ని బావిలో పూడ్చివేశాడు. మనీషా ఆధార్, సెల్‌ఫోన్‌ తీసుకొని పోలీస్‌ స్టేషన్‌ సమీపంలోని కర్కలమ్మ కుంటలో పడేశాడు. నిందితుడు ఇచ్చిన సమాచారం మేరకు మండల కేంద్రంలోని పోలీస్‌ స్టేషన్‌ సమీపంలో గల కర్కలమ్మ కుంటలో ఆదివారం పోలీసులు జల్లెడ పట్టారు. 4 గంటలపాటు వెతకగా మనీషా ఆధార్‌ కార్డు దొరికింది. కానీ సెల్‌ఫోన్‌ లభించలేదు.

>
మరిన్ని వార్తలు