‘ఆధార్‌’ మోసంపై పోలీసుల దర్యాప్తు

11 Jul, 2019 11:05 IST|Sakshi

నిందితుడిపై చీటింగ్‌ కేసు నమోదు

దీక్షకుంట, శివునిపల్లి బ్యాంక్‌లోనూ విచారణ

సాక్షి, స్టేషన్‌ఘన్‌పూర్‌: మండలంలోని నమిలిగొండ గ్రామంలో ఆధార్‌ కార్డుల్లో జిల్లా, రాష్ట్రం పేర్లను మారుస్తానంటూ ఓ వ్యక్తి ఇటీవల హైటెక్‌ మోసం చేసి లక్షలాది రూపాయలు అవినీతికి పాల్పడిన విషయమై ఘన్‌పూర్‌ సీఐ రాజిరెడ్డి ఆదేశాల మేరకు స్థానిక పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. స్థానిక సీఐ రాజిరెడ్డి, నమిలిగొండ గ్రామానికి చెందిన బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాల పునర్విభజనలో భాగంగా స్టేషన్‌ఘన్‌పూర్‌ మండలం జనగామ జిల్లాలో చేరింది.

దీంతో ఆధార్‌కార్డుల్లో ఉన్న అడ్రస్‌లు నూతనంగా ఏర్పడిన జిల్లా, రాష్ట్రం పేర్లను మారుస్తామంటూ గత నెల 29న ఓ యువకుడు ల్యాప్‌టాప్‌తో గ్రామంలోకి వచ్చాడు. ముందుగా  స్థానిక సర్పంచ్‌ను సంప్రదించిన అతను తాను కలెక్టర్‌ ఆఫీస్‌ నుంచి వచ్చానని, తన పేరు వినయ్‌కుమార్‌ అని పరిచయం చేసుకున్నారు. ఆధార్‌కార్డులో వివరాలను మార్చడంతో రైతులకు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అందించే రూ.2వేలను అందిస్తామని నమ్మబలికాడు. దీంతో సర్పంచ్‌ గ్రామంలో దండోరా వేయించగా  ఆ యువకుడు గ్రామపంచాయతీ కార్యాలయంలో మూడు రోజుల పాటు వరుసగా గ్రామస్తుల నుంచి ఆధార్‌కార్డు వివరాలు, వేలిముద్రలను అతని ల్యాప్‌టాప్‌లో నమోదు చేసుకున్నాడు.

అనంతరం ఐదు రోజుల తర్వాత ఆయా వ్యక్తుల బ్యాంకు ఖాతాల్లో ఉన్న డబ్బులు రూ.600 నుంచి రూ.1000 వరకు కట్‌ అయ్యాయి. అతడు తమకు అందించిన ఫోన్‌ నంబర్లు (6301431500, 9618092768) స్విచాఫ్‌ చేసి ఉందని, దీంతో తాము మోసపోయామని గుర్తించినట్లు బాధితులు తెలిపారు. విషయం తెలుసుకున్న బా«ధితులు లబోదిబోమంటూ గ్రామ సర్పంచ్‌తో పాటు పెద్ద మనుషులను ఆశ్రయించగా బాధితుల తరఫున మాజీ ఎంపీటీసీ సభ్యుడు, గ్రామస్తుడు పులి యాకయ్య బుధవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మొత్తంగా రూ.5లక్షల వరకు గ్రామస్తులందరూ నష్టపోయినట్లు తెలిసింది. 

నిందితుడి స్వగ్రామంలో దర్యాప్తు
హైటెక్‌ మోసగాడు గ్రామస్తులకు అందించిన వివరాలతో నెక్కొండ మండలం దీక్షకుంట సమీపాన సీతారాంపూర్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించిన పోలీసులు సీఐ రాజిరెడ్డి, ఎస్సై రవియాదవ్‌ ఆదేశాల మేరకు ఆ గ్రామ సర్పంచ్‌ ఉప్పలస్వామి, ఎంపీటీసీ రజాక్‌యాదవ్‌తో కలిసి ఇద్దరు కానిస్టేబుళ్లు బుధవారం వెళ్లారు. అయితే అతడు అక్కడ లేడని, హైదరాబాద్‌లో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు టీమ్‌ంగా వెళ్లి ముమ్మర దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే సీతారాంపూర్‌కు వెళ్లిన నమిలిగొండ గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ సభ్యులు మోసగాడి తల్లిదండ్రులతో పాటు బంధువులకు విషయం తెలిపి నిందితుడి ఆచూకీ కోసం పోలీసుల సహాయంతో వెతుకుతున్నారు.

అదేవిధంగా నమిలిగొండ గ్రామం శివునిపల్లి ఎస్‌బీఐ బ్యాంకు పరిధిలోకి రాగా బ్యాంకులోనూ ఎస్‌ఐ రవియాదవ్‌ ఆధ్వర్యంలో పోలీసులు విచారణ చేపట్టారు. ఆయా ఖాతాదారుల అకౌంట్ల నుంచి డబ్బులు ఏవిధంగా కట్‌ అయ్యాయని విచారించగా బ్యాంకులకు అనుసంధానంగా ఉండే కస్టమర్‌ సర్వీస్‌ పాయింట్‌ సెంటర్‌ల నుంచి డబ్బులు కట్‌ అయినట్లు తెలిసినట్లు పోలీసులు తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు నిందితుడి పై చీటింగ్‌ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఏది ఏమైనా త్వరితగతిన నిందితుడిని పట్టుకుని బాధితులకు న్యాయం చేస్తామని సీఐ తెలిపారు. 

మరిన్ని వార్తలు